
నాణ్యతలేని ఫోన్లు మా కొద్దు
ఎమ్మిగనూరురూరల్: ‘ ప్రభుత్వం 2జీ ఫోన్లకు ఇచ్చి 5జీ ఉండే పనులను చేయమంటే ఎలా.. నాణ్యత లేని సెల్‌ఫోన్లు మాకొద్దు’ అంటూ సోమవారం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్‌వాడీ వర్కర్లు తమ ఫోన్లను సూపర్‌వైజర్లకు అందజేశారు. పోషణ్ ట్రాకర్, బాల సంజీవిని యాప్స్ రాక ఇబ్బంది పడుతన్నామని తెలిపారు. గర్భవతుల, బాలింతల, 0–5 సంవత్సరాల పిల్లల సమాచారం, ఫొటోలు, ఓటీపీ రావాలని ఐసీఐసీ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఫోన్లను వెనక్కి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ప్రాజెక్ట్ కార్యదర్శి గోవర్ధనమ్మ, సహాయ కార్యదర్శి నాగలక్ష్మి, అధ్యక్షురాలు శైలజ, ఉపాధ్యక్షురాలు నీరజ మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రూ. 5 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.