ప్రతీకాత్మక చిత్రం
వికారాబాద్ అర్బన్ : అధిక జేష్ఠమాసం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో గత పది రోజులుగా పలు శుభకార్యాలు కొనసాగుతున్నా.. పెళ్లిళ్లకు అనువైన మూహూర్తాలు మాత్రం దొరకలేదు. ఈ నెల 27, 30వ తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు.
జూలై 15 నుంచి ఆషాఢ మాసం రానున్న నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవు. దీంతో జూలై మొదటి వారంలోనే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తీపి గుర్తుగా...
మనిషి జీవితంలో ఒకే సారి చేసుకునే పండుగ పెళ్లి. ఈ మూడు ముళ్ల బంధం, తలంబ్రాల కోలాహలం, ఏడు అడుగల నడక.. వందేళ్ల తీపి గుర్తులుగా ఉండిపోవాలని వధూవరులు, తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈ సంబరాన్ని ఎప్పుడైనా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఫొటోగ్రఫీ, వీడియోలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇందుకోసం ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇటీవల కొందరు డ్రోన్ కెమెరాలతో పెళ్లి వేడుకలను చిత్రీకరిస్తున్నారు. గాలిలో తేలియాడుతూ అత్యంత క్వాలిటీగా ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో డ్రోన్ కెమెరాలకు ఆదరణ పెరిగింది.
పెళ్లి మండపంలోనే రెండు, మూడు స్క్రీన్లు ఏర్పాటు చేసి పెళ్లి వేడుకను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు పెద్దపెద్ద పట్టణాల్లో, ధనికుల పెళ్లి వేడుకల్లో కనిపించేవి. ఇప్పుడు వికారాబాద్, తాండూరు, పరిగి లాంటి చిన్నచిన్న పట్టణాల్లో సందడి చేస్తున్నాయి.
మండపాలకు డిమాండ్...
పెళ్లి వేడుకలను వైభవంగా చేయాలంటే పెళ్లి మండపాలను ఆశ్రయించాల్సిందే. అక్కడైతేనే అతిథులకు అన్ని రకాల సౌకర్యాలు, విశాలమైన స్థలం ఉంటుంది. ఇందుకోసం పెళ్లి పెద్దలు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. దీంతో పెళ్లి మండపాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ ఫంక్షన్ హాల్ దొరికే పరిస్థితి లేదు. దీంతో పాటు, డెకరేషన్, క్యాటరింగ్, వీడియో, ఫొటోగ్రాఫర్లను సైతం ముందుగానే బుక్ చూసుకోవాలి.
శ్రావణమాసం, భక్తిమాసం...
హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భా వించేది శ్రావణమాసం. ఈ మాసంలో అత్యధిక మంది భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, భజ నలు, దీక్షలు చేస్తారు. ఈ నెల మొత్తం చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటా రు. ఆగస్టు 14వ తేదీ నుంచి శ్రావణ మాసం రానుంది.
ఆగస్టు మాసంలో దివ్య మైన మూహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. శ్రావణమాసం పండుగలకు, శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో పెళ్లిళ్ల వేడుకలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.
మంచి రోజులు..
గత నెల రోజులుగా శుభగడియల కోసం ఎదురు చూసిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి వేడుకలను జరిపించేందుకు రెడీ అవుతున్నారు. జూన్‌లో కొన్ని సుముహూర్తాలు ఉండటంతో నూతన గృహప్రవేశం, పిల్లలకు పుట్టు పంచలు వంటి కార్యక్రమాలు చేశారు.
నేటి బుధవారంతో పాటు ఈ నెల 30వ తేదీన మంచి ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. జూలై మాసంలో 1, 5, 6, 7తేదీల్లో మంచి గడియలు ఉన్నాయని పురోహితుడు వైభవలక్ష్మి ఆలయ అర్చకుడు అంబదాస్ తెలిపారు.
ఆగస్టు మాసంలో 15, 16, 17, 18, 19, 23, 24, 29, 30, 31వ తేదీల్లో, సెప్టెంబర్ 2, డిసెంబర్ 12, 14, 21, 22, 27, 28, 29, 30వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెప్పారు. తిరిగి 2019 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment