
ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు
కర్నూలు(అర్బన్): ప్రజల హక్కులను పరిరక్షించేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కట్టుబడి ఉంటుందని కౌన్సిల్ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఈదురు పద్మాకర్ అన్నారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా కౌన్సిల్ వెంటనే స్పందిస్తుందన్నారు. వారి హక్కులను కాపాడేందుకు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి అవసరమైన చర్యలను చేపడుతామన్నారు. ఆయా వర్గాలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు కౌన్సిల్ పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు ముద్రించుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికై నా వారు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేని పక్షంలో అలాంటి వారిని గుర్తించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. తమ హక్కులను కాపాడుకోవడంలో భాగంగా తమ పరిధిలో జరిగే అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే ఆయా సమస్యలు వెలుగులోకి రావడంతో పాటు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు అక్బర్, ప్రధాన కార్యదర్శి బెస్త గోవిందరాజులు, రమణ, సోమన్న తదితరులు పాల్గొన్నారు. ఐస్ ఫ్యాక్టరీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని కౌన్సిల్‌కు డోన్‌కు చెందిన లక్ష్మణస్వామి వినతి పత్రాన్ని అందించారు.