తంబళ్లపల్లె /కురబలకోట: తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆలయ పూజారులుగా పని చేస్తున్న ఇద్దరు యువకులు అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి చెందిన రాఘవేంద్రస్వామి(28) తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయంలో పూజారిగా ఉన్నారు.
ఆయన భార్య అనిత, ఇద్దరు చిన్నపిల్లలతో అంగళ్ళులో కాపురం ఉంటున్నారు. ఇతని బావమరిది అనిల్‌కుమార్(29) కురబలకోట మండలం తెట్టు శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో పూజారిగా ఉన్నారు. ఆయనది అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని ముకుందాపురం. ఏడాది క్రితం రాధమ్మతో వివాహమైంది. రాఘవేంద్రస్వామి, అనిల్‌కుమార్ గార్లదిన్నెలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అతను మొహర్రం సందర్భంగా విధుల్లో బిజీగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం వెనుదిరిగి బైక్‌పై వస్తున్నారు.
ఈ క్రమంలో గార్లదిన్నె వద్ద ఐచర్ లారీ ఢీకొంది. ప్రమాదంలో రాఘవేంద్రస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్‌ను 108 వాహనంలో అనంతపురంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. అనంతరం స్వగ్రామాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment