స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు
దూద్‌బౌలి: ఫంక్షన్ హాళ్లను కేంద్రంగా చేసుకుని ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని హుస్సేనీఆలం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చార్మినార్ ఏసీపీ అంజయ్య, హుస్సేనీఆలం ఇన్‌స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి మైలార్‌దేవ్‌పల్లి కింగ్ కాలనీకి చెందిన మహ్మద్ ఆఫ్రిది అఫ్జల్ ఓ ఫంక్షన్ హాల్‌లో వీడియోగ్రాఫర్‌గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను వివాహాది శుభకార్యాలకు వచ్చే వారి బైక్‌లను చోరీ చేసి విక్రయించేవాడు. కొద్ది రోజుల క్రితం ఫతేదర్వాజాలోని మహరాజా ఫంక్షన్ హాల్‌లో ఓ శుభకార్యానికి హాజరైన మహ్మద్ అక్బర్ అనే వ్యక్తి తన బజాజ్ సిటీ–100 వాహనం కనిపించకపోవడంతో హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సదరు వాహనానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్ పోస్టు ద్వారా అందింది.
ఈ వాహనం హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హుస్సేనీఆలం అడిషనల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు మూసాబౌలి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా సదరు బైక్‌పై వెళుతున్న అబ్దుల్లా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మహ్మద్ ఆఫ్రిది అఫ్జల్ తనకు బైక్‌ను విక్రయించినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అఫ్జల్ ఆఫ్రిదిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, చాంద్రాయణగుట్ట పరిధిలో 2, చార్మినార్ పరిధిలో 1, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున దొంగిలించినట్లు తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అడిషనల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్సైలు రాము నాయుడు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment