
ఎద్దు దాడిలో వృద్ధుడి మృతి
ఆలూరు రూరల్: వృద్ధుడిపై ఎద్దు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన గురువారం ఆలూరులో చోటు చేసుకుంది. స్థానిక బళ్లారి రోడ్డులో నివాసం ఉండే పద్మనాభ దాస్ (89) మెయిన్ బజారులోని ఓం శాంతి ధ్యాన మందిరానికి వెళ్లి వస్తుండగా ఎద్దు దాడి చేసింది. కొమ్ములతో వృద్ధుడిని ఎత్తి కింద పడేసింది. ప్రమాదంలో పద్మనాభ దాస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆదోనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు పద్మనాభ దాస్ ఆలూరు మాజీ ఎమ్మెల్యే గోవింద దాస్ తనయుడు.
పశువుల బారి నుంచి కాపాడండి..
రహదారులపై సంచరిస్తున్న పశువుల బారి నుంచి ప్రజలను కాపడాలని సీపీఎం నాయకులు అంబేడ్కర్ సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో పశువులు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో పశువుల దాడిలో చాలా మంది గాయపడ్డారని రోడ్లపై అడ్డదిడ్డంగా పరిగెత్తే పశువుల వల్ల వాహనదారులు కింద పడ్డారన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికై నా మేల్కొని పశువులను గోశాలకు తరలించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు హనుమంతు, నారాయణ స్వామి, మైనా, కృష్ణ, ఈరన్న, షేకూన్‌బీ తదితరులు పాల్గొన్నారు.