
సెల్‌ఫోన్ సిగ్నల్స్‌కు చర్యలు తీసుకోండి
అన్నవరం: రత్నగిరిపై సెల్‌ఫోన్ సిగ్నల్స్ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షన్మోహన్‌కు అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు గురువారం లేఖ రాశారు. సత్యదేవుని సన్నిధిలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేక డిజిటల్ చెల్లింపులకు భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 11న సాక్షి దినపత్రిక ‘సిగ్నల్ ఇవ్వు స్వామీ..!’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై ఈఓ స్పందించి, కలెక్టర్‌కు ఈ మేరకు లేఖ రాశారు.
అన్నవరం దేవస్థానంలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఉన్నప్పటికీ త్రీజీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆ లేఖలో తెలిపారు. అవి కూడా చాలా బలహీనంగా ఉంటున్నాయన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయన్నారు. జియో, ఎయిర్‌టెల్, వీఐ తదితర కంపెనీల సెల్ టవర్లు లేదా బూస్టర్లు రత్నగిరిపై లేవని, అందువలన వాటి సిగ్నల్స్ కూడా చాలా వీక్‌గా ఉంటున్నాయని వివరించారు. భక్తులకు డిజిటల్ పేమెంట్లు, వాట్సాప్ సేవలు త్వరితగతిన అందించాలంటే సెల్‌ఫోన్ సిగ్నల్స్ బాగా ఉండేలా ఆయా కంపెనీలు బూస్టర్లు ఏర్పాటు చేయాలని, దీనికి దేవదాయ శాఖ నిబంధనలను అనుసరించి తాము సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment