శుభకరం.. వరలక్ష్మీ వ్రతం | - | Sakshi
Sakshi News home page

శుభకరం.. వరలక్ష్మీ వ్రతం

Aug 8 2025 9:26 AM | Updated on Aug 8 2025 9:26 AM

శుభకర

శుభకరం.. వరలక్ష్మీ వ్రతం

శ్రీశైలంటెంపుల్‌: ‘వర’ అంటే శ్రేష్టమైనది అని అర్థం. ప్రతీ ఒక్కరు కూడా వారి వారి రంగాలలో శ్రేష్ఠతను ఆశిస్తారు. అవిధమైన శ్రేష్ఠతను ప్రసాదించే దేవిస్వరూపమే.. వరలక్ష్మి. కేవలం ధనం, ధాన్యం, కీర్తి మొదలైన భౌతిక సంపదలనే కాకుండా, ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం లాంటి మానసిక సంపదలను, ధ్యానశక్తి, యోగశక్తి, మోక్షం లాంటి ఆధ్యాత్మిక సంపదలను కూడా వరలక్ష్మి అనుగ్రహిస్తుంది. శ్రావణమాసంలో శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి కృపకు పాత్రులై ఐశ్వర్యంతో పాటు సకల శుభాలు కలుగుతాయని, మహిళలకు దీర్ఘకాల సుమంగళి భాగ్యం దక్కేలా దేవతలు దీవిస్తారని పురాణ కథనం. ఈ వ్రతాచరణ గురించి శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు స్కందపురాణం, భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. వ్రతం ఆచరించడం వలన పార్వతీదేవికి కుమారస్వామి జన్మించాడని చెబుతారు. శ్రావణమాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే శ్రావణమాసంలో ఆచరించవచ్చు.

వరలక్ష్మీ వ్రతాచరణ ఇలా..

వ్రతం రోజున ఉదయాన్నే ముత్తయిదువులు మంగళస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించాలి. పూజకు నిర్ణయించుకున్న స్థలంలో మండపాన్ని ఏర్పాటు చేయాలి. మధ్యలో కలశాన్ని నెలకొల్పి లక్ష్మీదేవి ముఖాన్ని తీర్చిదిద్దిన కొబ్బరికాయ దానిపై ఉంచాలి. అనంతరం లక్ష్మీదేవిని కలశంలోకి ఆహ్వానింపజేసి వ్రత విధానంతో పూజించాలి. వివిధ రకాల పిండివంటలు, పలు రకాల పండ్లను నివేదించాలి. ఈ వ్రతంలో తోరపూజ (తొమ్మిది పోరలు కలిగిన ధారం) చేయాలి. పూజ ముగిశాక ఆ తోరణాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. తరువాత ముత్తైదువులకు వాయనాన్ని ఇవ్వాలి. వాయనం అంటే రవిక, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గంధం మొదలైన మంగళద్రవ్యాలను, తమలపాకులు, వక్కలను చాటలో ఉంచి ముత్తైదువులకు ఇవ్వడం. శక్తిమేర ఒక్కరికి లేదా ముగ్గురు, ఐదుగురికి ముత్తైదువులకు ఈ వాయనాన్ని ఇవ్వొచ్చు. సాయంత్రం ముత్తైదువులను పిలిచి, పేరంటం చేసి, పూలు, పండ్లు, తాంబూలంగా ఇవ్వాలి.

సామూహిక వరలక్ష్మీ వ్రతానికి

ఏర్పాట్లు పూర్తి

శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీవ్రతానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీశైలంలోని చంద్రవతి కల్యాణ మండపంలో నిర్వహించే ఈ వ్రతంలో పాల్గొనే ప్రతి ముత్తైదువు కోసం వేర్వేరు కలశాలు నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతాన్ని చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే ముత్తైదువల పేర్లు ముందుగా నమోదు చేసుకున్నారు. ఈ వ్రతంలో పాల్గొనే ముత్తైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలు, జాకెట్‌ పీస్‌, పూలు, గాజులు, ప్రసాదం అందిస్తారు. వ్రతాచరణకు వీలుగా శ్రీస్వామిఅమ్మవార్ల కై లాస కంకణాన్ని ధరింపజేస్తారు. వ్రతం అనంతరం శ్రీశైలప్రభ సంచికను అందిస్తారు. పూజా సామగ్రి మొత్తం దేవస్థానమే సమకూరుస్తుంది. వ్రతానంతరం ముత్తైదులందరికీ స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించబడుతుంది. దర్శనం అనంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన సదుపాయం కల్పిస్తారు.

నేడు శ్రీశైల ఆలయంలో సామూహిక

వరలక్ష్మీ వ్రతాలు

విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం

శ్రావణమాసం..శుభకరం:

చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ మాసం శ్రావణమాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి చేరువలో ఉండడం వలన శ్రావణమాసమనే పేరు వచ్చింది. శుభకార్యాలకు ఈ మాసం చాలా అనువైంది. అందుకే శ్రావణమాసానికి శుభమాసమనే పేరు కూడా ఉంది. ఈ నెలలో నోములు, వ్రతాలు, పండుగలతో ప్రతి ఇల్లు కళ కళలాడుతుంది. రుతువుల్లో మూడోదైన వర్ష రుతువు ఈ మాసంతోనే ప్రారంభమవుతుంది. దీంతో వ్యవసాయ పరంగా కూడా ఈ మాసానికి ప్రాధాన్యత ఉంది.

శుభకరం.. వరలక్ష్మీ వ్రతం1
1/1

శుభకరం.. వరలక్ష్మీ వ్రతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement