బ్యాంకులు రుణాలివ్వవు.. ప్రభుత్వ పథకాలు వర్తించవు | - | Sakshi
Sakshi News home page

బ్యాంకులు రుణాలివ్వవు.. ప్రభుత్వ పథకాలు వర్తించవు

Aug 13 2025 5:28 AM | Updated on Aug 13 2025 6:46 PM

CCRC cards are useless

ఎందుకూ పనికిరాని సీసీఆర్‌సీ కార్డులు

కౌలు రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం

ఇప్పటి వరకు 34,258 సీసీఆర్‌సీ కార్డుల జారీ

ఒక్కరికీ అందని అన్నదాత సుఖీభవ సాయం

లోన్లు ఇవ్వలేమని చెబుతున్న బ్యాంకర్లు

కష్టాల సాగు చేస్తున్న కౌలు రైతులు

కర్నూలు(అగ్రికల్చర్‌): కౌలుదారుల అభ్యున్నతికి చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో ఆగస్టు 4వ తేదీ వరకు 34,258 మంది కౌలుదారులకు సీసీఆర్‌సీ కార్డులు జారీ చేసినా ఒక్కరికీ మేలు జరిగిన దాఖలాలు లేవు. సీసీఆర్‌సీ కార్డులు పొందిన సాగుదారుల్లో ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సాగుదారులకు అండగా నిలిస్తే.. కూటమి ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయరవుతోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి కౌలుదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని సీసీఆర్‌సీ(ప్రస్తుతానికి) కార్డులు జారీ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. కౌలుదారులకు రుణాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ అధికారులు ఈ కార్డుల వివరాలను సంబంధిత బ్యాంకులకు ఎప్పటికప్పుడు పంపుతున్నా వీటిని బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోని పరిస్థితి.

సీసీఆర్‌సీ కార్డుల జారీలో సైతం ముడుపులే..

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. చివరికి కౌలుదారులకు జారీ చేసే సీసీఆర్‌సీ కార్డుల జారీకి కూడా కొందరు వీఆర్వోలు ముడుపులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీసీఆర్‌సీ కార్డు జారీ కావాలంటే రూ.10 స్టాంపుపై రాసుకున్న అగ్రిమెంట్‌ భూ యజమాని, కౌలుదారు ఇద్దరూ సంతకాలు చేయాల్సి ఉంది. అయితే వీఆర్‌ఓలు మేము క్షేత్రస్థాయికి వచ్చి విచారణ జరుపుతామని నాణ్చివేత ధోరణికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎందుకు అన్నట్లుగా రూ.1,000 వరకు డబ్బులిచ్చి కార్డులు పొందుతున్నట్లు సమాచారం.

బ్యాంకర్లు చెబుతన్న కారణాలు ఇవీ..

● కౌలుదారులకు రుణాలు ఇవ్వలేమని వివిధ బ్యాంకులు స్పష్టంగా ప్రకటించాయి.

● ఇప్పటికే కౌలుదారులు సాగు చేసుకుంటున్న భూ ములపై యజమానులు రుణాలు తీసుకున్నారు.

● ఒకే భూమిపై ఇటు యజమానికి, అటు కౌలుదారులకు రుణాలు ఇవ్వలేం.

● ఒకవేళ భూముల యజమానులు రుణాలు తిరిగి చెల్లిస్తే.. ఆ స్థానంలో కౌలుదారులకు రుణాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం.

తడిసి మోపెడవుతున్న కౌలు

మెట్ట భూమి అయితే ఒక ఎకరా కౌలు కనీసం రూ.5వేల నుంచి 10 వేల వరకు ఉంటోంది. నీటి పారుదల సదుపాయం ఉంటే ఎకరాకు రూ.30 వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. సెంటు భూమి కూడా లేని వారు భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయంలో రాణిస్తున్నారు. కౌలు, పెట్టుబడి మొత్తం కలిపి ఎకరాకు పంటను బట్టి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు వస్తోంది. సీసీఆర్‌సీ కార్డులు పొందినప్పటికీ బ్యాంకులు సహకరించకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు భార్యల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది.

కౌలుదారులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 11 నెలల కాలపరిమితితో సీసీఆర్‌సీ కార్డులు జారీ చేసింది. ఈ రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద రూ.13,500 పూర్తిగా అందించింది. కౌలుదారులతో పాటు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్‌సీ కార్డులు జారీ చేసి రైతు భరోసాను వర్తింపజేసింది. 2023–24లో భారీ ఎత్తున సీసీఆర్‌సీ కార్డులు జారీ కావడంతో వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం లభించింది. ఒక్క ఏడాదే కాదు ఐదేళ్లూ కౌలుదారులకు పెట్టుబడిసాయం అందింది. మొత్తం 28,600 మంది సాగుదారులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసాతో లబ్ధి పొందడం విశేషం.

కౌలు రైతులు ఎలా బతికేది

ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. కౌలు కింద కరెంట్‌ మోటార్‌ ఉంటే ఎకరాకు 22 బస్తాలు, లేకపోతే 18 బస్తాలు ధాన్యం ఇవ్వాల్సి ఉంది. 2024–25లో ప్రభుత్వం సీసీఆర్‌సీ కార్డు మంజూరు చేసింది. ఈ కార్డు 2025–26 సంవత్సరానికి రెన్యూవల్‌ అయ్యింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ కింద ఒక్క రూపాయి కూడా అందలేదు. బ్యాంకులకు పోతే రుణాలు ఇవ్వం అంటున్నారు. సంక్షేమ పథకాలు వర్తించకపోతే ఎలా బతికేది. – గడ్డం నరసింహుడు, పార్నపల్లి, బండిఆత్మకూరు మండలం

తూతూ మంత్రంగా సీసీఆర్‌సీ కార్డులు

ఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. అనావృష్టి, అతివృష్టి వల్ల ఏటా పంటలు దెబ్బతింటుండటం వల్ల కొన్నేళ్లుగా రైతులు భూములను కౌలుకు ఇస్తూ వలస వెళ్తున్నారు. అనధికారికంగా జిల్లాలో కౌలు రైతులు దాదాపు 2.50 లక్షల వరకు ఉన్నారు. భూమి యజమాని సమ్మతితోనే సీసీఆర్‌సీ కార్డులు జారీ చేస్తారు. ఈ ప్రకారం 2025–26లో కర్నూలు జిల్లాలో 25 వేలు, నంద్యాల జిల్లాలో 30 వేల ప్రకారం సీసీఆర్‌సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు 11 నెలల కాలపరిమితితో కర్నూలు జిల్లాలో 21,799, నంద్యాల జిల్లాలో 12,459 కార్డులు మాత్రమే జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement