అన్నవరం: అమృతానికి సరిసాటి అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి ప్రసాదమే అంటే అతిశయోక్తి కానే కాదు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం పేరు వింటే చాలు.. నోట్లో నీరూరక మానదు. ప్రసాదంతో పాటు అది కట్టిన ఆకు కూడా నాకేయాలనిపించేంత రుచిగా ఉంటుంది. అయితే, ఇటీవల సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. ప్రసాదం అంత రుచిగా ఉండటం లేదని, ఒక్క రోజు కూడా నిల్వ ఉండటం లేదని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. దీనిపై గతంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి.
దీనికి తోడు వీఐపీల కోసం ఎక్కువ సేపు ఉడికించి తయారు చేసే స్పెషల్ ప్రసాదాన్నే సాధారణ భక్తులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరింత రుచిగా, నిల్వ ఉండేలా గోధుమ నూక ప్రసాదం తయారు చేసేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ రెండు రోజుల పాటు ప్రసాద తయారీ విభాగంలో ఒక కళాయిలో భక్తులకు విక్రయించే ప్రసాదం, ఇంకో కళాయిలో వీఐపీ ప్రసాదం వండించి రెండింటి మధ్య తేడాను గమనించారు. నీరంతా ఆవిరయ్యే వరకూ బాగా ఉడికించడం వలన స్పెషల్ ప్రసాదం రంగు, రుచి బాగుంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు విక్రయించే ప్రసాదం కూడా అదే విధంగా తయారు చేయాలని నిర్ణయించారు.
మరింతగా యాలకుల పొడి
ప్రసాదం తయారీకి ఒక్కో కళాయిలో వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మరిగించిన 40 లీటర్ల నీరు, 15 కేజీల గోధుమ నూక, రెండు విడతలుగా 30 కిలోల పంచదార వేస్తారు. గోధుమ నూక ఉడికాక ఆరు కేజీల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడి కలుపుతారు. ప్రసాదం తయారయ్యాక దానిని తొట్టెలో వేసి, దానిపై కూడా యాలకుల పొడి చల్లి, కాస్త చల్లారాక ప్యాకెట్లు కడతారు. ప్యాకింగ్ చేసేటప్పుడు మరో రెండు కిలోల నెయ్యి కలుపుతారు. గంటన్నర వ్యవధిలో ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. కళాయి ప్రసాదం తయారీకి సుమారు 4.730 కిలోల గ్యాస్ వినియోగమవుతోంది. ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న యాలకుల పొడిని ఇకపై 200 గ్రాములకు పెంచాలని, ప్రసాదాన్ని గంటన్నరకు బదులు రెండు గంటల పాటు ఉడికిస్తే రుచి పెరుగుతుందని ధర్మకర్తల మండలి సమావేశంలో ఈఓ అజాద్ ప్రతిపాదించారు.
మరో అరగంట ఎక్కువగా ప్రసాదాన్ని ఉడికించడం వలన కళాయి ప్రసాదం తయారీకి 6 కిలోల (అదనంగా 1.270 కిలోలు) వరకూ గ్యాన్ వినియోగమవుతుంది. ఈ ప్రతిపాదనలకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కళాయి ప్రసాదానికి 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్లు 533 వస్తాయి. తాజా మార్పుల వలన ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి సుమారు రూ.180 అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అంటే ప్రతి ప్యాకెట్‌కు అదనంగా 35 పైసలు ఖర్చు కానుంది. దేవస్థానంలో ఏటా 1.80 కోట్ల ప్రసాదం ప్యాకెట్లు తయారవుతాయి. కొత్తగా చేపట్టే మార్పుల వలన ఏటా అదనంగా సుమారు రూ.60 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు.
ఏటా రూ.40 కోట్ల ఆదాయం
సత్యదేవుని ప్రసాదం విక్రయాల ద్వారా అన్నవరం దేవస్థానానికి ఏటా రూ.40 కోట్ల ఆదాయం వస్తోంది. రత్నగిరిపై 2 కౌంటర్లలో ఉదయం నుంచి రాత్రి వరకు, కొండ దిగువన తొలి పావంచా, నమూనా ఆలయం వద్ద 24 గంటలూ స్వామివారి ప్రసాదాలు విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్ల ద్వారా 150 గ్రాముల బరువైన ప్రసాదం ప్యాకెట్లను ఏటా దాదాపు 1.80 కోట్లు విక్రయిస్తున్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు ఉన్న జాతీయ రహదారి పక్కన కూడా మరో ప్రసాదం కౌంటర్, నమూనా ఆలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా కూడా ప్రసాదం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
భక్తుల కోసమే..
సత్యదేవుని ప్రసాదం మరింత రుచిగా తయారు చేసి భక్తులకు అందించాలనేదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాలకుల పొడి పరిమాణం పెంచి, ఎక్కువసేపు పొయ్యి మీద ఉడికిస్తే బాగా రుచిగా తయారైంది. అదేవిధంగా ప్రసాదం తయారు చేసి భక్తులకు అందించాలని నిర్ణయించాం. దీనికి కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
– చంద్రశేఖర్ అజాద్, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment