అన్నవరం: అంతన్నాడు.. ఇంతన్నాడు గంగరాజు...అనే సినిమా పాటలా తయారైంది అన్నవరం దేవస్థానానికి ‘ప్రసాద్ ’ స్కీం నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. పదేళ్లుగా దేవస్థానం అధికారులను ఊరిస్తూ రూ.96 కోట్లు ఇస్తామని చివరకు రూ. పది కోట్లు ఇస్తాం అనే పరిస్థితికి తీసుకువచ్చారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే పరిస్థితుల్లో ఆ నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. నిధులిస్తే ఈ పాటికే విడుదల చేసేవారని రాష్ట్ర టూరిజం శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఎనిమిదేళ్ల క్రితమే అన్నవరం దేవస్థానం ఎంపిక
కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కింద దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని ఎంపిక చేసింది. కొండమీద, కొండదిగువన భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ నిర్మాణాల ప్రతిపాదనలు పంపమని కోరింది.
దేవస్థానం అధికారులు రూ.96 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. 2020లో ప్రతిపాదనలను రూ.54 కోట్లకు కుదించి మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించగా దేవస్థానం అధికారులు ఆ విధంగా పంపించారు. రెండు నెలల క్రితం రూ.పది కోట్లు మాత్రమే ఇస్తాం...దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు పంపించమన్నారు. నిరాశకు లోనైన దేవస్థానం రూ.పది కోట్లతో అన్నదాన భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించింది. అలా పంపించిన ప్రతిపాదనలపై ఇంతవరకు ఎటువంటి సమాచారం అటు రాష్ట టూరిజం శాఖ అధికారులకు కాని, అన్నవరం దేవస్థానానికి కాని రాలేదు.
ఎదురు తెన్నులు
డీపీఆర్ ప్రకారం వెంటనే నిధులివ్వాలని 2021 లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాకినాడ ఎంపీ వంగా గీత, ఎంఎల్‌ఎ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. కేంద్రం నుంచి ప్రసాద్ స్కీం నిధులు అన్నవరం దేవస్థానానికి విడుదల అయ్యే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలని రాష్ట్ర టూరిజం శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలోనే జీఓ విడుదల అవ్వాలి. నిధులు విడుదల అవ్వాలి. టెండర్లు పిలవాలి, టెండర్లు ఖరారు కావాలి. ఇదంతా ఈ నెల రోజుల్లో జరగడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment