- వి«ధులకు సక్రమంగా హాజరుకాని 37 మందిపై ఈఓ చర్యలు
- ఐదుగురు సస్పెన్షన్, ఒకరికి జరిమానా, 31 మందికి షోకాజ్ నోటీస్‌లు
- సెప్టెంబర్ నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత
వ్రతపురోహితులపై క్రమశిక్షణ కొరడా
Published Fri, Oct 7 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
అన్నవరం :
అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు మరోసారి వ్రత పురోహితులపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించారు. సకాలంలో వి«ధులకు హాజరుకాని, ఎటువంటి సమాచారం లేకుండా గైర్హాజరవుతున్న 37 మంది పురోహితులను ‘బయో మెట్రిక్’ అటెండెన్స్ ద్వారా గుర్తించి వారిపై చర్య తీసుకున్నారు. పురోహితుల సెప్టెంబరు నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత విధించారు. ఈ క్రమశిక్షణ చర్యలతో పురోహితులలో తీవ్ర కలకలం రేగింది.
ఐదుగురు పురోహితుల సస్పెన్షన్...
ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్న ప్రథమశ్రేణి పురోహితుడు ముత్య శంకర్రావు, రెండో శ్రేణి పురోహితుడు తనికళ్ల నరసింహశర్మలను విధుల నుంచి సస్పెండ్ చేశారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న అభియోగాలపై రాజ్యం రామకృష్ణ, ఆలస్యంగా విధులకు హాజరై, ముందుగా వెళ్లిపోతున్నారన్న అభియోగాలపై మామిళ్లపల్లి రామకృష్ణ, మంధా రవి ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు.
ఎక్కువ సెలవులు వాడుకుంటున్నందుకు రూ.రెండు వేలు జురిమానా...
నిర్దేశించిన సెలవులకన్నా ఎక్కువగా వాడుకుంటున్నారన్న అభియోగంపై అంగర వేంకట సుబ్రహ్మణ్య సతీష్ కు రూ. రెండు వేలు జరిమానా విధించారు.
31 మంది పురోహితులకు షోకాజ్ నోటీస్‌లు...
విధులకు సకాలంలో హాజరుకాకపోవడం, విధుల మధ్యలో కొండదిగువకు వెళ్లిపోయి సాయంత్రం వచ్చి మరలా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయడం ద్వారా తాము రోజంతా డ్యూటీలోనే ఉన్నట్లుగా భ్రమింపచేయడం వంటి పనులకు పాల్పడుతున్న 31 మంది పురోహితులకు వివిధ అభియోగాలతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరంతా వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరారు.
రూ.లక్ష కట్...
వ్రత పురోహితుల సెప్టెంబర్ నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత విధించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రకారం విధులకు గైర్హాజరైన, సకాలంలో హాజరు కాని పురోహితుల వేతనం నుంచి కోత విధించారు. ఈ విధంగా గత జూన్ నెల నుంచి ప్రతి నెలా ఎంతో కొంత ఈ విధంగా కోత కోస్తున్నారు.
చర్యలు సరే...నిలకడ ఏది..?
దేవస్థానంలో క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్లంటూ అధికారులు చేసే హడావిడి ఒకటి, రెండు రోజుల్లోనే చప్పగా చల్లారిపోతోంది. గతంలో కూడా ఇదేవిధంగా సస్పెన్షన్లు చేసినా కేవలం రెండు, మూడు రోజుల్లోనే సస్పెన్షన్లు ఎత్తేయడంతో అసలు భయమే లేకుండాపోయింది. కల్యాణోత్సవాల అపశృతుల్లో అరు నెలలు సస్పెండ్ చేసిన పురోహితుడిని కూడా మూడు రోజుల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకున్న చరిత్ర కూడా అధికారుల సొంతం. రాజకీయ పలుకుబడి కలిగినవారు, లేదా వ్రతపురోహితుల యూనియన్ పెద్దల అండదండలున్నవారిని వెంటనే కరుణించేస్తున్నారు. ఏ అండా లేని వారిపైన, అమాయకుల మీద ప్రతాపం చూపిస్తున్నారన్న విమర్శ ఉంది. మరి ఈ క్రమశిక్షణ చర్యలు ఎన్ని రోజులుంటాయో వేచి చూడాలి.
Advertisement
Advertisement