సాయినగర్ కాలనీ సమీపంలోని ఫంక్షన్‌హాల్ వద్ద ఇలా..
సాక్షి, శంషాబాద్: ఒకరి ఇంట్లోని శుభకార్యం మరో ఇంటికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఓ వైపు టపాసుల మోత.. మరో వైపు శబ్దాల హోరుతో పలు ఫంక్షన్‌హాళ్ల వద్ద అర్ధరాత్రి వరకు జరుగుతున్న కార్యక్రమాలకు సమీప కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది.
ఒకే చోట ఐదు..
►శంషాబాద్‌లోని సిద్ధంతి, నక్షత్ర, సాయినగర్ కాలనీ సమీపంలో ఒకే చోట ఐదు ఫంక్షన్‌హాళ్లు ఉన్నాయి. ఒకే చోట అధిక సంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సమీప కాలనీ వాసులకు వీటి శబ్దం కారణంగా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
పలుసార్లు ఫిర్యాదు..
►అనుమతి లేకుండానే అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున సౌండ్ బాక్సుల శబ్దాలు, టపాసుల మోతతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ విషయంపై కాలనీ వాసులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే సారి అన్ని ఫంక్షన్‌హాళ్లలో వేడుకలు జరిగినప్పుడు శబ్దం తీవ్రత మరింతగా బాధిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లేజర్ కాంతులపై నిషేధం..
►విమానాశ్రయానికి సుమారు 8 కిలో మీటర్ల వరకు ఎలాంటి లేజర్ కాంతులు ఏర్పాటు చేయకూడదని గతంలో అనేకసార్లు ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు స్థానిక సంస్థలు కూడా ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేశాయి. గతంలో పోలీసుల దృష్టి పెట్టినప్పుడు కొంత మేర తగ్గించి తిరిగి యథాతథంగా కొనసాగిస్తున్నారని వాపోతున్నారు.
తెల్లవారే వరకు శబ్ధాలు..
ఒక్కోసారి రాత్రి నుంచి తెల్లారే వరకు కూడా శబ్దాల హోరు తగ్గడం లేదు. టపాసుల మోతతో పాటు సౌండ్ బాక్సుల్లో మితిమీరిన శబ్దం ఫంక్షన్ హాళ్ల నుంచి వెలువడుతోంది. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
– రాజిరెడ్డి, సాయినగర్ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment