పెళ్లిల్ల సీజన్ వచ్చేసింది. ఈనెల 17 నుంచి మే 13వ తేదీ వరకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాదిఫిబ్రవరి 16 వరకు మూఢాలు ఉండడంతో శుభకార్యాలు ముఖ్యంగా వివాహాలకు మూహూర్తాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం శుభ ఘడియలు రావడంతో పెళ్లిల్ల సందడి మొదలు కానుంది.
సాక్షి, వరంగల్ రూరల్: శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఉమ్మడి జల్లాలో ఊరూరా పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత డిసెంబర్ ఒకటి నుంచి ఈనెల 16 వరకు మూడాలు ఉండడంతో ఉండటంతో వివాహాది శుభకార్యాలు పెద్దగా జరగలేదు. 17 నుంచి ఫాల్గుణ మాసం శుభ ముహూర్తాలను మోసుకొస్తుండడంతో శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మే 13 వరకు బలమైన ముహూర్తాలు ఉండడంతో వేల సంఖ్యలో జిల్లాలో వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు.
కల్యాణ మండపాలు బిజీ
ఉమ్మడి జిల్లాలో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫొటో, వీడియో, పురోహితులు టెంట్ హౌస్‌లకు డిమాండ్ రానుంది. పట్టణాల్లో ఉన్న ప్రముఖ కల్యాణ మండపాలతో పాటు చిన్న, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాళ్లు, ట్రావెల్స్, ప్లవర్స్ డెకరేషన్ ట్రూప్స్, బ్యాండ్ వాలాలను ముందుగానే రిజర్వు చేసుకుంటున్నారు. చిన్న, పెద్ద హోటళ్లలో గదులు ఇప్పటికే హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా మారాయి.
ముచ్చటైన వేదికలు..
పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లే కీలకం. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలో కాన్ఫరెన్స్ హాళ్లు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇక పట్టణాల్లో కొంత మంది విశాలమైన మైదానాలను ఎంచుకుంటున్నారు. ఆకర్షణీకమైన సెట్టింగ్‌లు, ప్రత్యేక అలంకరణలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. సెట్టింగ్‌లు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆర్ట్ డైరెక్టర్లను రప్పిస్తున్నారు.
మే 13 వరకే...
ఈనెల 17 నుంచి మే 13 వరకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి. మే 14 నుంచి జూన్ 14 వరకు అధిక జేష్ఠ మాసం రావడంతో వివాహాలు లేకుండా పోయాయి. జూన్ 16 నుంచి జూలై 11 వరకు శుభమూహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో 17, 19, 23, 24, 26, మార్చి 2, 4, 6, 10, 14 ఏప్రిల్‌లో 1, 2, 5, 11, 19, 20, 22, 25, 27, 28, 29, 30, మే నెలలో 2, 9, 10వ తేదీల్లో అధికంగా ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు.
ఫాల్గుణ మాసం నుంచి..
ఫాల్గుణ మాసం నుంచి చాలా దివ్యమైన మూహూర్తాలు ఉన్నాయి. ఈనెల 17 నుంచి మే నెల 13వరకు మళ్లీ నెల రోజుల విరామం తర్వాత జూన్ 16 నుంచి జూలై 11 వరకు వివాహాలు జరగనున్నాయి. ఆషాఢమాసంలో మళ్లీ పెళ్లిళ్లు ఉండవు. నేను ఉగాది వరకు 22 పెళ్లి మూహుర్తాలు పెట్టాను. గతేడాది కంటే ఈసారి ఎక్కువగానే వివాహాలు జరగనున్నాయి.
–సముద్రాల సుదర్శనాచార్యులు,ప్రధాన అర్చకుడు, శ్రీనాగేంద్రస్వామి దేవాలయం, ఊకల్
Comments
Please login to add a commentAdd a comment