హిమాయత్‌నగర్: తనసొంత గ్రామానికి బస్సులో వెళ్లడం ఇష్టం లేక ఓ యువకుడు బైక్ చోరీ చేశాడు. అయితే ఆ బైక్ మధ్యలోనే మొరాయించడంతో మరో బైక్ చోరీ చేసి గ్రామానికి వెళ్లాడు. తాజాగా దొంగిలించిన బైక్‌ను విక్రయిస్తుండగా నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..మెదక్‌జిల్లా శంకరంపేటకు చెందిన దుర్గాప్రసాద్ గత నెల 24న దోమలగూడలో ఉంటున్న తండ్రి, తమ్ముడి వద్దకు వచ్చాడు. 26న రాత్రి తన గ్రామానికి వెళ్లేందుకు సిద్ధపడిన అతను బస్సులో వెళ్లడం ఇష్టం లేక దోమలగూడ ప్రాంతంలో ఓ బైక్‌ను చోరీ చేశాడు. కొద్దిదూరం వెళ్లగానే ఆ బైక్ మోరాయించడంతో దానిని అక్కడే వదిలేసి సమీపంలో ఉన్న మరో బైక్‌ను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం కింగ్‌కోఠిలో చోరీ చేసిన బైక్‌ను విక్రయిస్తుండగా పోలీసులు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు బైక్‌ను దోమలగూడ ప్రాంతంలో దొంగిలించినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఐదు స్టేషన్లలో కేసులు...
దుర్గప్రసాద్ బైక్‌లను దొంగలించడం కొత్తేమీ కాదు. 2013– 2015 మధ్య పలు ప్రాంతాల్లో ఐదు బైక్‌లను అపహరించాడు. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో 2, చిక్కడపల్లి పీస్ పరిధిలో 1, అఫ్జల్‌గంజ్, అబిడ్స్ పీఎస్ పరిధిలో ఒక్కోటి చొప్పున చోరీకి పాల్పడ్డాడు. నారాయణ గూడ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలుకు వెళ్లొచ్చినా తన తీరు మార్చుకోకుండా నారాయణగూడ, చిక్కడపల్లి పీఎస్ పరిధిలో బైక్‌ల చోరీకి పాల్పడి పోలీసులకు దొరికాడు. గురువారం నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment