ఖర్చుకు వెనుకాడని సంపన్నులు
నెల రోజుల్లో 13 వేల వివాహాలు
ఇటీవల పారిశ్రామిక కుబేరుడు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక ఎంత ఆర్భాటంగా జరిగిందో అందరూ చూశారు. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాల వంటి అతిథులను పిలిపించారు. కానీ స్థానిక ధనవంతులు అంత స్థాయిలో కాకపోయినా అబ్బో అనిపించేలా తమ పిల్లల వివాహాలను జరిపిస్తున్నారు. సిలికాన్ సిటీలో ఇటువంటి పెళ్లిళ్ల పరిశ్రమ ప్రముఖంగా మారిపోయింది.
సాక్షి, బెంగళూరు: గతంలో పెళ్లి అనేది చాలా శాస్త్రోక్తంగా జరగాలని భావించేవారు. అయితే నేటి రోజుల్లో తమ తమ ఆడంబరాలను చాటుకోవడానికి సంపన్నులు, ఆఖరికి మధ్య తరగతివారు కోట్ల రూపాయలు వెదజల్లి వైభవోపేతంగా చేసుకుంటున్నారు. డబ్బులు ఉంటే చాలు.. ఇంద్ర భవనం వంటి ఫంక్షన్‌హాల్స్, టూరిస్టు ప్రదేశాలలో మూడుముళ్ల వేడుకలు జరుగుతాయి. అందులోనూ వెడ్డింగ్ ప్లానర్ల పాత్ర పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాను తీసినట్లుగా పెళ్లి తంతును మహా ఆర్భాటంగా చేయడం సిలికాన్ సిటీలో ట్రెండ్ అయ్యింది.
వెడ్డింగ్ ప్లానర్లు
గతంలో పెళ్లి అంటేనే ముహూర్తం, ఆభరణాలు, బట్టల కొనుగోలు, ఆహ్వాన పత్రిక, ఫంక్షన్ హాల్, ఫోటో, వీడియో గ్రాఫర్లు తదితర ఎన్నో అంశాలు మదిలో మెదులుతాయి.. ఇలా హడావుడి పెళ్లిళ్ల ఒత్తిడిని వెడ్డింగ్ ప్లానర్లు తప్పిస్తున్నారు. పెళ్లి బాద్యతలను వెడ్డింగ్ ప్లానర్లకు అప్పగిస్తే పెళ్లి పనులు అన్నీ వారే చూసుకుంటారు. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్లు ప్రస్తుతం బెంగళూరు ఎంతో వేగంగా పెరిగిపోతున్నారు.
అన్ని హంగులూ ఉండాలి మరి
సాధారణంగా ధనవంతులు తమ కుటుంబంలోని పెళ్లిళ్ల ద్వారా తాము ఎంత శ్రీమంతులమో తెలియజేయాలని అనుకుంటారని, అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా పెళ్లిళ్లు జరిగిస్తారని కొందరు ప్లానర్లు తెలిపారు. ఈ గ్రాండియర్, రిచ్‌నెస్ కోసం భోజనాల దగ్గరి నుంచి అతిథులకు ఇచ్చే గిఫ్ట్‌ల వరకు రాజీ పడడం లేదు. కొంతమంది శ్రీమంతులు తమ పెళ్లిళ్లలో సెలబ్రెటీలు ఉండాలని కోరుకుంటారని ప్లానర్లు తెలిపారు. పెళ్లిలో సినిమా, టీవీ ప్రముఖ నటీనటులు, మోడల్స్ పాల్గొనేలా చూడమని కోరుతుంటారు. మధ్య తరగతి కుటుంబాల కోసం రూ. 15 లక్షల నుంచి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ఒకవేళ గ్రాండ్‌గా పెళ్లి జరగాలంటే ఫుల్ ప్యాకేజీ కింద కనీసం కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఎవరూ వెనుకాడకుండా లగ్జరీ పెళ్లిళ్లకు సరే అంటున్నారు.
నెలరోజుల్లో రూ.900 కోట్లపైనే
వివాహం ఎంతో గ్రాండ్‌గా జరగాలి... అందరూ మన పెళ్లి కూడా చర్చించుకోవాలి అనే క్రేజ్ కర్ణాటకలో పెరిగిపోతోంది. ఇతర జిల్లాల నుంచి బెంగళూరుకు విచ్చేసి ఘనంగా పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు. బెంగళూరులో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య సుమారు 13 వేలకు పైగా పెళ్లిళ్లు ఉన్నట్లు ప్లానర్లు తెలిపారు. ఈ సమయంలో డెకరేషన్, సెట్‌డిజైనర్, షామియానాలు, మేకప్ కళాకారులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యాండ్ సెట్, లైటింగ్, కేటరింగ్, ఆర్కెస్ట్రా, ఆభరణాల కొనుగోలు ఇలా తదితర అంశాల కోసం రూ. 900 కోట్ల మేర లావాదేవీలు జరిగే అవకాశం ఉందని వెడ్డింగ్ ప్లానర్లు అంచనా వేస్తున్నారు. ఇక కొందరైతే సముద్ర తీరం, రాజ ప్యాలెస్, అందమైన పరిసరాలు, ఖరీదైన స్టార్ హోటళ్లలో కొద్దిపాటి సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. బెంగళూరు చుట్టుపక్కల గడిచిన నెల రోజుల్లో సుమారు 9 డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరిగాయి. మరో 17 పెళ్లిళ్లు నిశ్చమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి డెస్టినేషన్ వెడ్డింగ్ సంఖ్య 10 శాతం పెరిగినట్లు ప్లానర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment