
టీడీపీ గూండాగిరీకి పోలీసుల వత్తాసు
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
ఆలూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న గూండాగిరీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఇందుకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. బుధవారం ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. దౌర్జన్యాలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం ఎన్నాళ్లు ఉండదని, ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, పార్టీ ఆలూరు మండలం అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు.
రైల్లో నుంచి పడి వ్యక్తి మృతి
నంద్యాల: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని గుడిమెట్ట వద్ద మద్దయ్య(42) అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ఈనెల 11న కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని మంగళవారం రాత్రి రైలులో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుడిమెట్ట వద్ద రైలు నుంచి జారి కింద పడి మృతి చెందినట్లు బుధవారం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.