భారతదేశంలో ప్రజలు పెళ్లిళ్లకు ఎంతెంత రేంజ్‌లో డబ్బుల ఖర్చు పెడతారో తెలిసిందే. నిజం చెప్పాలంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే భారత్‌లో అదొక వ్యాపారంలా సాగుతుంది. అయితే ఇటీవల ఆ పెళ్లిళ్లలో ట్రెండ్ మారుతోంది కూడా. ఏకంగా కోట్లు ఖర్చే చేసి మరీ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ఓ స్టేస్ సింబల్‌లా మారిపోయింది. ఇక రానురాను ఆ ట్రెండ్ ఓ రేంజ్‌లో కొనసాగేలా ఉంది. అయితే మన ప్రధాన మోదీ మాత్రం "ప్లీజ్ మన మాతృభూమిలోనే పెళ్లి చేసుకోండి" అని పిలుపునిస్తున్నారు. ఎందుకని ఆయన ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు? కారణమేంటీ..?
నిజానికి భారతీయుల్లో పెళ్లిళ్ల కోసం విదేశీయులకు వెళ్లే వాళ్లు కేవలం అత్యధిక ధనవంతులే. సాధారణ మానవుడు పెళ్లి చేసుకుంటే చాలనుకుంటాడు. అంత రేంజ్‌లకు వెళ్లడు. మన దేశంలో బడా బాబులకు కొదవలేదు కూడా. అయితే ఇంతకుమునుపు శ్రీమంతులు విభిన్నంగా కళ్లు చెదిరే ఆర్భాటాలతో చేసుకునేవారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారంటా! అని కథలుగా చెపుకునేవారు. కానీ ఈ 20 ఏళ్లలో పరిస్థితుల చాలా మారిపోయాయి. అంతెందుకు పెళ్లిళ్ల సీజన్‌కి రాజకీయనాయకుల సైతం ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎంతలా అంటే? ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 23న ఖరారు చేయగా ఆ టైంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయని ఏకంగా తేదీనే మార్చారు.
వెడ్డింగ్ అతిపెద్ద వ్యాపార ఇండస్ట్రీ..
పెళ్లిళ్ల టైంలో కళ్యాణ మండపాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. వాటి ధరలు హడలెత్తించేలా ఉంటాయి. ఆఖరికి పూల దగ్గర నుంచి నగలు, బట్టలు అన్నింటికి మంచి గిరాకీ టైం అనే చెప్పాలి. ఎంత ఎక్కువ ధర చెప్పినా ప్రజలు కూడా లెక్కచేయకుండా కొనే సమయం కావడంతో వ్యాపారులు కూడా ఈ సీజన్‌ని భలే క్యాష్ చేసుకుంటారు. ఈ దృష్ణ్యా చూస్తే పెళ్లిళ్లు ఓ పెద్ద మార్కెట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈ పెళ్లి పేరుతో అన్ని రకాల వృత్తుల వారికి చేతినిండా పని, ఆదాయానికి ఆదాయం. పెళ్లిళ్ల కార్యక్రమాలను నిర్వహించే ఈవెంట్ మేనజర్లకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. గతేడాది 2023లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగాయని, దాదాపు 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) స్వయంగా పేర్కొంది.
డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఎందుకింత ఆధరణ..
అందుకు ప్రధాన కారణం..జీవితంలో ఒక్కసారే చేసుకునేది కావడం, గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా చేసుకోవాలన్న కోరికలే ఇంతలా ఖర్చు చేసేలా చేస్తోంది. దీంతోపాటు అరచేతిలోనే ప్రపంచంలా స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్రభావం కూడా కొంత ఉంది. ఈ మేరకు ప్రముఖ మ్యారేజ్ ప్లానర్ అగ్నిశక్తి మాట్లాడుతూ..తాము సుమారు 8లక్షలు నుంచి 3 కోట్ల బడ్జెట్ వరకు వివాహాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాన భాగం వేదికపైనే ఖర్చు అవుతుందని, మిగిలిన బడ్జెట్‌ని ఆహారం, పానీయాలు, డెకరేషన్ సెటప్, ఫోటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులకు ఖర్చే చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా వధువు, వరుడు కుటుంబాలకు ప్రత్యేక డిజైనర్‌లను పెట్టుకుని మరీ బట్టలను కొనుగోలు చేయడం ఓ ట్రెండ్‌గా మారిందని అన్నారు.
సెలబ్రెటీలైతే ఈ విషయంలో ఏకంగా సినిమాలో పనిచేసే కాస్ట్యూమ్ డిజైనర్‌లను కూడా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. చాలామంది ఈ లగ్జరీ పెళ్లిళ్లను తమ స్టేటస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా భావించడం కూడా కొంత కారణం. ఈ నేపథ్యంలోనే బహుశా డిస్టినేపన్ వెడ్డింగ్‌లకు బాగా ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఎలాగో లక్షలు లక్షలు ఖర్చుపెడుతున్నాం కాబట్టి అదేదో అందరూ గుర్తు పెట్టుకునేలా విదేశాల్లో చేసుకుంటే..ఎంజాయ్‌మెంట్‌కి ఎంజాయ్, అందరూ గొప్పగా కూడా చెప్పకునేలా ఉంటుందన్న ధోరణి ప్రజల్లో బాగా పెరిగిందని మరో వెడ్డింగ్ ప్లానర్ సక్షమ్ శర్మ చెబుత్నునారు.
డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు అయ్యే ఖర్చు..
ఇది వారు వెళ్లే ప్రదేశం, వచ్చే అతిథుల బట్టి ఖర్చు ఉంటుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు బడ్జెట సుమారు 80 నుంచి 90 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్లు చెబుతున్నారు. అదే థాయిలాండ్, బాలి అయితే ఏకంగా కోట్లలోనే బడ్జెట్ మొదలవుతుందని తెలిపారు. ఇంతలా లగ్జరీయస్‌గా పెళ్లి చేసుకోవాడానికి కొన్ని హోటళ్లు క్రెడిట్ లోన్‌లు కూడా ఇస్తాయట.
మోదీ వద్దు అనడానికి రీజన్..
నవంబర్‌లో మన్‌కి బాత్ రేడియో ప్రసంగంలో ప్రధాన మోదీ విదేశాలలో వివాహాలను చేసుకునే బడా కుటుంబాల ధోరణి కలవరపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత మొత్తంలో ఖర్చే చేసేటప్పుడూ..మన భారత్‌లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో హుందాగా చేసుకోండని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాదు మేక్ ఇన్ ఇండియా మాదిరిగా వెడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కూడా చేపట్టాలని అన్నారు. అంతగా కావాలనుకుంటే ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరుపుకోమని అన్నారు. మోదీ ఇలా అనడానకి ప్రధాన కారణం భారతదేశం డబ్బు విదేశాలకు తరలిపోవడం ఇష్టం లేక ఆయన ఈ విధంగా పిలుపునిచ్చారు. ఇది ఒక రకంగా భారతీయ ఆర్థికవ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు ఉపకరించే చొరవ. ఇది చాలామంచి ప్రయత్నమే కానీ భారతీయులను ఇక్కడే పెళ్లిళ్లు చేసుకునేలా మంచి వెడ్డింగ్ సెట్టింగ్ మైదానాలతో మార్పులు చేయాల్సి ఉంటుంది.
అలాగే వెడ్డింగ్ టైంలో భారీ డిమాండ్ పలికే ఫంగ్షన్ హాల్స్ చార్జీల్లో కూడా మార్పులు వస్తే ఇదంతా సాధ్యమని అంటున్నారు ఈవెంట్ మేనేజర్లు. దీంతో ప్రవాస భారతీయులు సైతం తమ సొంత గడ్డలోనే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని చెబుతున్నారు. అలాగే తమ పెళ్లి గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకునే వాళ్లకు.. మన భారత్‌లో ఉన్న గోవా, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్, అండమాన్ తదితర ప్రసిద్ద ప్రదేశాలను హైలెట్ చూస్తూ.. అక్కడి ఫంక్షన్ హాల్‌లో భారీ మార్పులు తీసుకొచ్చేలా తీర్చిదిద్ధడమే గాక అందుబాటు ధరలో ఉండేలా చేస్తే ప్రధాని మోదీ చెబుత్ను నినాదం సాకారం అవుతుందన్ని అంటున్నారు మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్లు. ఈ నినాదానికి మద్దతు పలుకుతూ ప్రముఖ సెలబ్రెటీ రియా కపూర్ ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు కూడా. భారతదేశం వివిధ ఐకానిక్ ప్రదేశాలకు పెట్టింది పేరు. ఈ చొరవ నిజంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు మంచి బూస్టప్.
(చదవండి: ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!అతనేమి ఐఐఎం, ఐఐటీ.. !)
Comments
Please login to add a commentAdd a comment