బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పాణ్యం: నిర్లక్ష్యం, అతివేగం రెండు ప్రాణాలను బలిగొంది. బైక్‌పై రాంగ్ రూట్‌లో వెళ్లి మృత్యువు బారిన పడ్డారు. కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త దుర్మరణం చెందారు. పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని యానాది కాలనీలో నివాసముంటున్న బరిగెల వెంకటేశులు (47), ప్రమీల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశులు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పాణ్యం సమీపంలో పసురు తాపించి మద్యం మానిపించాలని ప్రమీల భావించింది.
ఈ మేరకు శుక్రవారం ఉదయం బైక్‌పై భార్యాభర్త పాణ్యం చెంచుకాలనీలో సుంకులా పరమేశ్వరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజారులు ఇచ్చే పసురు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే గుడికి 50 మీటర్ల దూరంలో జాతీయ రహదారిని దాటేందుకు వెహికల్ అండర్ పాస్ ఉంది. అయినా కి.మీ. దూరంలోని యూటర్న్ వద్ద దాటాలని రాంగ్ రూట్‌లో వెళ్లాడు. వేగంగా డివైడర్ వెంట వెళ్తుండగా యూటర్న్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. వేగంగా వస్తున్న బస్సును డ్రైవర్ అదపు చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.
బైక్‌ను ఢీకొనడంతో వెనుక కూర్చున్న ప్రమీల రోడ్డుపై పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశులు ఎగిరి రోడ్డు పక్కన ఉండే ఇనుప కడ్డీపై పడటంతో తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందాడు. బైక్‌లో ఉన్న పూజా సామగ్రి రోడ్డుపై పడ్డాయి. విషయం తెలుసుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబీకులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలుగా మారారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పటికే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వెంటనే వాహనాలు మళ్లించారు. కాగా మృతదేహాలు తరలించే వాహనం ఆలస్యం కావడంతో మృతదేహాలను హైవే పెట్రోలింగ్ పోలీసులు అయూబ్‌ఖాన్, హుసేన్, మధుసూదన్ వేరే వాహనంలో నంద్యాల ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటారు.
Comments
Please login to add a commentAdd a comment