
వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు
ఎరువుల భారం పెరిగిపోతోంది
మాకు 3.50 ఎకరాల భూమి ఉంది. కంది, సజ్జ పంటలు సాగు చేశాం. కందిలో ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వేయాలి. ఇందుకోసం 14–34–14 ఎరువులు అవసరం. 50 కిలోల బస్తా రూ.1,800 ప్రకారం కొన్నాం. గతంలో రూ.1,600 ఉన్న ఈ ధరను అమాంతం పెంచేశారు. ఎరువులపై పెడుతున్న ఖర్చు వల్లే పంటల సాగులో పెట్టుబడి వ్యయం అధికమైంది. ధరల పెరుగుదల వల్ల కనీసం రూ.5వేల వరకు అదనపు భారం పడుతోంది. – షేక్ ఖాశీం, ఆర్.కొట్టాల గ్రామం, తుగ్గలి మండలం
అడ్డగోలుగా ధరలు
పెంచేస్తున్న కంపెనీలు
● నోరు మెదపని కూటమి ప్రభుత్వం
● ఇప్పటికే మూడుసార్లు పెరిగిన ధరలు
● ఒక్కో రైతుపై రూ.4వేల నుంచి
రూ.6వేల భారం
● పెట్టుబడిలో రసాయన ఎరువుల ఖర్చే
అధికం
● గగ్గోలు పెడుతున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి రసాయన ఎరువులను వినియోగంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉండగా కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల ధరలు అడ్డుగోలుగా పెరిగిపోవడం పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎరువుల ధరలు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అయితే ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్రం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడు సార్లు పెంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయినప్పటికీ ధరల పెరుగుదలను నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా దాదాపు 5 లక్షల టన్నుల రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. ఒక టన్ను అంటే 50 కిలోల బస్తాలు 20 ఉంటాయి. బస్తాపై కనిష్టంగా రూ.50 నుంచి రూ.330 వరకు ధర పెరిగింది. అంటే టన్నుపై కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.6వేల వరకు ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే డీఏపీ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న రసాయన ఎరువుల
వినియోగం
ఈ సారి ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సీజన్ కూడా ముందుగానే మొదలైంది. ఈ కారణంగా జిల్లాలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, ఉల్లి, టమాట, కంది తదితర పంటలకు యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. జిల్లాలో ఈ సారి పత్తి సాగు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 1,63,792 హెక్టార్లలో సాగయింది. హంద్రీనీవా కాల్వకు నీళ్లు పారుతుండటం వల్ల కూరగాయల సాగు కూడా పెరుగుతోంది. పలు మండలాల్లో ప్రతి 10 మంది రైతుల్లో 6గురు ఒక్కొక్కరు 20 నుంచి 30 బస్తాల వరకు ఎరువులు స్టాక్ పెట్టుకున్నారు. అంటే ఎరువులకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎరువుల ధరలు భారీగా పెరగడం రైతులకు శాపంగా మారింది. ధరల పెరుగుదల వల్ల ఒక్కో రైతుపై రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు భారం పడుతోంది. ప్రధానంగా 14–35–14, 20–20–0–13, 16–20–0–13, 10–26–26 ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
పెరిగిన రసాయన ఎరువుల ధరలు ఇలా..
ఎరువు పేరు పాత ధర కొత్త ధర
(రూ.లలో)
పోటాష్ 1535 1800
20–20–0–13 1300 1425
(ప్యాక్ట్)
20–20–0–13 1300 1350
(గ్రోమర్)
20–20–0–13 1300 1400
(పీపీఎల్)
10–26–26 1470 1800
12–32–16 1470 1720
(ఇప్కో)
16–16–16 1450 1600
14–35–14 1700 1800
(గ్రోమర్)
సింగల్ 580 640
సూపర్ పాస్పేటు
16–20–0–13 1250 1300
2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పట్లో కూడా టీడీపీ బీజేపీ కొమ్ము కాసింది. ఆ సమయంలో ఏకంగా నాలుగైదు సార్లు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి. 2019–20 నుంచి 2023–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారి కూడా పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే రైతుల నడ్డి విరిగే విధంగా ఽమూడు దఫాలుగా ధరలు పెంచడం గమనార్హం. ఎరువుల ధరలు పెంచడంలో టీడీపీ, జనసేనలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరుగుతోంది.

వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు

వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు