పోలీసుల అదుపులో నిందితుడు నరేందర్
హిమాయత్‌నగర్: మనకు కాళ్లు నొస్తే ఏం చేస్తాం? కాసేపు ఆగి సేదతీరుతాం. లేకపోతే ఆటోలోనో, బస్సులోనో ఇంటికి వెళ్తాం. కానీ ఈ దొంగ తీరే వేరు. మంచిగా మద్యం తాగి, రోడ్డుపై నాలుగడుగులు వేస్తాడో లేదో కాళ్లు నొస్తున్నాయని కనిపించిన బైక్‌ను తీసుకొని వెళ్లిపోతాడు. నకిలీ తాళంతో బైక్‌లను స్టార్ట్ చేసుకొని వెళ్లే ఇతగాడు... అందులోని పెట్రోల్ అయిపోయేంత వరకు వెళ్లి, అక్కడే దాన్ని వదిలేస్తాడు. ఈ విచిత్ర దొంగ దోమలగూడకు చెందిన పి.నరేందర్. సచివాలయంలో స్వీపర్.
ఈ నెల 11న హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్డులోని కులదీప్ వైన్స్ వద్ద మద్యం తాగిన నరేందర్... అనంతరం స్ట్రీట్ నెంబర్–16 వద్ద నకిలీ తాళంతో బైక్‌ను దొంగి లించాడు. మరుసటి రోజే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో బైక్‌ని దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా నిందితుణ్ణి గుర్తించారు. కులదీప్ వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి, అక్కడికి వెంటనే వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
జైలుకెళ్లినా...
మద్యానికి బానిసైన నరేందర్ 2009లో మొట్టమొదటిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనం చేశాడు. ఇతడిపై మేడిపల్లి పీఎస్ పరిధిలో 2, ఉప్పల్ పీఎస్‌లో 2, చిక్కడపల్లి పీఎస్‌లో 7, నారాయణగూడ పీఎస్‌లో ఒక్క కేసు చొప్పున మొత్తం 13కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 12సార్లు జైలుకెళ్లినా నరేందర్ తీరు మారలేదు. జైలు నుంచి తిరిగి రాగానే మళ్లీ అదే పనిగా బైక్‌లను దొంగలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నాకేం గుర్తు...
నారాయణగూడ పోలీసులు నరేందర్‌ను విచారించగా... బైక్ ఎక్కడ పెట్టింది తనకు గుర్తు లేదని చెప్పాడు. అయితే చిక్కడపల్లి పీఎస్ పరిధిలో దొంగలించిన బైక్ దొరకడంతో నిందితుణ్ణి నారాయణగూడ పోలీసులు చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. చిక్కడపల్లి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పీటీ వారెంట్‌పై నిందితుణ్ణి కస్టడీకి తీసుకొని విచారిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment