సత్యదేవా.. అడ్డుకోవా..!
అన్నవరం దేవస్థానంలో దళారీల దందా
వివిధ సత్రాల్లో 30 శాతం రూములకు ఆన్‌లైన్ రిజర్వేషన్
వెబ్‌సైట్‌లో ఓపెన్ కాగానే రెండు నిమిషాల్లోనే చేజిక్కించుకుంటున్న వైనం
రైల్వే తత్కాల్ టికెట్లు ఓపెన్ అవగానే నిమిషాల్లో రిజర్వేషన్లు అయిపోవడం చాలామందికి అనుభవమే. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి టీటీడీ ఆన్‌లైన్ టికెట్లు విడుదల చేయగానే హాట్ కేకుల్లా భక్తులు తన్నుకుపోతూంటారు. ఇదీ అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే కోవలో అన్నవరం దేవస్థానంలో పలువురు దళారీలు దందా సాగిస్తున్నారు.
అన్నవరం: భక్తవరదుడైన రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి ప్రతి రోజూ వేలాదిగా భక్తులు వస్తూంటారు. పలువురు దేవస్థానం సత్రాల్లో గదులు బుక్ చేసుకుని, రాత్రి బస ఉండి.. మర్నాడు వ్రతాలు, ఇతర పూజలు చేయించుకుని వెళ్తూంటారు. పర్వదినాలు, వివాహాల సీజన్‌లో అయితే రత్నగిరిపై సత్రం గదులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఆ సమయంలో గదులు లభ్యం కాక అనేక మంది భక్తులు కొండ దిగువన డబ్బులిచ్చుకుని ప్రైవేటు సత్రాల్లో బస చేస్తారు. అంత ఖర్చు భరించలేని వారు గత్యంతరం కొండ పైనే ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేస్తూ.. ఇబ్బందులు పడుతూంటారు. ఇలా రత్నగిరిపై అవసరమైన భక్తులకు సత్రం గదులు దొరకకపోవడానికి దళారీల దందాయే కారణమవుతోంది.
ఏం జరుగుతోందంటే..
అన్నవరం దేవస్థానంలో ప్రకాష్ సదన్ మినహా మిగిలిన అన్ని సత్రాల్లో 30 శాతం గదులను ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. వీటిలో రూ.200 చార్జీ చేసే సీతారామ సత్రం నుంచి రూ.1,650 అద్దె కలిగిన శివసదన్ (ఏసీ) వరకూ ఉన్నాయి. దేవస్థానంలోని అన్ని సత్రాల్లోనూ 600 గదులున్నాయి.
వాటిలో ప్రకాష్ సదన్‌లోని 64 గదులు మినహా మిగిలినవి 536. వీటిలోనూ 60 గదులు మరమ్మతుల్లో ఉన్నాయి. మిగిలిన 476లో 145 గదులకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా పర్వదినాలు, వివాహాల సీజన్‌లో అధిక సంఖ్యలో భక్తులు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకుంటారు.
సంబంధిత వెబ్‌సైట్‌ను అధికారులు నెల రోజులు ముందుగా అర్ధరాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ అయిన రెండు మూడు నిమిషాల్లోనే దేవస్థానం సత్రాల్లో ఖాళీగా ఉన్న గదులను రిజర్వ్ అయిపోతున్నాయి. ప్రధానంగా ఎక్కువ మంది దళారీలే వివిధ పేర్లతో ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దీంతో గదులు అవసరమున్న భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఆన్‌లైన్ రిజర్వేషన్ ఇలా..
దేవస్థానంలో ఆన్‌లైన్‌లో గదులు రిజర్వ్ చేసుకోవడానికి గూగుల్‌లో ఏపీటెంపుల్స్.ఏపీ.జీఓవీ.ఇన్ అని ఇంగ్లిషులో టైపు చేస్తే సంబంధిత సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాల వివరాలు కనిపిస్తాయి. ‘శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం’ మీద క్లిక్ చేస్తే వెంటనే సత్యదేవుని సన్నిధిలో అకామిడేషన్, దర్శనం తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘అకామిడేషన్’ క్లిక్ చేస్తే దేవస్థానంలో వివిధ సత్రాలు, వాటిలో ఖాళీ గదుల వివరాలు కనిపిస్తాయి.
వెంటనే ఏ సత్రంలో గది కావాలో క్లిక్ చేస్తే వెంటనే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆ నంబర్ అప్‌లోడ్ చేసిన వెంటనే సంబంధిత ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని అప్‌లోడ్ చేయగానే యూజర్ ఐడీ వస్తుంది. దాని ద్వారా రూము కోసం అప్లికేషన్ వస్తుంది. అందులో వివరాలు పొందుపరచాలి. ఒక ఆధార్ కార్డుతో నిర్దేశిత మొత్తం చెల్లించి, ఒక రూము మాత్రమే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక యూజర్ ఐడీతో మరో ఆధార్ కార్డు అప్‌లోడ్ చేసి, మరో రూము తీసుకునే అవకాశం కూడా ఉంది.
దళారీలకు అడ్డుకట్ట వేయాలి
అన్నవరం దేవస్థానంలో ఆన్‌లైన్‌లో వసతి గదులు రిజర్వ్ చేసుకునే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు దళారులు వెబ్‌సైట్‌లో రూములు ఓపెన్ అయిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే రిజర్వ్ చేసుకుంటున్నారు. అటువంటి దళారీలకు అడ్డుకట్ట వేసి, అవసరమైన భక్తులకే గదులు లభ్యమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొండపల్లి అప్పారావు, భక్తుడు, అన్నవరం
అంతా నిమిషాల్లోనే..
సాధారణంగా ఎవరైనా సత్రం గదుల రిజర్వేషన్ కోసం ఈ ప్రొïసీజర్ అంతా పూర్తి చేసి, రూమ్ రిజర్వ్ చేసుకోవడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది. అయితే సైట్ ఓపెన్ అయిన రెండు నిమిషాల్లోనే దళారీలు పలువురి ఆధార్ కార్డులు ఉపయోగించి రూములు రిజర్వ్ చేసేసుకుంటున్నారు. దీంతో మిగిలిన వారికి గదులు దొరకడం లేదు. అంతే కాదు.. ఒక్కోసారి దేవస్థానంలోని ఉద్యోగులకు కూడా ఆన్‌లైన్‌లో గదులు లభ్యం కాని పరిస్థితి.
అటువంటి వారికి ఆ దళారీలు ఎర వేసి, దేవస్థానం గదులు ఇస్తూ.. వారి నుంచి అధిక మొత్తాలు గుంజుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. ఆ వివాహ ముహూర్తాలున్న తేదీల్లో ఇప్పటికే 30 శాతం గదులూ రిజర్వ్ అయిపోయాయి. అలా రిజర్వ్ చేసుకున్న వారు పెళ్లి బృందాలే అనుకుంటే పొరపాటే.
దళారీలే పలువురి ఆధార్ కార్డులతో ఈ గదులు హస్తగతం చేసేసుకున్నారు. వివాహాల సీజన్‌లో విష్ణు సదన్ హాల్స్‌కు దగ్గరగా ఉండే హరిహర సదన్, సీతారామ, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ వంటి సత్రాల్లోను గదులకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని దళారీలు ఆన్‌లైన్ వేదికగా ‘క్యాష్’ చేసుకుంటున్నారు.
ఏం చేయాలంటే..
దళారీలకు అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఎవరి ఆధార్‌తో గదులు రిజర్వ్ చేశారో వారి ఆధార్ కార్డు నకలు ఎవరు తెచ్చి చూపించినా రూము ఇచ్చేస్తున్నారు. దీనికి బదులు ఎవరి ఆధార్ కార్డుతో గది రిజర్వ్ చేసుకున్నారో ఆ వ్యక్తే స్వయంగా సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయానికి (సీఆర్‌ఓ) వచ్చి, ఆధార్ కార్డు చూపించి, గది తీసుకోవాలనే నిబంధన పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.
అలాగే, సత్రం గదుల రిజర్వేషన్‌కు గతంలో గది అద్దెలో 150 శాతం వసూలు చేసేవారు. ప్రస్తుతం 100 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అంటే సీఆర్‌ఓకు వచ్చి అద్దెకు తీసుకుంటే ఎంత చెల్లించాలో రిజర్వేషన్ చేయించుకున్నా అంతే మొత్తం చెల్లిస్తున్నారు. దీనిని 150 అంటే అద్దె కన్నా 50 శాతం ఎక్కువ వసూలు చేస్తే దళారీలకు కాస్త అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment