కర్నూలు: టీడీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుని కుమారుడు మద్యం మత్తులో సుంకేసుల రోడ్డులో హల్‌చల్ సృష్టించాడు. కార్తీక్ హాస్పిటల్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో వాహనదారులు బెంబేలెత్తారు. ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ జాతీయ రహదారి వైపు వెళ్తూ కార్తీక్ హాస్పిటల్ సమీపంలో వరుసగా 4 బైకులు, ఒక ఆటోను ఢీకొట్టాడు. అప్పటికీ వాహనం అదుపు కాక డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన తిరుమలేష్ కర్నూలులో కిరాణం సరుకులు తీసుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా వెనుకవైపు నుంచి ఇన్నోవా వాహనంతో ఢీకొట్టాడు. దీంతో అతను కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు.
తిరుమలేష్ వెన్నెముక విరిగిపోవడమే కాక వీపు, తలకు గాయాలయ్యాయి. అలాగే ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన బెస్త నాగరాజు కూడా అదే మార్గంలో వెళ్తుండగా ఇన్నోవా వాహనంతో ఢీకొట్టడంతో గాయాలకు గురయ్యాడు. ఈయన టీజీవీ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే పుల్లారెడ్డి కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం(మెకానికల్) చదువుతున్న రాజేష్ కూడా ఇదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఇక బాలాజీ నగర్‌కు చెందిన షాషావలికి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వెనుక నుంచి ఆటోను ఢీకొట్టగా ఆటో ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సెకండ్ల వ్యవధితో వరుసగా మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో ప్రమాదానికి గురయ్యాయి.
దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వాహనదారులంతా మద్యం మత్తులో ఉన్న కేఈ తనయుడిని కారులో నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేశారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు స్వయాన అన్న కుమారుడు కావడంతో విషయం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులందరినీ వేర్వేరు వాహనాల్లో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయించారు. పోలీసులు అక్కడికి చేరుకోక ముందే మద్యం మత్తులో ఉన్న అతడిని అక్కడినుంచి తప్పించారు. అయితే బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఘటనకు కారణమైన ఇన్నోవా వాహనం డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా ఉండటంతో రికవరీ వాహనం సహాయంతో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రమాదంలో ఇన్నోవా వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ట్రాఫిక్ డీఎస్పీ నాగభూషణం ఆదేశాల మేరకు ఎస్‌ఐ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై సీసీ ఫుటేజీ సేకరించారు. అయితే ఇంతవరకు బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment