ఫంక్షన్ హాళ్లపై చర్యలు తీసుకునేనా?
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ
అనుమతి లేని 19 ఫంక్షన్ హాళ్లను గుర్తించిన అధికారులు
చర్యలకోసం ఆదేశాలిచ్చిన డీపీవో
పంచాయతీ కార్యదర్శులకు అందిన ఉత్తర్వులు
జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే పలు ఫంక్షన్ హాళ్లను నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 19 ఫంక్షన్ హాళ్లను గుర్తించిన అధికారులు.. వాటిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అయితే ఏళ్లుగా పన్నులు ఎగవేస్తూ దర్జాగా ఫంక్షన్ హాళ్లను నిర్వహిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకునే సాహసం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డిచ్‌పల్లి : ఎలాంటి అనుమతులు లేకుండానే కొంద రు దర్జాగా ఫంక్షన్ హాళ్లను నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు పన్నులు ఎగ్గొడుతూ.. తాము మాత్రం లక్షలు ఆర్జిస్తున్నారు. జిల్లాలో 19 ఫంక్షన్ హాళ్లకు అనుమతులు లేవని గుర్తించిన అధికారులు.. వాటిపై చర్యలకు ఆదేశించారు.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫంక్షన్ హాళ్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. గతంలో ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలంటే డబ్బున్న వారే చేస్తారన్న అభిప్రాయం ఉండేది. పెళ్లిళ్లు, కొన్ని కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయపార్టీల సమావేశాలు, కార్యక్రమాలకు ఫంక్షన్ హాళ్లు వేదికగా నిలిచేవి. అయితే ఇప్పుడు కాలం మారింది. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం చిన్న చిన్న శుభకార్యాలనూ ఫంక్షన్ హాళ్లలోనే చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో వివాహాది వేడుకలకే ఫంక్షన్‌హాళ్లు వినియోగిస్తే.. ప్రస్తుతం పుట్టిన రోజు, బారసాలలాంటి చిన్న చిన్న శుభకార్యాలకూ ఫంక్షన్ హాళ్లను వినియోగిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకూ ఫంక్షన్ హాళ్లు విస్తరించాయి.
ఫంక్షన్ హాళ్లలో నిలువు దోపిడీ
ప్రజల అవసరాలు, ఆసక్తిని ఆసరాగా తీసుకుని ఫంక్షన్ హాళ్ల యజమానులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. వంట పాత్రల నుంచి కుర్చీలు, డెకరేషన్, మినరల్ వాటర్ సరఫరా ఇతరత్రా అన్నీ వారి వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. కల్యాణమండపం అద్దెనే రూ. 30 వేలనుంచి లక్షన్నర రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. డెకరేషన్, వాటర్, లైటింగ్, కరెంటు బిల్లు, క్లీనింగ్, లేబర్ చార్జీలు అదనం..
అనుమతి లేకుండానే..
జిల్లాలో సుమారు 150 ఫంక్షన్ హాళ్లున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఫంక్షన్ హాళ్లను మున్సిపల్ అధికారుల తనిఖీ చేసి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్‌డీలు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లాలో 19 ఫంక్షన్ హాళ్లకు ఎలాంటి అనుమతి లేవు. పట్టణాలు, నగరాల్లో కార్పొరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులకు ఎంతోకొంత ముట్టచెప్పి కల్యాణమండపాలు కట్టేశారన్న ఆరోపణలున్నాయి. కొన్ని ఫంక్షన్‌హాళ్లలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బయట పడటానికి అవసరమైన మార్గాలూ లేవు. కాగా అసలు నిర్మాణపరమైన అనుమతులు లేకుండానే ఏళ్లుగా కొనసాగుతున్నా.. అధికారులు ఇన్నాళ్లూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
చర్యలకు ఉన్నతాధికారుల ఆదేశాలు..
అనుమతి లేని ఫంక్షన్ హాళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి అన్ని మండలాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సంబంధిత ఈవోపీఆర్‌డీలు పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు అందజేసి, అనుమతి లేని ఫంక్షన్ హాళ్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. అయితే కొన్నేళ్లుగా పన్నులు ఎగవేస్తూ ఎలాంటి అనుమతి లేకుండా ఫంక్షన్‌హాళ్లను నిర్వహిస్తున్నవారిపై అధికారులు చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.
సీజ్ చేస్తాం
ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు. గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందకుండా నిర్మించిన ఫంక్షన్‌హాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఫంక్షన్ హాళ్లను సీజ్ చేస్తాం. ఈ విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గం.. - శ్రీనివాస్, ఈవోపీఆర్‌డీ, డిచ్‌పల్లి