సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు వివిధ వాణిజ్య పరమైన సేవలు అందిస్తున్న సర్వీస్ కేంద్రాలు బాహాటంగా సేవాపన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఖాతాదారులు, వినియోగదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న వీరు ప్రభుత్వ ఖజానాకు నయాపైసా చెల్లించడం లేదు. కొన్ని సంస్ధలు స్లాబ్ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తుండగా, మరికొన్ని పూర్తిగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖాధికారుల ఉదాసిన వైఖరి, అవినీతి కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సేవా పన్నును నష్టపోతుంది.
సేవా పన్ను వసూలపై పట్టింపేది...
జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయినా సేవా పన్ను రాబట్టడంపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. వాస్తవంగా ఏడాది కంటే మందు కేవలం వస్తువు పన్ను మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఉండేది. సేవల పన్నుల వ్యవహారం కేంద్ర ఎక్సైజ్ శాఖ పరిధిలో వచ్చేది. జీఎస్టీ అమలుతో రెండు పన్నులు ఒకే పరిధిలోకి వచ్చాయి. ఏటా కోటిన్నర పైగా టర్నోవర్ గల డీలర్లు సగం కేంద్రం, సగం రాష్ట్రం పన్నుల పరిధికి వచ్చారు. ఇప్పటి వరకు కేంద్ర పరిధిలో ఉండి సేవా పన్నులు చెల్లించిన సంస్ధలు పాత విధానమే పునరావృత్తం చేస్తూ సేవాపన్నును ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. ఫంక్షన్ హాళ్లు, కోచింగ్ సెంటర్లు, ఆహార సంస్ధలు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.
రెండువేలకు పైనే....
హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రెండు వేలకు పైగానే ఉన్నాయి. వాటి దినసరి అద్దె, వివిధ చార్జీలు కలిపి కనీసం రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. శుభకార్యాలయాలు, ఇతర కార్యక్రమాలకు డిమాండ్ బట్టి నిర్వాహకులు చార్జీలు వసూలు చేస్తుంటారు. ఇందుకుగాను వారు రెండు రకాల రికార్డుల నిర్వహిస్తుంటారు. అధికారిక రికార్డులో వసూలు మొత్తం నమోదు కనిపించదు. అధికారికంగా రశీదు కూడా ఇవ్వడం లేదు. వాస్తవంగా ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్‌కు వసూలు చేసే మొత్తంలో సుమారు 18 శాతం జీఎస్టీ పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీఎస్టీ పరిధిలో నమోదైన వాటి సంఖ్య చాల తక్కువ. జీఎస్టీ కింద నమోదు హాళ్లు సైతం రికార్డుల తారుమారుతో మొక్కుబడిగా పన్నును చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నగరంలోని సుమారు 200 పైగా ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లను గుర్తించారు. వాటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపు కున్నారు.
కోచింగ్ సెంటర్లు అంతే...
తెలంగాణ ఏర్పాటు అనంతరం వివిధ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరింది. ప్రభుత్వం నోటిఫికేషన్లతో కోచింగ్ సెంటర్లపై కనక వర్షం కురుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కూడా నిరుద్యోగ యువత ఆసక్తి కనబర్చడం తో కోచింగ్ కేంద్రాలకు మరింత కలిసి వచ్చింది. వివిధ పరీక్షల కోచిం గ్‌ను బట్టి అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు. నగరంలో సుమారు మూడు వేలకు పైగా కోచింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. నిర్వాహకులు వసూలు చేసే ఫీజుల్లో జీఎస్టీ కింద కొంత పన్ను చెల్లించాల్సింది. ఆయితే జీఎస్టీ పరిధి కింద నమోదైన వాటి సంఖ్య వేళ్లపై లెక్కిం చ వచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్, ఏటీఎం. ఎస్‌ఎంఎస్, క్రెడిట్ కార్డు, ఆర్టీజీఎస్, ఫైనాన్స్ సం స్ధలు కూడా ఖాతాదారుల నుంచి, ఆహార సరఫ రా సంస్ధలు వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీల్లో సుమారు ఐదు నుంచి 18 శాతం వర కు జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కనీసం పదిశాతం కూడా పన్నులు చెల్లిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా పన్నుల వసూలుపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment