
యువకుని అవయవ దానం
● ముగ్గురికి కొత్త జీవితం
కర్నూలు (హాస్పిటల్): ఒక యువకుడు చేసిన అవయవ దానం ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన టి.శివరామ సుబ్బయ్య (39)కు భార్య రామసుబ్బమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన ఈనెల 10న స్నేహితులతో కలసి దగ్గర్లోని నదికి చేపలు పట్టడానికి వెళ్లాడు. అక్కడ జారిపడటంతో తలకు పెద్ద రాయి తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అతను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి బాగోలేదని చెప్పి కర్నూలుకు పంపారు. అదే రోజు ఓమ్నీ హాస్పిటల్‌లో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. మెరుగైన చికిత్స కోసం మరుసటి రోజు మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. కానీ అతనిని బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రిలోని జీవన్‌దాన్ ట్రస్టు వారు అవయవ దానం గురించి శివరామ సుబ్బయ్య కుటుంబానికి చెప్పగా వారు అంగీకరించారు. కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ సాయిసుధీర్ నేతృత్వంలో డాక్టర్ అబ్దుల్ సమద్, డాక్టర్ సిద్ధార్థ హెరూర్, డాక్టర్ బి.ప్రవీణ్, డాక్టర్ శరత్ తదితరులు అవయవాలను సేకరించారు. సేకరించిన అవయవాల్లో ఒక కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు, మరో కిడ్నీని మెడి కవర్ హాస్పిటల్‌లోనే ఒక రోగికి, కాలేయాన్ని కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.