Kurnool District Latest News
-
జగనన్న కాలనీల్లో పనులు తనిఖీ చేయండి
● డ్వామా పీడీ వెంకటరమణయ్య ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జగనన్న కాలనీల్లో చేపట్టిన పనులను పకడ్బందీగా తనిఖీ చేయాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట రమణయ్య ఆదేశించారు. తనిఖీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలకు సంబంధించి 490 వర్క్‌లు ఉన్నాయని తెలిపారు. కాలనీల్లో మట్టి రోడ్లు వేయడం, గుంతలు పూడ్చడం, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు జరిగాయని, ఈ పనులకు సంబంధించి రూ.3 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ముందస్తుగా మరోసారి కాలనీల్లో పనులను తనిఖీ చేయాల్సి ఉందని వివరించారు. పోలీసు ప్రధాన పరీక్షకు 246 మంది ఎంపిక కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో పోలీసు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం 600 మంది అభ్యర్థులను ఆహ్వానించగా 338 మంది బయోమెట్రిక్ పరీక్షకు హాజరయ్యారు. వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ చుట్టు కొలతలు వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో ప్రతిభ కనపరచి 246 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్ష (మెయిన్స్)కు అర్హత సాధించారు. ఏదైనా సమస్యలపై ఇతర కారణాలతో అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 28వ తేదీన హాజరుకావాలని పోలీసు అధికారులు సూచించారు. అందుబాటులో రేబిస్ టీకా కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆసుపత్రుల్లో రేబిస్ నివారణ టీకా అందుబాటులో ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ కార్యాలయంలో పాముకాటు నిర్వహణ, రేబిస్ టీకా, రేబిస్ టోల్ ఫ్రీ నెంబర్‌పై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుక్కకాటు, ఇత ర జంతు సంబంధిత గాయాల తర్వాత రేబిస్ వ్యాధి నివారణలో రేబిస్ టీకా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. పాము కాట్ల సందర్భంలో తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్స, వైద్య చర్యల గురించి సమాజానికి అవగాహన కల్పించాలన్నారు.కార్యక్రమంలో జిల్లా సర్వెలెన్స్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ స్టాటిస్టికల్ అధికారి హేమసుందరం, డిస్ట్రిక్ట్ ఎపడమాలజీ, ఐడీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 22 కేంద్రాల్లో జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు బనవాసి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి తెలిపారు. శనివారం నవోదయ ప్రవేశ పరీక్షా కేంద్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 80 సీట్ల కోసం 6,035 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో ప్రవేశ పరీక్షకు 4,879 మంది విద్యార్థులు హాజరుకాగా 1,156 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలని సూచించారు. -
No Headline
తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవులంటేనే జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఏనుగు,సింహం తప్ప తక్కిన జంతువులన్నింటికీ ఈ అడవి ఆవాసప్రాంతంగా నిలిచింది. 17 రకాల కార్నివోర్స్ (మాంసాహార జంతువులు), 8 రకాల హెర్బీవోర్స్ (శాకాహార జంతువులు)తో పాటు పలు రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు, ఉభయచర జీవులు, కీటకాలు తదితర జంతుజాలం ఈ అడవిలో సహజీవనం చేస్తూ బయోడైవర్సిటీకి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. 8 రకాల హెర్బీవోర్స్లో ఏడు రకాలు జింకలే ఉండటం విశేషం. వీటిల్లో 300 కేజీల బరువు తూగే కణితి (సాంబర్), మనిమేగం(నీల్గాయ్) వంటి భారీ జింకలతో పాటు కుందేలు కంటే కాస్త చిన్నదిగా కనిపించే మౌస్‌డీర్ (మూషిక జింక)సైతం ఉన్నాయి. నాగార్జున సాగర్– శ్రీశైలం అభయారణ్యం పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్లో ఇవి అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి. – ఆత్మకూరురూరల్ -
వలంటీర్ల ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతు
కర్నూలు (టౌన్): వలంటీర్ల ఉద్యమానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. వాళ్ల సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ లోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం తగదన్నారు. రాష్ట్రంలోనే నూతన వ్యవస్థను రూపొందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అన్ని సేవలు గ్రామ స్థాయిల్లోను ప్రజలందరికీ అందే విధంగా జగనన్న సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలు, వృద్ధులు, పెన్షనర్లు, విద్యార్థులు, రైతులు.. ఇలా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారన్నారు. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి 1.49 లక్షల ఉద్యోగాలు జగనన్న కల్పించారన్నారు. వలంటీర్ల వ్యవస్థను సర్వనాశనం చేసిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 35 వేల సచివాలయాల ఉద్యోగాలకు ఎసరు పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాలు కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిందిపోయి ఉన్న ఉద్యోగాలను తొలగించేందుకు క్యాబినెట్లో నిర్ణయించడం దారుణమన్నారు. పరిపాలన వ్యవస్థను నీర్వీర్యం చేసి టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ తిప్పుకునేందుకు ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతిని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడలు వంచుతామన్న పవన్‌కళ్యాణ్ ఎక్కడ? ప్రశ్నిస్తా.. అవసరమైతే ప్రభుత్వ మెడలు వంచుతా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పవన్‌కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లను తొలగించిన చంద్రబాబు సర్కార్ మెడలు వంచకుండా ఆయనకు దాసోహమయ్యాడని విమర్శించారు. ఉద్యోగాల్లేవు, నిరుద్యోగ భృతి లేదు.. మరోవైపు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నా.. డిప్యూటీ సీఎం నోరు మెదపడం లేదన్నారు. సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏది బాబు? ప్రభుత్వ మెడలు వంచుతా అన్న పవన్ ఎక్కడ? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి -
మానసిక వికలాంగులకు న్యాయ సేవలు అందించాలి
కర్నూలు(సెంట్రల్): మానసిక అనారోగ్యం, వైకల్యంతో బాధపడేవారి కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారికి చట్టపరమైన సేవలు అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థఅధ్యక్షుడు జస్టిస్ కబర్ది సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు మానసిక అనారోగ్యం, వైకల్యం బాధితుల కోసం జాతీయ న్యాయసేవాధికార సంస్థ తెచ్చిన బాలల సంరక్షణ న్యాయ సేవలు–2024 పథకంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ కపర్ది మాట్లాడుతూ.. చట్టం పరంగా మానసిక ఆరోగ్యం, వైకల్యాలతో బాధపడేవారికి చట్టం పరంగా రావాల్సిన, చేయాల్సిన సేవలను వర్తింపజేసేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలాశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం.వెంకట హరినాథ్ మాట్లాడుతూ.. బాలల సంరక్షణ..స్నేహ పూర్వక న్యాయ సేవలు పథకం–2024పై న్యాయ న్యాయవాదులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.శివరామచంద్రరావు, చైల్డ్ వెల్ఫే ర్ కమిటీసభ్యుడు క.వెంకట రామయ్య, అసిస్టెంట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రేవతి జ్యోత్స్న పాల్గొన్నారు. -
No Headline
జింకకాని జింక ఈ మౌస్ డీర్. నిజానికి ఇది జింకజాతి వన్యప్రాణి కాదు. కాని రూపం బట్టి దీన్ని మూషిక జింకగా చెబుతారు. ఇది పంది జాతికి చెందిన ప్రాణి. వెనక కాళ్లు కాస్త బలహీనంగా కనిపించే ఈ జింక పూర్తిగా దట్టమైన వర్షారణ్యాలను పోలిన అడవుల్లో కనిపిస్తుంది. పెద్ద కుందేలు పరిమాణంలో ఉండే మూిషిక జింక నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వరం, రుద్రకోడు, పెచ్చెర్వు వంటి దట్టమైన పర్వతప్రాంత అడవుల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా రాత్రుళ్లు మాత్రమే తిరుగాడుతుంది. చెట్టు తొర్రల్లో నివాసముంటుంది. నల్లమలలో ఇది అంతరించి పోయింది అనుకున్న సమయంలో తిరిగి కనిపిస్తుండటం శుభపరిణామం. -
బనశంకరీ శాసించారు.. ప్రజలు పాటించారు!
పూజలందుకుంటున్న బనశంకరీదేవిఊరేగింపుగా బోనాలు తీసుకొస్తున్న భక్తులుసంప్రదాయం కొనసాగింది. బనశంకరీ ఆజ్ఞయే శాసనంగా ఆనాది కట్టుబాట్లను పాటించారు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నుంచి ఆచారాలు పాటిస్తూ భక్తిని చాటారు. జిల్లాలో సుళేకేరి గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రామంలో శనివారం బనశంకరీదేవి (బందమ్మవ్వ) వేడుకలు కమనీయంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కుంభోత్సవం కనుల పండువగా సాగింది. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కుంభాలతో మహిళలు ఊరేగింపు చేపట్టారు. ఆచారంలో భాగంగా అవ్వకు వరిబియ్యం, కొర్రబియ్యం, పాలు, పెరుగు, వెన్నతో చేసిన నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో సంగీత విభావరి, చెక్కభజనలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. బనశంకరీ ఆజ్ఞయే శాసనంగా గ్రామ ప్రజలు నేటికి శూన్య మాసం అమావాస్య నుంచి ప్రత్యేక ఆచారాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు నుంచి సుళేకేరి గ్రామస్తులు పాలు తాగిన రోజు పెరుగు తినరు. పెరుగు తిన్న రోజు పాలు తాగరు. అలాగే వెన్న తీసినా అలాగే ఉంచుతారు. నెయ్యి చేయరు. అవ్వ జాతర ముగియగానే ఆహార కట్టుబాట్లకు స్వస్తి పలుకుతారు. అయితే ఏడాది పొడవునా సోమవారం ఎద్దులకు సెలవు మాత్రం కొనసాగిస్తారు. ఆ రోజు వాటికి పూజలు సైతం చేస్తారు. – కౌతాళం -
36 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు నాగరాజరావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మా ట్లాడుతూ... ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 42 సంఘాలు ఉన్నాయని, ఇందులో 36 సంఘాలు ఎన్నికల పట్ల ఆసక్తిలో ఉన్నట్లు తెలిపారు. బనవాసిలో 77 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్‌ను నెలకొల్పేందుకు ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపినట్లు వివరించారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో 250 మంది సభ్యులు ఉన్నారని, ఈ సంఘానికి త్రిప్ట్ పథకం కింద రూ.8.92 లక్షలు విడుదల అయ్యాయని తెలిపారు. -
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
కోడుమూరు రూరల్: స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పి.రంజిత్‌బాషా పిలుపునిచ్చారు. శనివారం గూడూరులో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని ప్రజల చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం జిల్లాలోని పల్లెల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ వంతుగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను కుండీల్లో వేయాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రభు త్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కాగా తమను కూడా సభావేదికపైకి పిలవాలంటూ కొందరు టీడీపీ నాయకులు కొద్దిసేపు గందరగోళం సృష్టించగా, ఎమ్మెల్యే కలుగజేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమని, పార్టీ కార్యక్రమం కాదంటూ నచ్చ జెప్పారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లు పీఎన్.అస్లామ్, లక్ష్మన్న, అసిస్టెంట్ కలెక్టర్ కల్యాణి, ఆర్డీఓ సందీప్‌కుమార్, సీఈఓ నాసరరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, డీపీఓ భాస్కర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రంజిత్‌బాషా -
No Headline
జింకలలో అతి పెద్దది కణితి(సాంబర్ డీర్). దట్టమైన అటవీ ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. ఇవి పెద్ద పంగల కొమ్ములు కలిగి ఉంటాయి (మగవాటికి మాత్రమే కొమ్ములుంటాయి). ఈ కొమ్ములను అవి నిర్ణీత సమయంలో విసర్జిస్తుంటాయి. కొన్ని సార్లు ఆడ కణితి కోసం జరిగే పోరాటంలో అవి ఊడి పోతుంటాయి. నల్లమలలో ప్రధాన రక్షిత వన్యప్రాణి అయిన పెద్దపులికి ఆహార జంతువులుగా జింకలు పర్యావరణ సమతుల్యానికి తమవంతు కృషి చేస్తున్నాయి. జింకలతో పాటు అడవి పంది, ముల్ల పంది, కుందేలు వంటి జంతువులు కూడా పులి ఆహార మెనూలో ఉన్నాయి. కణుతులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పెద్ద పులులకు చక్కటి ఆవాసంగా గుర్తిస్తారు. -
No Headline
గడ్డి మైదానాల్లో గుంపులుగా జీవించే జింకల్లో కృష్ణజింక (బ్లాక్ బక్) ప్రధానమైనది. మగ జింకలకు పొడవాటి కొమ్ములు ఉంటాయి. పురి తిరిగినట్లుండే ఈ కొమ్ములపైన ఉన్న పురులను బట్టి వాటి వయస్సును నిర్ధారిస్తారు. ఇవి బాగా వయస్సుకు వచ్చాక వాటి చర్మం నల్లటి కప్పును కలిగి అందంగా తయారవుతుంది. సాధారణంగా ఇలా బలంగా నల్లటి కప్పుతో కనిపించే కృష్ణజింక.. జింకల గుంపుకు నాయకత్వం వహిస్తుంది. అత్యంత వేగంగా పరిగెత్తే వీటిని వేటాడే మాంసాహార జంతువు నల్లమలలో లేదు అంటే అతిశయోక్తి కాదు. గంటకు 100 కి.మీ పైగా వేగంతో పరిగెత్తే చీతాలు దేశంలో కనుమరుగు కావడంతో వీటికి పోటీపడి పరిగెత్తే జంతువులు లేకుండా అయ్యాయి. తోడేల్లు, హైనాలు మాటువేసి వీటిని చంపుతుంటాయి. కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక జంతువుగా ఉంది. పెద్ద గడ్డి మైదానమైన రోళ్లపాడు బట్టమేక పక్షి అభయారణ్యంలో ఇవి పెద్దసంఖ్యలో సంచరిస్తుంటాయి. ● నల్లమలలో అరుదైన జింకల సంచారం ● ఏడురకాల జింకలతో అలరారుతున్న జీవవైవిధ్యం ● పెద్ద పులి మెనూలో ఇవి ప్రధానం మనిమేగం.. ప్రత్యేకం నల్లమలలో ప్రధానంగా కనిపించే మరో ఆంటిలోప్ మనిమేగం (నీల్గాయ్). ఇది కూడా భారీ శరీరాన్ని కలిగి ఉంటుంది. కొంతమేర గుర్రాన్ని పోలి ఉండే మగ మనిమేగాలు వయస్సుకు వచ్చాక నల్లటి పైకప్పుతో కనిపిస్తాయి. అందుకే వీటిని నల్లపోతు అనికూడా అంటారు. కృష్ణజింకలు, మనిమేగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయంటే అది అటవీ క్షీణతకు సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండు జింకలు పెద్దపెద్ద గడ్డి మైదానాల్లో మాత్రమే మనగలుగుతాయి. జంగిల్ మే సవాల్.. -
No Headline
కొండ గొర్రె కంటే కాస్త భారీగా, కణుతుల కంటే కాస్త చిన్నగా ఉండే మరో ఆంటిలోప్.. బుర్రజింక. చింకారా అనికూడా పిలిచే ఈ జింక తలపై రెండు కొమ్ములు కృష్ణజింకను పోలి పురి తిరిగి ఉంటాయి. కానీ వాటి అంత పొడవు పెరగవు. నల్లమలలో వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అరుదుగా మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. రైతులు వ్యవసాయ ఉపకరణాలలో చింకారా కొమ్ములను అందంగా వినియోగిస్తుంటారు. చర్నాకోల పిడిగా, మోకులు, పగ్గాలు తయారు చేసేందుకు ఉపయోగపడే పరికరంగా కూడా వీటి కొమ్ములను రైతులు సేకరించే వారు. -
● విజేతగా నిలిచిన నంద్యాల వృషభాలు
హోరాహోరీగా.. ఎమ్మిగనూరురూరల్: నీలకంఠేశ్వస్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం బండులాగుడు పోటీల్లో న్యూ కేటగిరిలో నంద్యాల పట్టణానికి చెందిన బారెడ్డి కేశవరెడ్డి వృషభాలు విజేతగా నిలిచి రూ. 50 వేలు గెలుచుకున్నాయి. శనివారం సాయంత్రం విజేతలకు బహుమతులను తహసీల్దార్ శేషఫణి అందజేశారు. నందవరానికి చెందిన జిముకల మహేష్ వృషభాలు రెండవ బహుమతి రూ. 40 వేలు, డోన్ మండలం మల్యాల షేక్మైమున్నా వృషభాలు మూడవ బహుమతి రూ. 30 వేలు, గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు చెవిటి సుంకన్న వృషభాలు నాల్గవ బహుమతి రూ. 20 వేలు, పి.రుద్రవరం ఎల్లాగౌడ్ వృషభాలు ఐదవ బహుమతి రూ. 10 వేలు గెలుచుకున్నట్లు ఆర్గనైజర్లు రాందాస్‌గౌడ్, భాస్కర్, ఉరుకుందయ్యశెట్టి, చంద్రశేఖర్‌రెడ్డి, విరుపాక్షిరెడ్డి, మహేంద్ర, గురురాజదేశాయి, కాశీంవలి, నారాయణరెడ్డి, ఈరన్నగౌడ్ తెలిపారు. ఆదివారం పెద్దసైజు దూలం లాగు పోటీలు ఉంటాయని వారు పేర్కొన్నారు. -
విమానం ల్యాండింగ్‌కు మంచు అడ్డంకి
● బెంగళూరుకు తిరిగి వెళ్లిన ఇండిగో ఫ్లైట్ కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం తిరిగి వెళ్లిపోయింది. శనివారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు ఇండిగో విమానం బయలుదేరింది. అయితే 10.50 గంటలకు ఆ విమానం కర్నూలు చేరుకోగా మంచు కప్పుకొని ఉండడంతో (విజుబులిటీ) ల్యాండ్‌కు అవకాశం ఇవ్వలేదు. దీంతో తిరిగి బెంగళూరుకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అక్కడి నుంచి బస్సులు, రైళ్లల్లో చేరుకోవాల్సి వచ్చింది. ఏటా చలికాలంలో ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో ఉదయం వేళ వచ్చే విమానాల ల్యాండింగ్‌కు వాతావరణం సహకరించడం లేదు. విమానాన్ని నడిపే పైలట్‌కు ఫిజికల్ 5 కిలోమీటర్ల వరకు విజుబులిటీ ఉంటేనే ల్యాండింగ్‌కు అవకాశం ఇస్తారు. అయితే ఇక్కడ చలికాలంలో 3 కిలోమీటర్ల వరకు మాత్రమే నేరుగా పైలట్‌కు విజుబులిటీ ఉండటంతో ల్యాండింగ్ సమస్య ఎదురవుతోంది. -
ఆటలాడుకుంటూ అనంతలోకాలకు...
● నీటి కుంటలో పడి బాలుడి మృతి ఆస్పరి: ఆటలాడుకుంటూ నీటి కుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పుటకలమర్రి గ్రామంలో బోయ రాజు, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజేష్ (6) ముత్తుకూరు దగ్గర ఉన్న ఎవర్ గ్రీన్ ప్రవేట్ పాఠశాలలో రెండో తరగతి చదవుచున్నాడు. సంక్రాంతి సెలవులు రావడంతో శనివారం తల్లిదండ్రుల వెంట బాలుడు రాజేష్‌తో పాటు నలుగురు బాలురు కూడా వెళ్లారు. తల్లిదండ్రులు పొలంలో పని చేసుకుంటుండగా బాలురందరూ ఆటలాడుకుంటూ పక్క పొలంలో ఉన్న నీటి కుంట దగ్గరకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు రాజేష్ కుంటలో పడగానే వెంట వెళ్లిన పిల్లలు తల్లిదండ్రులకు వెళ్లి విషయం చెప్పారు. వారు వెంటనే అక్కడకు వెళ్లి బాలుడిని బయటకు తీశారు. స్పృహ తప్పిపోయిన బాలుడిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు ఆదోనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
సాంకేతికం.. అద్భుతం
రైల్వే ట్రాక్‌కు తరచూ కంకర, మట్టి, ఇసుక ఇవ్వకపోతే బలహీన పడుతుంది. ఈ క్రమంలో ట్రాక్‌కు శక్తిని ఇచ్చేందుకు అంటే బలహీనమైనప్పుడల్లా కంకర, ఇసుక, మట్టిని ఇచ్చేందుకు బీసీఎం మిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఈ మిషన్ ద్వారా పూర్తిగా మెకనైజ్డ్‌గా ట్రాక్‌కు కొత్తగా కంకర, మట్టి, ఇసుకను సమకూర్చవచ్చు. ఈ మిషన్.. ట్రాక్‌ను దాదాపు మూడు–నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎత్తి వృథాగా ఉన్న కంకర, ఇసుక, మట్టిని తీసేసి, మళ్లీ కొత్తగా వేస్తోంది. శనివారం బీసీఎం మిషన్ కర్నూలు రైల్వే స్టేషన్ పరిధిలోని ట్రాక్‌కు శక్తినిచ్చే పనిలో ఉన్న దృశ్యాలు ఇవీ.. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు ట్రాక్‌ను బలోపేతం చేస్తూ.. -
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
వెల్దుర్తి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన గోవర్ధనగిరి గ్రామంలో రైతు ఆనంద్ సాగు చేసిన ఏటీఎం (ఎనీటైమ్ మనీ)పంట (365 రోజుల పంట దిగుబడులు, ఆదాయం) ఏ గ్రేడ్ మోడల్‌ను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ఆయన సిబ్బందితో సమావేశమై రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన యూనిట్ల ప్రకారం ఈనెల 25లోపు లక్ష్యాలను సాధించాలన్నారు. ఆయన వెంట ఆశాఖ హెచ్ఆర్ భుజేశ్వరుడు, స్థానిక అధికారులు జనార్దన, మునిరాజు, పరమేశ్వరుడు, డిజిటల్ అసిస్టెంట్లు, ఐసీఆర్పీలు ఉన్నారు. భారీగా సారా బెల్లం స్వాధీనం కర్నూలు: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల తనిఖీల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం భారీ మొత్తంలో పట్టుబడింది. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మి తం తండా, ఎర్రకత్వ తండా గ్రామాల్లో ఉన్న నాటుసారా తయారీ కేంద్రాలపై ఎకై ్సజ్ అధికారులు శని వారం ఆకస్మిక దాడులు చేశారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్ఐ నవీన్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ మధుసూదన్, ఈఎస్టీఎఫ్ ఎస్ఐ ఇంద్రకిరణ్ తేజ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. గుమ్మితంతండా గ్రామ శివారులోని నాటుసారా కేంద్రాల్లో 2500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. అలాగే ఎర్రకత్వ తండా సమీపంలో సారాబట్టి వద్ద ఆటోలో 225 కేజీల బెల్లం, 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు పాతబస్తీ కవాడి వీధికి చెందిన అహ్మద్, బెల్లం వ్యాపారి రాజశేఖర్‌ను అరెస్టు చేసి నాటుసారా రవాణాదారుడు శివనాయక్ కోసం గాలిస్తున్నట్లు సీఐ చంద్రహాస్ తెలిపారు. పుల్లగుమ్మిలో లేగదూడల ప్రదర్శన వెల్దుర్తి: పుల్లగుమ్మి గ్రామ వెటర్నరీ ఆసుపత్రిలో శనివారం రాష్ట్రీయ గోకుల మిషన్ లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని డీఎల్‌డీఏ డీడీ పార్థసారథితో కలిసి పశుసంవర్ధక శాఖ జిల్లా డీడీ డాక్టర్ దుర్గా ప్రసన్న బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువుల యజమానులకు ఉచితంగా పాల క్యాన్లు, పశువుల కోసం మినరల్ మిక్చర్స్, టానిక్స్ ఇచ్చారు. అనంతరం లేగదూడల ప్రదర్శనను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. వాటికి ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించారు. కార్యక్రమంలో కల్లూరు ఏడీ డాక్టర్ పార్థసారథి, పశువైద్యాధికారులు డాక్టర్ స్వాతి, డాక్టర్ శాంతలత, డాక్టర్ చంద్రమోహన్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్‌కు రూ.లలో)
పంట కనిష్టం గరిష్టం వేరుశెనగ 3,116 6,216 పొద్దుతిరుగుడు 4,530 4,530 ఆముదం 5,189 5,563 వాము 12,069 12,069 ఉల్లి 1,237 2,651 ఎండుమిర్చీ 4,409 14,000 శనగలు 5,666 6,059 కందులు 3,000 8,001 మొక్కజొన్న 1,900 2,330 మినుములు 3,100 8,109 కొర్రలు 1,813 3,311 సోయాచిక్కుడు 3,311 3,311 సజ్జలు 2,059 2,359ఫోన్ నం : 08518–257204, 257661 -
రిజర్వాయర్ భూములను ఆక్రమిస్తే చర్యలు
అవుకు: ఎవరైనా రిజర్వాయర్ భూములను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని డోన్ ఆర్డీఓ నరసింహులు హెచ్చరించారు. అవుకు సమీపంలోని రిజర్వాయర్‌ను ఆనుకొని కొందరు నాపరాతి డిపోలు ఏర్పాటు చేసుకోవడమేకాక నిరుపయోగ రాళ్లను రిజర్వాయర్‌లో వదిలేస్తున్నారు. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న డోన్ ఆర్డీఓ నరసింహులు శనివారం ఎస్సార్బీసీ ఈఈ సురేష్ బాబుతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ పరిధిలో ఉన్న భూమి ఎంతవరకు ఆక్రమణకు గురైంది, ఏయే సర్వేనంబర్లలో ఎంత భూమి ఉంది, ఆక్రమణదారులు ఎవరు తదితర వివరాలతో పూర్తి నివేదిక సిద్ధం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించి డిపోలను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే ఆక్రమణదారులు ఖాళీ చేయాలన్నారు. ఇప్పటికే చెర్లోపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా ఆక్రమణదారుల్లో అవుకు గ్రామానికి చెందిన గండ్రాయుడు, ఎర్రమల రామక్రిష్ణ, షేక్ అబ్దుల్లా(లంబు బాషా), ప్రేమ్ కుమార్, ఎస్ఎండీ హుస్సేన్, మహబూబ్పీరాలకు, అలాగే చెర్లోపల్లెకు చెందిన ఎం నాగపుల్లయ్య, కంబగిరి, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, చాకలి మద్దిలేటి, వడ్డె గుర్రప్ప, కండక్టర్ పుల్లయ్య, ఉపేంద్రలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి, ఆర్ఐ వెంగల్ రెడ్డి, ఎస్సార్బీసీ సిబ్బంది , అవుకు పోలీసులు పాల్గొన్నారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ రిజర్వాయర్ భూముల్లో అక్రమంగా డిపోలను ఏర్పాటు చేసుకున్న వారికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి శనివారం ఆక్రమణ ప్రదేశం వద్దకు రాకపోవడంతో ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆక్రమణదారుల్లో అవుకు గ్రామానికి చెందిన ఎర్రమల రామక్రిష్ణ నోటీసు తీసుకోలేదని ఆర్డీఓకు తెలియడంతో చెర్లోపల్లె వీఆర్ఓ సుబ్బరాయుడుపై మండిపడ్డారు. నోటీసులు తీసుకోకపోతే ఇంటికి అతికించటం లేదా ఆక్రమణదారుడి వాట్సాప్‌కు నోటీసులు పంపించాలనే విషయం కూడా తెలియదా అంటూ వీఆర్ఓపై మండిపడ్డారు. త్వరగా అతనికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. -
పండ్లతోట దగ్ధం
దేవనకొండ: మండల కేంద్రమైన దేవనకొండకు చెందిన సోమన్న అనే రైతు పండ్ల తోట శనివారం దగ్ధమైంది. ఇతనికి నల్లచెలిమల రెవెన్యూ పరిధిలో మూడు ఎకరాల భూమి ఉంది. అందులో ఏడేళ్ల క్రితం జామ, మామిడి, నారింజ, నిమ్మ, టెంకాయ రకాలకు చెందిన 1,250 మొక్కలు నాటి పెంచుతున్నాడు. దిగుబడి చేతికొచ్చే సమయంలో పొలం పక్కన రైతు గట్టుకు నిప్పు పెట్టాడు. అయితే ఆ మంటలు సోమన్న తోటకు వ్యాపించి దాదాపు 825 చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీప రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగింది. దాదాపు రూ. 18 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు చెబుతున్నారు. తమ పొలం పక్కన ఉన్న వారే వ్యక్తిగత కక్షతో ఈ పనికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కాలిపోయిన పండ్ల మొక్కలు -
గ్రామీణ యువకుడికి ఆర్బీఐలో ఉద్యోగం
కౌతాళం: మండల పరిధిలోని కామవరం గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన యువకుడు తన విజయం గురించి చెప్పారు. కామవరం గ్రామానికి చెందిన తుమ్మల వీరారెడ్డి ఆర్ఎంపీగా, ఎల్ఐసీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా ఆయన భార్య తుమ్మల దేవమ్మ ఇంట్లోనే చిన్నపాటి గాజులషాపు నడుపుతున్నారు. వీరి మొదటి కుమారుడు టి.బాలాజీ.. అప్లయిడ్ స్టాటిక్స్లో మాస్టర్ డిగ్రీని తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వావిద్యాలయం నుంచి 2020లో తీసుకున్నారు. హైదరాబాద్‌కి వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ మొదటి ప్రయత్నంలోనే (ఈఎస్ఐసీ) ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ కంపెనీలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యో గం పొందారు. ఉద్యోగంలో చేరి వారం గడవక ముందే కర్ణాటక గ్రామీణ బ్యాంకులో ప్రోబేషనరీ ఆఫీసర్‌కు ఎంపికయ్యారు. కొన్ని రోజుల తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు. వీటిలో చేరకుండా ఆర్బీఐ అసిస్టెంట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. గతేడాది సెప్టెంబర్ 23 నుంచి బెంగళూరులో ఆర్బీఐ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
శనగ పంటలో నీటి నిల్వలు ఉండనీయొద్దు
నంద్యాల(అర్బన్): శనగ పంటలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటే అధిక దిగుబడులు వస్తాయని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ అన్నారు. ఇటీవల శనగ పంటకు ఎండుతెగులు, మొదలు కుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించాయని, వాటి నివారణకు ప్రతి మూడేళ్లకోసారి రైతులు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. డీఏఓ మురళీకృష్ణ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయాధికారులు పాల్గొన్న సమావేశంలో డీఏఓ జాన్సన్ మాట్లాడుతూ వంద కిలోల పశువుల ఎరువులో 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి, 4 కిలోల వేపచెక్క నేలలో వేసి కలియదున్నాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఖరీఫ్ శనగ పంట సాగుకు ముందు నేలను ఖాళీగా ఉంచకుండా సోయాబీన్, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తే భూమి సారవంతమవుతుందన్నారు. కర్నూలు ఇన్చార్జ్ డీఏఓ అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు. బెల్లం ఊట ధ్వంసం ఆత్మకూరు: మండలంలోని సిద్ధపల్లె డొంకలో శనివారం నాటుసారా తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ డీవీ నారాయణ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఎవరైనా గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలు
● హోరాహోరీగా ఫైనల్ పోటీ ● బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ప్రకాశం, కర్నూలు జట్లు పొదిలి రూరల్: పొదిలి ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న 28వ రాష్ట్ర స్థాయి జూనియర్ సెపక్తక్రా ఛాంపియన్ షిప్ పోటీలు శనివారం ముగిశాయి. పోటీలకు వివిధ జిల్లాల నుంచి బాలురు, బాలికలు కలిపి మొత్తం 32 జట్లు పోటీలో పాల్గొన్నాయి. శనివారం నిర్వహించిన సెపక్తక్రా పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం – కర్నూలు జట్లు నువ్వా–నేనా అన్న విధంగా తలపడ్డాయి. ఈ పోరులో ప్రకాశం జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతి ప్రకాశం జట్టు, రెండో బహుమతి కర్నూలు జట్టు సొంతం చేసుకున్నాయి. మూడో బహుమతికి అనంతపురం, ఈస్టుగోదావరి జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. బాలికల విభాగంలో మొదటి బహుమతి తూర్పుగోదావరి జట్టు కై వసం చేసుకోగా, రెండో బహుమతిని ప్రకాశం జిల్లా జట్టు సొంతం చేసుకుంది. మూడో బహుమతికి విజయనగరం, అనంతపురం జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదగా బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సెపక్తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జీ శ్రీనివాసులు, అమరనాథ్, మధు, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నంద్యాలలో జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
రమణీయం.. పుష్పోత్సవం
శ్రీౖశెల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సమూర్తులను ఆలయ అలంకార మంపడంలోకి తోడ్కొని వచ్చి అశ్వవాహనంపై అధిష్టింపజేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించారు. అశ్వవాహనంపై విహరించిన స్వామిఅమ్మవార్లను పలువురు భక్తులు దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినం రోజున నూతన వధూవరులైన పార్వతీ, మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్లకు 18 రకాల పుష్పాలు, 11 రకాల ఫలాలు నివేదించారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. – శ్రీశైలంటెంపుల్ -
స్వచ్ఛదివస్పై ప్రజలకు అవగాహన కల్పించండి
కర్నూలు(సెంట్రల్): ‘న్యూ ఇయర్–క్లీన్ స్టార్ట్’ అనే థీమ్‌తో నిర్వహించే స్వచ్ఛ దివస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా స్వచ్ఛ దివస్, హౌసింగ్, రెవె న్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, ఉపాధి హామీ తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి, అధికారులు, ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని శనివారం జిల్లాలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ప్రారంభించాలన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్‌లో భాగంగా ప్రతి మూడో శనివారం పచ్చదనం–పరిశుభ్రతను పాటించాలన్నారు. ఉపాధి హామీ పనుల కల్పనలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. మంత్రాలయం, గూడూరు, గోనెగండ్ల, కోసిగి మండలాల్లో ప్రజలు వలస వెళ్తున్నారని, పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, అందుకు కారణాలపై ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న గోకులాల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రీసర్వే గ్రామాల గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ సర్వేలో జిల్లా పురోగతిలో వెనుకబడి ఉందని, వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, హౌసింగ్ పీడీ చిరంజీవి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ రంజిత్‌కుమార్ -
No Headline
కోడుమూరు రూరల్: అతివేగం ముగ్గురు వ్యక్తులను బలితీసుకుంది. శుక్రవారం ప్యాలకుర్తి వద్ద లారీ, ఐచర్ వాహనం ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కోడుమూరుకు చెందిన సోమశేఖర్ (56), బండ శ్రీనివాసులు (46), రాజోలి శ్రీను (36) పట్టు వస్త్రాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ముగ్గరు కారులో కర్నూలుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ప్యాలకుర్తి గ్రామ సమీపాన ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఐచర్ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమా దంలో కారులోని బండ శ్రీనివాసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలకు గురైన సోమశేఖర్, రాజోలి శ్రీనులను చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతుడు సోమశేఖర్ కోడుమూరులోని 16వ వార్డు సభ్యుడు. ఈయనకు భార్య జయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బండ శ్రీనివాసులుకు భార్య శ్రీలలిత, ఇద్దరు కుమారులు, రాజోలి శ్రీనుకు భార్య సుమశ్రీ, ఇద్దరు కుమార్తెలు, ఏడాదిలోపు బాబు ఉన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ విషయం తెలుసుకున్న కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్యరత్న, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సీబీ లత, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ తదితరులు కోడుమూరు ప్రభుత్వాసుపత్రి చేరుకున్నారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురిది ఒకే సా మాజిక వర్గం కావడం, వరుసకు బంధువులు కావడంతో కోడుమూరులో విషాదఛాయలు అలుముకున్నా యి. కోడుమూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబీకుల, బంధువుల రోదనలు మిన్నంటాయి. రెండు వారాల్లో ఆరుగురు మృతి .. కోడుమూరు – కర్నూలు రహదారిలో రెండు వారాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో కోడుమూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ప్యాలకుర్తి, కొత్తూరు గ్రామాల సమీపానే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.