Annavaram devastanam
-
సెల్‌ఫోన్ సిగ్నల్స్‌కు చర్యలు తీసుకోండి
అన్నవరం: రత్నగిరిపై సెల్‌ఫోన్ సిగ్నల్స్ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షన్మోహన్‌కు అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు గురువారం లేఖ రాశారు. సత్యదేవుని సన్నిధిలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేక డిజిటల్ చెల్లింపులకు భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 11న సాక్షి దినపత్రిక ‘సిగ్నల్ ఇవ్వు స్వామీ..!’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై ఈఓ స్పందించి, కలెక్టర్‌కు ఈ మేరకు లేఖ రాశారు. అన్నవరం దేవస్థానంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఉన్నప్పటికీ త్రీజీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆ లేఖలో తెలిపారు. అవి కూడా చాలా బలహీనంగా ఉంటున్నాయన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయన్నారు. జియో, ఎయిర్టెల్, వీఐ తదితర కంపెనీల సెల్ టవర్లు లేదా బూస్టర్లు రత్నగిరిపై లేవని, అందువలన వాటి సిగ్నల్స్ కూడా చాలా వీక్‌గా ఉంటున్నాయని వివరించారు. భక్తులకు డిజిటల్ పేమెంట్లు, వాట్సాప్ సేవలు త్వరితగతిన అందించాలంటే సెల్‌ఫోన్ సిగ్నల్స్ బాగా ఉండేలా ఆయా కంపెనీలు బూస్టర్లు ఏర్పాటు చేయాలని, దీనికి దేవదాయ శాఖ నిబంధనలను అనుసరించి తాము సహకారం అందిస్తామని పేర్కొన్నారు. -
ఆన్లైన్ బు'కింగ్'లు
రైల్వే తత్కాల్ టికెట్లు ఓపెన్ అవగానే నిమిషాల్లో రిజర్వేషన్లు అయిపోవడం చాలామందికి అనుభవమే. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి టీటీడీ ఆన్లైన్ టికెట్లు విడుదల చేయగానే హాట్ కేకుల్లా భక్తులు తన్నుకుపోతూంటారు. ఇదీ అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే కోవలో అన్నవరం దేవస్థానంలో పలువురు దళారీలు దందా సాగిస్తున్నారు.అన్నవరం: భక్తవరదుడైన రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి ప్రతి రోజూ వేలాదిగా భక్తులు వస్తూంటారు. పలువురు దేవస్థానం సత్రాల్లో గదులు బుక్ చేసుకుని, రాత్రి బస ఉండి.. మర్నాడు వ్రతాలు, ఇతర పూజలు చేయించుకుని వెళ్తూంటారు. పర్వదినాలు, వివాహాల సీజన్లో అయితే రత్నగిరిపై సత్రం గదులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గదులు లభ్యం కాక అనేక మంది భక్తులు కొండ దిగువన డబ్బులిచ్చుకుని ప్రైవేటు సత్రాల్లో బస చేస్తారు. అంత ఖర్చు భరించలేని వారు గత్యంతరం కొండ పైనే ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేస్తూ.. ఇబ్బందులు పడుతూంటారు. ఇలా రత్నగిరిపై అవసరమైన భక్తులకు సత్రం గదులు దొరకకపోవడానికి దళారీల దందాయే కారణమవుతోంది. ఏం జరుగుతోందంటే.. అన్నవరం దేవస్థానంలో ప్రకాష్ సదన్ మినహా మిగిలిన అన్ని సత్రాల్లో 30 శాతం గదులను ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. వీటిలో రూ.200 చార్జీ చేసే సీతారామ సత్రం నుంచి రూ.1,650 అద్దె కలిగిన శివసదన్ (ఏసీ) వరకూ ఉన్నాయి. దేవస్థానంలోని అన్ని సత్రాల్లోనూ 600 గదులున్నాయి. వాటిలో ప్రకాష్ సదన్‌లోని 64 గదులు మినహా మిగిలినవి 536. వీటిలోనూ 60 గదులు మరమ్మతుల్లో ఉన్నాయి. మిగిలిన 476లో 145 గదులకు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా పర్వదినాలు, వివాహాల సీజన్లో అధిక సంఖ్యలో భక్తులు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటారు. సంబంధిత వెబ్‌సైట్‌ను అధికారులు నెల రోజులు ముందుగా అర్ధరాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ అయిన రెండు మూడు నిమిషాల్లోనే దేవస్థానం సత్రాల్లో ఖాళీగా ఉన్న గదులను రిజర్వ్ అయిపోతున్నాయి. ప్రధానంగా ఎక్కువ మంది దళారీలే వివిధ పేర్లతో ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దీంతో గదులు అవసరమున్న భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ ఇలా.. దేవస్థానంలో ఆన్లైన్లో గదులు రిజర్వ్ చేసుకోవడానికి గూగుల్‌లో ఏపీటెంపుల్స్.ఏపీ.జీఓవీ.ఇన్ అని ఇంగ్లిషులో టైపు చేస్తే సంబంధిత సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాల వివరాలు కనిపిస్తాయి. ‘శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం’ మీద క్లిక్ చేస్తే వెంటనే సత్యదేవుని సన్నిధిలో అకామిడేషన్, దర్శనం తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘అకామిడేషన్’ క్లిక్ చేస్తే దేవస్థానంలో వివిధ సత్రాలు, వాటిలో ఖాళీ గదుల వివరాలు కనిపిస్తాయి. వెంటనే ఏ సత్రంలో గది కావాలో క్లిక్ చేస్తే వెంటనే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆ నంబర్ అప్లోడ్ చేసిన వెంటనే సంబంధిత ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని అప్లోడ్ చేయగానే యూజర్ ఐడీ వస్తుంది. దాని ద్వారా రూము కోసం అప్లికేషన్ వస్తుంది. అందులో వివరాలు పొందుపరచాలి. ఒక ఆధార్ కార్డుతో నిర్దేశిత మొత్తం చెల్లించి, ఒక రూము మాత్రమే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక యూజర్ ఐడీతో మరో ఆధార్ కార్డు అప్లోడ్ చేసి, మరో రూము తీసుకునే అవకాశం కూడా ఉంది. దళారీలకు అడ్డుకట్ట వేయాలి అన్నవరం దేవస్థానంలో ఆన్లైన్లో వసతి గదులు రిజర్వ్ చేసుకునే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు దళారులు వెబ్సైట్లో రూములు ఓపెన్ అయిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే రిజర్వ్ చేసుకుంటున్నారు. అటువంటి దళారీలకు అడ్డుకట్ట వేసి, అవసరమైన భక్తులకే గదులు లభ్యమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొండపల్లి అప్పారావు, భక్తుడు, అన్నవరం అంతా నిమిషాల్లోనే.. సాధారణంగా ఎవరైనా సత్రం గదుల రిజర్వేషన్ కోసం ఈ ప్రొïసీజర్ అంతా పూర్తి చేసి, రూమ్ రిజర్వ్ చేసుకోవడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది. అయితే సైట్ ఓపెన్ అయిన రెండు నిమిషాల్లోనే దళారీలు పలువురి ఆధార్ కార్డులు ఉపయోగించి రూములు రిజర్వ్ చేసేసుకుంటున్నారు. దీంతో మిగిలిన వారికి గదులు దొరకడం లేదు. అంతే కాదు.. ఒక్కోసారి దేవస్థానంలోని ఉద్యోగులకు కూడా ఆన్లైన్లో గదులు లభ్యం కాని పరిస్థితి. అటువంటి వారికి ఆ దళారీలు ఎర వేసి, దేవస్థానం గదులు ఇస్తూ.. వారి నుంచి అధిక మొత్తాలు గుంజుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. ఆ వివాహ ముహూర్తాలున్న తేదీల్లో ఇప్పటికే 30 శాతం గదులూ రిజర్వ్ అయిపోయాయి. అలా రిజర్వ్ చేసుకున్న వారు పెళ్లి బృందాలే అనుకుంటే పొరపాటే. దళారీలే పలువురి ఆధార్ కార్డులతో ఈ గదులు హస్తగతం చేసేసుకున్నారు. వివాహాల సీజన్లో విష్ణు సదన్ హాల్స్‌కు దగ్గరగా ఉండే హరిహర సదన్, సీతారామ, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ వంటి సత్రాల్లోను గదులకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని దళారీలు ఆన్లైన్ వేదికగా ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఏం చేయాలంటే.. దళారీలకు అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఎవరి ఆధార్‌తో గదులు రిజర్వ్ చేశారో వారి ఆధార్ కార్డు నకలు ఎవరు తెచ్చి చూపించినా రూము ఇచ్చేస్తున్నారు. దీనికి బదులు ఎవరి ఆధార్ కార్డుతో గది రిజర్వ్ చేసుకున్నారో ఆ వ్యక్తే స్వయంగా సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయానికి (సీఆర్ఓ) వచ్చి, ఆధార్ కార్డు చూపించి, గది తీసుకోవాలనే నిబంధన పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. అలాగే, సత్రం గదుల రిజర్వేషన్‌కు గతంలో గది అద్దెలో 150 శాతం వసూలు చేసేవారు. ప్రస్తుతం 100 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అంటే సీఆర్ఓకు వచ్చి అద్దెకు తీసుకుంటే ఎంత చెల్లించాలో రిజర్వేషన్ చేయించుకున్నా అంతే మొత్తం చెల్లిస్తున్నారు. దీనిని 150 అంటే అద్దె కన్నా 50 శాతం ఎక్కువ వసూలు చేస్తే దళారీలకు కాస్త అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. -
సత్యదేవునికి కేంద్ర ప్రసాద్‌ం లేనట్టేనా?
అన్నవరం: అంతన్నాడు.. ఇంతన్నాడు గంగరాజు...అనే సినిమా పాటలా తయారైంది అన్నవరం దేవస్థానానికి ‘ప్రసాద్ ’ స్కీం నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. పదేళ్లుగా దేవస్థానం అధికారులను ఊరిస్తూ రూ.96 కోట్లు ఇస్తామని చివరకు రూ. పది కోట్లు ఇస్తాం అనే పరిస్థితికి తీసుకువచ్చారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే పరిస్థితుల్లో ఆ నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. నిధులిస్తే ఈ పాటికే విడుదల చేసేవారని రాష్ట్ర టూరిజం శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే అన్నవరం దేవస్థానం ఎంపిక కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కింద దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని ఎంపిక చేసింది. కొండమీద, కొండదిగువన భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ నిర్మాణాల ప్రతిపాదనలు పంపమని కోరింది. దేవస్థానం అధికారులు రూ.96 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. 2020లో ప్రతిపాదనలను రూ.54 కోట్లకు కుదించి మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించగా దేవస్థానం అధికారులు ఆ విధంగా పంపించారు. రెండు నెలల క్రితం రూ.పది కోట్లు మాత్రమే ఇస్తాం...దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు పంపించమన్నారు. నిరాశకు లోనైన దేవస్థానం రూ.పది కోట్లతో అన్నదాన భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించింది. అలా పంపించిన ప్రతిపాదనలపై ఇంతవరకు ఎటువంటి సమాచారం అటు రాష్ట టూరిజం శాఖ అధికారులకు కాని, అన్నవరం దేవస్థానానికి కాని రాలేదు. ఎదురు తెన్నులు డీపీఆర్ ప్రకారం వెంటనే నిధులివ్వాలని 2021 లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాకినాడ ఎంపీ వంగా గీత, ఎంఎల్ఎ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. కేంద్రం నుంచి ప్రసాద్ స్కీం నిధులు అన్నవరం దేవస్థానానికి విడుదల అయ్యే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలని రాష్ట్ర టూరిజం శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలోనే జీఓ విడుదల అవ్వాలి. నిధులు విడుదల అవ్వాలి. టెండర్లు పిలవాలి, టెండర్లు ఖరారు కావాలి. ఇదంతా ఈ నెల రోజుల్లో జరగడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. -
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు)
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు) -
కొత్తగా వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ దేవాదాయశాఖ
-
మధురాతి మధురం..
అన్నవరం: అమృతానికి సరిసాటి అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి ప్రసాదమే అంటే అతిశయోక్తి కానే కాదు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం పేరు వింటే చాలు.. నోట్లో నీరూరక మానదు. ప్రసాదంతో పాటు అది కట్టిన ఆకు కూడా నాకేయాలనిపించేంత రుచిగా ఉంటుంది. అయితే, ఇటీవల సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. ప్రసాదం అంత రుచిగా ఉండటం లేదని, ఒక్క రోజు కూడా నిల్వ ఉండటం లేదని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. దీనిపై గతంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు వీఐపీల కోసం ఎక్కువ సేపు ఉడికించి తయారు చేసే స్పెషల్ ప్రసాదాన్నే సాధారణ భక్తులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరింత రుచిగా, నిల్వ ఉండేలా గోధుమ నూక ప్రసాదం తయారు చేసేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ రెండు రోజుల పాటు ప్రసాద తయారీ విభాగంలో ఒక కళాయిలో భక్తులకు విక్రయించే ప్రసాదం, ఇంకో కళాయిలో వీఐపీ ప్రసాదం వండించి రెండింటి మధ్య తేడాను గమనించారు. నీరంతా ఆవిరయ్యే వరకూ బాగా ఉడికించడం వలన స్పెషల్ ప్రసాదం రంగు, రుచి బాగుంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు విక్రయించే ప్రసాదం కూడా అదే విధంగా తయారు చేయాలని నిర్ణయించారు. మరింతగా యాలకుల పొడి ప్రసాదం తయారీకి ఒక్కో కళాయిలో వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మరిగించిన 40 లీటర్ల నీరు, 15 కేజీల గోధుమ నూక, రెండు విడతలుగా 30 కిలోల పంచదార వేస్తారు. గోధుమ నూక ఉడికాక ఆరు కేజీల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడి కలుపుతారు. ప్రసాదం తయారయ్యాక దానిని తొట్టెలో వేసి, దానిపై కూడా యాలకుల పొడి చల్లి, కాస్త చల్లారాక ప్యాకెట్లు కడతారు. ప్యాకింగ్ చేసేటప్పుడు మరో రెండు కిలోల నెయ్యి కలుపుతారు. గంటన్నర వ్యవధిలో ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. కళాయి ప్రసాదం తయారీకి సుమారు 4.730 కిలోల గ్యాస్ వినియోగమవుతోంది. ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న యాలకుల పొడిని ఇకపై 200 గ్రాములకు పెంచాలని, ప్రసాదాన్ని గంటన్నరకు బదులు రెండు గంటల పాటు ఉడికిస్తే రుచి పెరుగుతుందని ధర్మకర్తల మండలి సమావేశంలో ఈఓ అజాద్ ప్రతిపాదించారు. మరో అరగంట ఎక్కువగా ప్రసాదాన్ని ఉడికించడం వలన కళాయి ప్రసాదం తయారీకి 6 కిలోల (అదనంగా 1.270 కిలోలు) వరకూ గ్యాన్ వినియోగమవుతుంది. ఈ ప్రతిపాదనలకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కళాయి ప్రసాదానికి 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్లు 533 వస్తాయి. తాజా మార్పుల వలన ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి సుమారు రూ.180 అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అంటే ప్రతి ప్యాకెట్‌కు అదనంగా 35 పైసలు ఖర్చు కానుంది. దేవస్థానంలో ఏటా 1.80 కోట్ల ప్రసాదం ప్యాకెట్లు తయారవుతాయి. కొత్తగా చేపట్టే మార్పుల వలన ఏటా అదనంగా సుమారు రూ.60 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. ఏటా రూ.40 కోట్ల ఆదాయం సత్యదేవుని ప్రసాదం విక్రయాల ద్వారా అన్నవరం దేవస్థానానికి ఏటా రూ.40 కోట్ల ఆదాయం వస్తోంది. రత్నగిరిపై 2 కౌంటర్లలో ఉదయం నుంచి రాత్రి వరకు, కొండ దిగువన తొలి పావంచా, నమూనా ఆలయం వద్ద 24 గంటలూ స్వామివారి ప్రసాదాలు విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్ల ద్వారా 150 గ్రాముల బరువైన ప్రసాదం ప్యాకెట్లను ఏటా దాదాపు 1.80 కోట్లు విక్రయిస్తున్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు ఉన్న జాతీయ రహదారి పక్కన కూడా మరో ప్రసాదం కౌంటర్, నమూనా ఆలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా కూడా ప్రసాదం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల కోసమే.. సత్యదేవుని ప్రసాదం మరింత రుచిగా తయారు చేసి భక్తులకు అందించాలనేదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాలకుల పొడి పరిమాణం పెంచి, ఎక్కువసేపు పొయ్యి మీద ఉడికిస్తే బాగా రుచిగా తయారైంది. అదేవిధంగా ప్రసాదం తయారు చేసి భక్తులకు అందించాలని నిర్ణయించాం. దీనికి కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. – చంద్రశేఖర్ అజాద్, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరే
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు 16 మందికి ఈ ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించారు. ప్రభుత్వం గుర్తించిన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు పాలక మండలిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుడు ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉంటారని తెలిపారు. కాగా, ఇప్పటికే విజయవాడ, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు నూతన పాలక మండళ్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. (చదవండి: ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు) అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు వీరే.. 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. సాధు దుర్గ 3. కర్రి భామిరెడ్డి 4. కలగా రామజోగేశ్వర శర్మ 5. వాసిరెడ్డి జగన్నాథం 6. నత్రా మహేశ్వరి 7. గాదె రాజశేఖరరెడ్డి 8. చిట్టూరి సావిత్రి 9. అప్పారి లక్ష్మి 10. ముత్యాల వీరభద్రరావు 11. మోకా సూర్యనారాయణ 12. చాగంటి వెంకట సూర్యనారాయణ 13. ములికి సూర్యవతి 14. బి. ఆశాలత 15. కర్రా వెంటకలక్ష్మి 16. కొండవీటి సత్యనారాయణ (ప్రధాన అర్చకుడు) -
వ్రతపురోహితులపై క్రమశిక్షణ కొరడా
వి«ధులకు సక్రమంగా హాజరుకాని 37 మందిపై ఈఓ చర్యలు ఐదుగురు సస్పెన్షన్, ఒకరికి జరిమానా, 31 మందికి షోకాజ్ నోటీస్‌లు సెప్టెంబర్ నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత అన్నవరం : అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు మరోసారి వ్రత పురోహితులపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించారు. సకాలంలో వి«ధులకు హాజరుకాని, ఎటువంటి సమాచారం లేకుండా గైర్హాజరవుతున్న 37 మంది పురోహితులను ‘బయో మెట్రిక్’ అటెండెన్స్ ద్వారా గుర్తించి వారిపై చర్య తీసుకున్నారు. పురోహితుల సెప్టెంబరు నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత విధించారు. ఈ క్రమశిక్షణ చర్యలతో పురోహితులలో తీవ్ర కలకలం రేగింది. ఐదుగురు పురోహితుల సస్పెన్షన్... ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్న ప్రథమశ్రేణి పురోహితుడు ముత్య శంకర్రావు, రెండో శ్రేణి పురోహితుడు తనికళ్ల నరసింహశర్మలను విధుల నుంచి సస్పెండ్ చేశారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న అభియోగాలపై రాజ్యం రామకృష్ణ, ఆలస్యంగా విధులకు హాజరై, ముందుగా వెళ్లిపోతున్నారన్న అభియోగాలపై మామిళ్లపల్లి రామకృష్ణ, మంధా రవి ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. ఎక్కువ సెలవులు వాడుకుంటున్నందుకు రూ.రెండు వేలు జురిమానా... నిర్దేశించిన సెలవులకన్నా ఎక్కువగా వాడుకుంటున్నారన్న అభియోగంపై అంగర వేంకట సుబ్రహ్మణ్య సతీష్ కు రూ. రెండు వేలు జరిమానా విధించారు. 31 మంది పురోహితులకు షోకాజ్ నోటీస్‌లు... విధులకు సకాలంలో హాజరుకాకపోవడం, విధుల మధ్యలో కొండదిగువకు వెళ్లిపోయి సాయంత్రం వచ్చి మరలా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయడం ద్వారా తాము రోజంతా డ్యూటీలోనే ఉన్నట్లుగా భ్రమింపచేయడం వంటి పనులకు పాల్పడుతున్న 31 మంది పురోహితులకు వివిధ అభియోగాలతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరంతా వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరారు. రూ.లక్ష కట్... వ్రత పురోహితుల సెప్టెంబర్ నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత విధించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రకారం విధులకు గైర్హాజరైన, సకాలంలో హాజరు కాని పురోహితుల వేతనం నుంచి కోత విధించారు. ఈ విధంగా గత జూన్ నెల నుంచి ప్రతి నెలా ఎంతో కొంత ఈ విధంగా కోత కోస్తున్నారు. చర్యలు సరే...నిలకడ ఏది..? దేవస్థానంలో క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్లంటూ అధికారులు చేసే హడావిడి ఒకటి, రెండు రోజుల్లోనే చప్పగా చల్లారిపోతోంది. గతంలో కూడా ఇదేవిధంగా సస్పెన్షన్లు చేసినా కేవలం రెండు, మూడు రోజుల్లోనే సస్పెన్షన్లు ఎత్తేయడంతో అసలు భయమే లేకుండాపోయింది. కల్యాణోత్సవాల అపశృతుల్లో అరు నెలలు సస్పెండ్ చేసిన పురోహితుడిని కూడా మూడు రోజుల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకున్న చరిత్ర కూడా అధికారుల సొంతం. రాజకీయ పలుకుబడి కలిగినవారు, లేదా వ్రతపురోహితుల యూనియన్ పెద్దల అండదండలున్నవారిని వెంటనే కరుణించేస్తున్నారు. ఏ అండా లేని వారిపైన, అమాయకుల మీద ప్రతాపం చూపిస్తున్నారన్న విమర్శ ఉంది. మరి ఈ క్రమశిక్షణ చర్యలు ఎన్ని రోజులుంటాయో వేచి చూడాలి. -
అధికార దుర్వినియోగం
-
అడ్డంగా దొరికిపోయిన అన్నవరం దేవస్థానం ఈఓ!
రాజమండ్రి: అన్నవరం దేవస్థానం ఈఓ ఈవీ జగన్నాథరావు సాక్షి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. నిబంధనలకు విరుద్దంగా దేవస్థానం సిబ్బందిని ఈఓ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. తన ఇంటి ప్రహరీ గోడ, కారు షెడ్ నిర్మాణానికి దేవస్థానం ఉద్యోగుల చేత పనులు చేయించారు. దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఈఓ సుధాకర్, వర్క్ ఇనస్పెక్టర్ రాజబాబులు కూడా నిర్మాణానికి సహకరించారు. ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి.