
సాగు చేయాలంటే వాగు దాటాల్సిందే!
పాణ్యం: ఆ గ్రామ రైతులు పంటలు సాగు చేయాలంటే వాగులో పీకల్లోతు నీరున్నా దాటి అవతలకు వెళ్లాల్సిందే. లేకుంటే నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించి పొలాలకు చేరుకోవాలి. కొన్నేళ్లుగా రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. ఇక వర్షాకాలంలో రైతులు బాధలు చెప్పలేనివి. మండల పరిధిలోని అహల్యాపురంలో గ్రామంలో రైతుల పరిస్థితి ఇదీ. గ్రామం పక్కనే కొర్రవాగు ప్రవహిస్తుంది. ఈ వాగులో వేసవిలో తప్ప నిత్యం నీటి ప్రవాహం ఉంటుంది. ఇటీవల వర్షాలు కురవడం, ఎస్సార్బీసీ కాల్వలకు నీరు వదలడంతో వాగులో పీకల్లోతు వరకు నీరు ప్రవహిస్తుంది. వాగు అవతల వందల ఎకరాల సాగు భూమి ఉంది. వాగు దాటితే కిలోమీటరు.. లేదా అర కిలోమీటరు దూరంలో పొలాలకు చేరుకుంటారు. ప్రస్తుతం పొలాలకు విత్తనాలు వేసే సమయం కావడంతో రైతులు వాగులో నీటిని దృష్టిలో పెట్టుకొని ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, మహిళా కూలీలు, పనిముట్లతో చుట్టు నాలుగైదు కిలోమీటర్ల దూరం తిరిగి పొలాలకు చేరుకుంటున్నారు. అలా వెళ్లలేని రైతులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని పీకల్లోతు నీటిలో దిగి అతి కష్టంమీద వాగు దాటుతున్నారు. పొలంలో విత్తనాలు వేసేందుకు కూలీలను తీసుకెళ్లాలన్నా, మందుల బస్తాలు తీసుకెళ్లాలన్నా నరకయాతన అనుభవిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని, అధికారులు ఈ అవస్థల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
వాగు అవతల వందలెకరాల భూమి
వర్షాకాలం వచ్చిందటే ప్రాణాలు చేతిలో పెట్టుకొని అవతలకు..
బ్రిడ్జి నిర్మించాలని రైతుల వేడుకోలు