20 నెలల తర్వాత పెళ్లి కళ వచ్చేసింది..! | After lull of 20 Months, Big Fat Weddings Back | Sakshi
Sakshi News home page

20 నెలల తర్వాత పెళ్లి కళ వచ్చేసింది..!

Published Sun, Nov 21 2021 3:30 PM | Last Updated on Sun, Nov 21 2021 3:30 PM

After lull of 20 Months, Big Fat Weddings Back - Sakshi

సాక్షి, ముంబై: ఫంక్షన్‌ హాళ్లలో సుమారు 20 నెలల తరువాత పెళ్లి మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. కరోనా కారణంగా కొందరు మాత్రమే సాదాసీదాగా పెళ్లి తంతు పూర్తిచేసి చేతులు దులుపేసుకున్నారు. కాని గత సంవత్సరన్నర కాలంగా భారీగా, ఆర్భాటంగా పెళ్లిళ్లు నిర్వహించలేకపోయారు. ముఖ్యంగా కరోనా కేసులు పెరగడంతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది శుభకార్యాలు, పెళ్లిలు వాయిదా వేసుకున్నారు. దీంతో ఫంక్షన్‌ హాళ్లన్నీ బ్యాండు మేళాలు, మంగళవాయిద్యాల చప్పుళ్లు లేక మూగబోయాయి. కానీ ఈనెల 15వ తేదీ నుంచి తిరిగి పెళ్లిళ్లకు ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం లాక్‌డౌన్‌లోని అనేక ఆంక్షలు సడలించడంతో గతంలో మాదిరిగా శుభకార్యాలు నిర్వహించడం ప్రారంభించారు. అదేవిధంగా గత సంవత్సరం వాయిదా వేసుకున్న పెళ్లిళ్లన్నీ ఇప్పుడు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో ఫంక్షన్‌ హాళ్లు, స్కూల్‌ మైదానాలు, బంక్వెట్‌ హాళ్లని బుకింగ్‌లతో ఫుల్‌ అయ్యాయి.

పరిమిత సంఖ్యలో ఆహుతులతో..
గత సంవత్సరం కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలైన సంగతి తెలిసిందే. కాని లాక్‌డౌన్‌కు ముందు ముహూర్తాలు పెట్టుకుని ఫంక్షన్‌ హాళ్లు బుకింగ్‌ చేసుకున్న వారికి కరోనా అంక్షలకు కట్టుబడి వివాహాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వధూవరుల వైపునుంచి కేవలం 20 మంది చొప్పున బంధువులు మాత్రమే వివాహానికి హాజరుకావాలని ఆంక్షలు విధించింది. ఆ తరువాత కరోనా కొంత అదుపులోకి రావడంతో ఈ సంఖ్యను 50కు పెంచింది. అనంతరం కరోనా రెండో వేవ్‌లో కోవిడ్‌ కేసులు పెరగడంతో కొద్ది నెలలపాటు తిరిగి శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. దీంతో అనేక మంది పెళ్లిలు వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కరోనా అదుపులోకి రావడంతో వంద మంది చొప్పున బంధువులు పెళ్లికి హాజరయ్యేందుకు ప్రభుత్వం, బీఎంసీ నుంచి అనుమతి లభించింది. కానీ కోవిడ్‌ భయంతో శుభకార్యాలు చేసేందుకు అనేకమంది సాహసం చేయలేకపోయారు.

చదవండి: (సినిమా చెట్టు: ఆ చెట్టు కింద 300 సినిమాల షూటింగ్‌..)

చివరకు కొందరు దగ్గర బంధువుల మధ్య పెళ్లి తంతు పూర్తి చేసినప్పటికీ ఆర్భాటంగా నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం కోవిడ్‌ పూర్తిగా కాకపోయినా 90 శాతం అదుపులోకి రావడంతో ధైర్యంగా శుభకార్యాలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ ఫంక్షన్‌ హాలు బుకింగ్‌ చేసుకునే సమయంలో కోవిడ్‌ నియమాలు పాటించేలా హాలు యాజమాన్యాలు హామీ పత్రం తీసుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు తక్కువ సంఖ్యలో బంధువులను ఆహ్వానించాలని చెబుతున్నారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తారా అన్న విషయంలో అనుమానం నెలకొంది. సుమారు 20 నెలల తరువాత పెళ్లిళ్లు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలించడంతో తమ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే కేసుల తీవ్రత తగ్గినప్పటికీ కరోనా విషయంలో ఇప్పటికీ అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

భాజా భజంత్రీలకు మళ్లీ ఉపాధి
పెళ్లిలో తాళి కట్టే సమయంలో వాయించే భాజాభజంత్రీలు, గట్టి మేళం, మంగళవాయిద్యాలను కూడా బుక్‌ చేసుకున్నారు. ఇప్పుడు వీరికి కూడా ఉపాధి లభించింది. గత సంవత్సరన్నర నుంచి బేరాలు లేక వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాయిద్యాల వినియోగం లేకపోవడంతో అవి తప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు చేతి నిండా పని దొరకడంతో అప్పులుచేసి వాయిద్యాలకు మరమ్మతులు చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చెల్లాచెదురైన వాయిద్యాల బృందాలు ఇప్పుడు ఒకచోట చేరి ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. మొన్నటి వరకు వాయిద్యాలకు డిమాండ్‌ లేకపోవడంతో బందం సభ్యులు ఖాళీగా గడిపారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో పోటీ పడుతూ బుకింగ్‌ చేసుకుంటున్నారు. కరోనా తొలగి తిరిగి మంచి రోజులు రావడంతో ఆయా బృందాల కళ్లలో ఆనందం కనబడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement