ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి.. అన్నాడొక సినీ కవి. ఇళ్లన్నీ మామిడి తోరణాలతో మెరవాలి. వేద మంత్రోచ్ఛరణలు మార్మోగాలి. బాజాభజంత్రీలతో హోరెత్తాలి. ముచ్చటైన జంటను చూసిన బంధు జనం మురవాలి. మనసారా దీవెనల వర్షం కురవాలి. మాఘమాసం వచ్చేసింది. శుభ ముహూర్తాలకు వేళయ్యింది. ఒక్కటయ్యే జంటల కోసం పెళ్లి వేదిక నిరీక్షిస్తోంది. ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీల్లో జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో జరగనున్న పెళ్లిళ్లతో సందడి నెలకొంది.
విజయనగరం మున్సిపాలిటీ:ఈ నెల 5 నుంచి మార్చి 6 వరకూ మాఘమాసం కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా జరగనున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా పెళ్లిబాజాలు మోగనున్నాయి. జిల్లాలో వివాహాది శుభకార్యాలు చివరిగా మార్గశిర బహుళ నవమి అంటే డిసెంబర్ 30న జరిగాయి. తిరిగి 35 రోజుల విరామం అనంతరం బుధవారం నుంచి ఈ నెల 28 వరకూ జరగనున్నాయి. వీటిలో ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు చేసేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. మార్చి 7వ తేదీ నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలో కూడా వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండటంతో పురోహితులు, సన్నాయి మేళాలు, కల్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా రెండువేలకు పైగా జంటలు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నాయి.
జోరందుకున్న వ్యాపారాలు
హిందూ సంప్రదాయం ప్రకారం మూఢం రోజుల్లో పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు వంటి మంచి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రారు. దీంతో మూఢం ముగిసే వరకు వేచి ఉన్న వారంతా ఇప్పుడు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పెళ్ళిళ్లు నిశ్చయించుకున్న వారి ఇళ్లల్లో సందడి ప్రారంభమైంది. వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు పల్లె ప్రజలు పట్టణాలకు తరలి వస్తున్నారు. వీడియో గ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు కూడా చేతినిండా పని దొరికింది.
కల్యాణ మండపాలకు కళ
ఒకప్పుడు ఎవరి ఇంటి ముందు వారు పెళ్లి చేసుకునే సంప్రదాయం కనుమరుగై కల్యాణ మండపాలను ఆశ్రయించడం ఎక్కువైంది. కల్యాణ మండపంలో పెళ్ళి చేస్తే అయ్యే ఖర్చుకన్నా ఇంటి దగ్గర చేస్తే అయ్యే ఖర్చు ఎక్కువని అందరూ భావిస్తున్నారు. దీంతో ఆలయాలు, కల్యాణ మండపాలు, హోటళ్ళలో పెళ్లిళ్లకు ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. ఆర్థిక స్థితిగతులను బట్టి వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య అందుబాటులో ఉండేది. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. హైటెక్ కల్యాణ మండపాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రూ.కనీస అద్దె రూ.లక్షల్లో పలుకుతోంది. ఇటీవల కాలంలో కన్వెన్షన్ హాల్ సంప్రదాయం విస్తరిస్తుండటంతో మంచి రోజుల్లో వాటిని బుక్ చేయించేందుకు నిర్వాహకులు బారులు తీరుతున్నారు.
మేళతాళాలకుముందస్తు నమోదు
పెళ్లిళ్లల్లో కీలకమైన మంగళ వాయిద్యాలకు గిరాకీ పెరిగింది. పూర్తి స్థాయి బ్యాండ్ పార్టీలు దొరికే పరిస్థితి లేదు. కొందరు సన్నాయిమేళం తోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. ఒక్కొక్క సారి తక్కువ మందిగల బ్యాండ్ పార్టీ కూడా దొరకడం గగనమవుతోంది. రూ.20 వేల నుంచి రూ.లక్షల్లో బ్యాండ్ పార్టీల ధరలు పలుకుతున్నాయి.
మంచి రోజులు వచ్చేశాయి
మాఘమాసం ప్రారంభం కావటంతో మంచి రోజులు వచ్చేశాయి. ఈనెల 5 నుంచి పుష్యమాసం ముగిసిపోయింది. మాఘమాసంలో జిల్లాలో పెళ్ళిళ్ల సందడి ప్రారంభం కానుంది. ఈ మాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉండటంతో ఆ రోజుల్లో వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటి కానున్నాయి. – కామేశ్వరశర్మ, వేద పండితుడు, నెల్లిమర్ల
ఒకేరోజు నాలుగైదు వివాహాలు
ప్రస్తుతం పురోహితులకు కూడా జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఒక పురోహితుడు ఒకేరోజు నాలుగైదు వివాహాలు జరిపించే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క వివాహానికి స్థాయిని బట్టి రూ.7వేలకు పైగా తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment