
చేనేతకు ‘రెండొందల’ విధాలుగా షాక్!
ఎమ్మిగనూరుటౌన్: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,398 మంది మగ్గాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ‘చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్’ వస్తుందని అందరూ ఆశించారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీ అమలు కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చే వంద యూనిట్ల ఉచిత విద్యుత్ మాత్రమే నేటికీ అమలు అవుతోంది. వంద యూనిట్ల కంటే ఏ ఒక్క యూనిట్ వినియోగించినా బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అప్పుల బాధతతో ముడి సరుకు కొనుగోలు చేయలేక చేనేత కార్మికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఫలితంగా చేనేతపురి అయిన ఎమ్మిగనూరులో మగ్గాలు మూతపడే దుస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొంది.
నేతన్నకు అండగా గత ప్రభుత్వం
చేనేత రంగానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సంక్షేమ పథకాల క్యాలెండర్‌లో నిర్దేశించిన తేదీ మేరకు సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24వేల వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసింది. ఐదేళ్ల కాలంలో జిల్లాలోని చేనేత కార్మికులకు రూ.40.77కోట్ల మేర సాయం అందింది. నేతన్న నేస్తంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది. అదేవిధంగా దివంగత నేత వైఎస్సార్ హయాంలో చేనేత సంఘాలకు రుణమాఫీ చేశారు. పావలా వడ్డికే రుణ సదుపాయం కల్పించారు. అలాగే 50 ఏళ్లకే చేనేత పింఛన్ మంజూరు చేశారు.
నేటి దుస్థితి ఇదీ..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత రంగం అస్తవ్యస్తమైంది. నేత పని లేక మగ్గాలు మూతపడ్డాయి. చేనేత కార్మికులు ఇతర రంగాల్లో కూలీలుగా మారిపోయారు. కొందరు వృత్తి పని మానుకుని దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. కొందరి ఇళ్లలో వృద్ధుల పోషణ, పిల్లల చదువులు భారంగా మారాయి.
పోరాటం చేస్తాం
చేనేతలపై ఇంత నిర్లక్ష్యం వహించడం పద్ధతి కాదు. వృత్తిని కాపాడుకొని ఆర్థికంగా బలోపేతం అయి వారి కుటుంబాలు బాగుపడే విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వకుంటే చేనేత కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం. – బుట్టారేణుక, వైఎస్సార్‌సీపీ
నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మిగనూరు
‘‘ నేనే హామీ ఇస్తున్నా. చేనేతల 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తా. మాట నిలబెట్టుకుంటా. ఎప్పుడు బాబు మాటంటే మాటే. మాట మీదుంటా. చేనేత కార్మికులను ఆదుకొంటానని తెలియజేస్తున్నా’’ – ఎన్నికల సమయంలో
చేనేత కార్మికులకు టీడీపీ అధినేతగా
చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇదీ..
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మిగనూరు పట్టణం ఎల్లమ్మబీడు చేనేత కార్మికుడు చిన్న ఆదెన్న అప్పుల బాధతతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు. టీడీపీ అధినేతగా ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు మరచిపోయారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తుండడంతో చేనేత కార్మికులు విలవిల్లాడుతున్నారు.
అందని 200 యూనిట్ల
ఉచిత విద్యుత్
మగ్గాలు మూతపడే దుస్థితి
భారంగా ముడి సరుకుల కొనుగోలు
కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై
చేనేత కార్మికుల ఆగ్రహం

చేనేతకు ‘రెండొందల’ విధాలుగా షాక్!

చేనేతకు ‘రెండొందల’ విధాలుగా షాక్!