‘ఘీ’చులాట
Published Fri, Oct 28 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
నెయ్యి సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ఏపీ డెయిరీ
కిలో రూ.400 చొప్పున ‘సంగం’ నుంచి కొనుగోలుకు నిర్ణయం
అన్నవరం :
కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అన్నవరం దేవస్థానం అధికారులకు షాక్ తగిలింది. స్వామివారి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి(ఘీ)ని సరఫరా చేస్తున్న ఏపీ డెయిరీ అధికారులు ఇకపై నెయ్యి సరఫరా చేయలేమని లేఖ పంపించారు. ప్రతి నెలా సుమారు 12 టన్నుల నెయ్యి ప్రసాదం విభాగంలో వాడుతుండగా కార్తీకమాసంలో ఏకంగా 20 టన్నులకు పైగా నెయ్యి అవసరం. ఇంత పెద్ద మొత్తంలో నెయ్యిని ఎక్కడ కొనుగోలు చేయాలోనని అధికారులు డైలమాలో పడ్డారు. దానికితోడు శుక్రవారం తయారు చేసే ప్రసాదానికి అవసరమయ్యే 400 కేజీల నెయ్యి కూడా దేవస్థానంలో లేని పరిస్థితి. దీంతో అధికారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
గతంలో రెండు నెలలపాటు నెయ్యి సరఫరా చేసిన సంగం డెయిరీ మళ్లీ నెయ్యి సరఫరా చేయాలని కోరగా సంబంధిత యాజమాన్యం ఆమోదం తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాదు గురువారం ఒక్కో టిన్ను 15 కేజీల బరువు కలిగిన 350 టిన్నులు నెయ్యిని పంపించడంతో శుక్రవారం ప్రసాదం తయారీకి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే రేటు మాత్రం కేజీ నెయ్యికి రూ.26 అదనంగా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు దేవస్థానంపై భారం పడనుంది.
దేవస్థానానికి అదనపు భారం:
ప్రస్తుతం కేజీ నెయ్యి రూ.374కి కొనుగోలు చేస్తుండగా సంగం డెయిరీ నెయ్యి కేజీ రూ.400. దీంతో కేజీకి రూ.26 అదనపు భారం పడనుంది. నెలకు సుమారు 20 టన్నుల నెయ్యి కొనుగోలు చేస్తారనుకుంటే రూ.5.20లక్షలు అదనపు భారం పడనుంది. అయితే బహిరంగ మార్కెటలో ఇతర మిల్క్ సొసైటీల నెయ్యి రేటు కిలో రూ.420 నుంచి రూ.440 వరకూ ఉందని అధికారులు తెలిపారు. దీంతో పోలిస్తే ఇది తక్కువేనని వివరించారు.
ఏపీ డెయిరీ సరఫరా చేయనందునే..
ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ డెయిరీ నుంచే ఇప్పటి వరకూ నెయ్యి కొనుగోలు చేశాం. వారు హఠాత్తుగా సరఫరా చేయలేమని చెప్పడంతో సంగం డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి నిర్ణయించాం సంగం డెయిరీ విజయవాడ, ద్వారకా తిరుమల దేవస్థానాలకు కేజీ నెయ్యి రూ.400కి సరఫరా చేస్తోందని, అదే రేటు చెల్లించాలని వారు కోరగా అంగీకరించాం
– ఈఓ నాగేశ్వరరావు
Advertisement