కల్యాణ మండపాలు కళకళ | Huge marriages With In 3Months After Corona Pandemic In AP | Sakshi
Sakshi News home page

కల్యాణ మండపాలు కళకళ

Published Sat, Oct 31 2020 7:53 PM | Last Updated on Sat, Oct 31 2020 7:53 PM

Huge marriages With In 3Months After Corona Pandemic In AP - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా ఎన్నో కల్యాణాలను వాయిదా వేసింది. మూడు ముళ్ల సరదా, సందళ్లు లేకుండా చేసింది. ఈ మహమ్మారి కారణంగా వివాహాలను రద్దు చేసుకున్న వారు కొందరైతే మూహూర్తాలు మార్చుకున్న వారు మరికొందరు. నిబంధనలు పాటిస్తూ తూతూమంత్రంగా పెళ్లిళ్లు కానిచ్చిన వారు ఇంకొందరు.  కోవిడ్‌ ప్రభావంతో చాలా వివాహాలు సందడి లేకుండానే జరిగాయి. దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న కరోనా ప్రభావం కాస్తంత తగ్గుముఖం పడుతుండడం, లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది.  విజయదశమి నుంచి మొదలైన శుభ ముహూర్తాలు రెండు నెలలకు పైగా (ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో) కొనసాగనున్నాయి.

జనవరి రెండో వారం నుంచి మూడున్నర నెలలు మూఢం (మౌఢ్యమి) వల్ల శుభ ముహూర్తాలు లేకపోవడంతో పలువురు ఈ సీజనులోనే పెళ్లిళ్లకు తొందర పడుతున్నారు. రానున్న మూడు నెలల పాటు విజయవాడలోని  దాదాపు 500 చిన్న, పెద్ద కల్యాణ మండపాలు, ఫంక‌్షన్‌ హాళ్లు ఖాళీ లేకపోవడం గమనార్హం. ఈ సీజనులో నగరంలో రెండు వేలు, జిల్లాలో మరో వెయ్యి వరకు వివాహాలు జరుగుతాయని పురోహితులు అంచనా వేస్తున్నారు. 

మారిన పిలుపులు..
పెళ్లంటే ఎవరి స్థాయిలో వారు ఆడంబరంగా జరుపుకుంటారు. స్థితిమంతులు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుపటిలా ఘనంగా కాకపోయినా పరిమిత సంఖ్యలో బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. మాస్కులు ధరించాలని, శానిటైజ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నామమాత్రంగానే శుభలేఖలు ముద్రిస్తున్నారు. ముఖ్యులను, ఆత్మీయులను మాత్రమే ఫోన్లు, వాట్సాప్‌ల ద్వారా ఆహ్వానిస్తున్నారు. ఇక వివాహ వేడుకల్లో అతిథులు మొదలు ఫంక‌్షన్‌ హాల్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, మేకప్‌ ఆర్టిస్టులు, క్యాటరింగ్‌ బాయ్స్‌ వరకు అంతా మాస్క్‌లు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు ధరిస్తున్నారు. పలుచోట్ల ప్రవేశ ద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడంతోపాటు సామాజిక దూరం పాటించేలా కుర్చీలను అమరుస్తున్నారు. వంటకాల సంఖ్యను కుదించడంతో భోజనాల ఖర్చు కూడా తగ్గుతోంది. 

ఇవీ శుభ ముహూర్తాలు..
ఆశ్వయుజ మాసం: నవంబర్‌ 4, 11వ తేదీలు 
కార్తీక మాసం: నవంబర్‌ 17, 19, 20, 21, 22, 25, 26, డిసెంబర్‌ 1, 6, 8, 9వ తేదీలు
మార్గశిర మాసం: డిసెంబర్‌ 17, 18, 20, 24, 27వ తేదీలు
జనవరి: 1, 2, 4, 7 తేదీలు

డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచనలివీ..
- కరోనా జాగ్రత్తలు పాటించడం వీలు కాని పక్షంలో వేడుకలు రద్దు చేసుకోవాలి. 
- పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలి.
- వేడుక ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అతిథులకు అవగాహన కల్పించాలి.
- ఎక్కువ సేపు లోపల గడపకుండా బయటే వేడుకలు నిర్వహించుకోవాలి.
- వేడుకకు హాజరయ్యే వారికి శానిటైజర్‌తోపాటు సబ్బు, నీళ్లు, టిష్యూ పేపర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలి.
- విందు భోజనాల్లో తప్పనిసరిగా పరిశుభత్ర, భౌతిక దూరం 
పాటించాలి. వాడి పారవేసే ప్లేట్లు (డిస్పోజబుల్‌) వినియోగించాలి.
- ఏమాత్రం అనారోగ్య లక్షణాలున్నా ఇంటికే పరిమితం కావాలి. 

పురోహితులకు డిమాండ్‌..
‘విజయదశమి నుంచి జనవరి మొదటి వారం వరకు శుభ ముహూర్తాలున్నాయి. కోవిడ్‌ నిబంధనలతో పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను ఆహ్వానించాలని సూచిస్తున్నాÆం. ఐదారు నెలలుగా ఖాళీగా ఉన్న పురోహితులకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. నేను ఈ సీజనులో 60 వరకు పెళ్లి ముహూర్తాలు నిర్ణయించా’ 
–పులిపాక రాఘవేంద్రాచార్యులు, వేదపండితుడు, విజయవాడ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement