
‘ఆకర్ష్’ సేవలు అభినందనీయం
● కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
ఓర్వకల్లు: ‘అల్యూమిని అసోసియేషన్ ఆఫ్ కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్’(ఆకర్ష్) పేరుతో పాఠశాల అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ రంజిత్ బాషా అభిప్రాయపడ్డారు. ఆదివారం మండలంలోని కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన 1992–93, 1998–99వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమానికి ఆకర్ష్ అధ్యక్షులు రాఘవేంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర గురుకుల పాఠశాల సొసైటీ ఛీప్ సెక్రటరీ మస్తానయ్య, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపాల్ ప్రసాదరావు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధికి అసరమైన నిధుల మంజూరుకు సంబంధించిన నివేదికలను కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆకర్ష్‌లో చేరిన ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. గ్రీన్‌కో సంస్థ ఆధ్వర్యంలో టిడ్‌కో ఇళ్ల సమీపంలో రూ.5 కోట్లతో జాతీయ స్థాయిలో స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఆకర్ష్ బోర్డు గౌరవ సభ్యులు కిరణ్‌కుమార్, సొసైటీ అధ్యక్షులు రాఘవేంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ వరప్రసాద్, జిల్లా, రాష్ట్ర, దేశ విదేశాలల నుంచి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.