Online reservation
-
ఆన్లైన్ బు'కింగ్'లు
రైల్వే తత్కాల్ టికెట్లు ఓపెన్ అవగానే నిమిషాల్లో రిజర్వేషన్లు అయిపోవడం చాలామందికి అనుభవమే. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి టీటీడీ ఆన్లైన్ టికెట్లు విడుదల చేయగానే హాట్ కేకుల్లా భక్తులు తన్నుకుపోతూంటారు. ఇదీ అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే కోవలో అన్నవరం దేవస్థానంలో పలువురు దళారీలు దందా సాగిస్తున్నారు.అన్నవరం: భక్తవరదుడైన రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి ప్రతి రోజూ వేలాదిగా భక్తులు వస్తూంటారు. పలువురు దేవస్థానం సత్రాల్లో గదులు బుక్ చేసుకుని, రాత్రి బస ఉండి.. మర్నాడు వ్రతాలు, ఇతర పూజలు చేయించుకుని వెళ్తూంటారు. పర్వదినాలు, వివాహాల సీజన్లో అయితే రత్నగిరిపై సత్రం గదులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గదులు లభ్యం కాక అనేక మంది భక్తులు కొండ దిగువన డబ్బులిచ్చుకుని ప్రైవేటు సత్రాల్లో బస చేస్తారు. అంత ఖర్చు భరించలేని వారు గత్యంతరం కొండ పైనే ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేస్తూ.. ఇబ్బందులు పడుతూంటారు. ఇలా రత్నగిరిపై అవసరమైన భక్తులకు సత్రం గదులు దొరకకపోవడానికి దళారీల దందాయే కారణమవుతోంది. ఏం జరుగుతోందంటే.. అన్నవరం దేవస్థానంలో ప్రకాష్ సదన్ మినహా మిగిలిన అన్ని సత్రాల్లో 30 శాతం గదులను ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. వీటిలో రూ.200 చార్జీ చేసే సీతారామ సత్రం నుంచి రూ.1,650 అద్దె కలిగిన శివసదన్ (ఏసీ) వరకూ ఉన్నాయి. దేవస్థానంలోని అన్ని సత్రాల్లోనూ 600 గదులున్నాయి. వాటిలో ప్రకాష్ సదన్‌లోని 64 గదులు మినహా మిగిలినవి 536. వీటిలోనూ 60 గదులు మరమ్మతుల్లో ఉన్నాయి. మిగిలిన 476లో 145 గదులకు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా పర్వదినాలు, వివాహాల సీజన్లో అధిక సంఖ్యలో భక్తులు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటారు. సంబంధిత వెబ్‌సైట్‌ను అధికారులు నెల రోజులు ముందుగా అర్ధరాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ అయిన రెండు మూడు నిమిషాల్లోనే దేవస్థానం సత్రాల్లో ఖాళీగా ఉన్న గదులను రిజర్వ్ అయిపోతున్నాయి. ప్రధానంగా ఎక్కువ మంది దళారీలే వివిధ పేర్లతో ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దీంతో గదులు అవసరమున్న భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ ఇలా.. దేవస్థానంలో ఆన్లైన్లో గదులు రిజర్వ్ చేసుకోవడానికి గూగుల్‌లో ఏపీటెంపుల్స్.ఏపీ.జీఓవీ.ఇన్ అని ఇంగ్లిషులో టైపు చేస్తే సంబంధిత సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాల వివరాలు కనిపిస్తాయి. ‘శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం’ మీద క్లిక్ చేస్తే వెంటనే సత్యదేవుని సన్నిధిలో అకామిడేషన్, దర్శనం తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘అకామిడేషన్’ క్లిక్ చేస్తే దేవస్థానంలో వివిధ సత్రాలు, వాటిలో ఖాళీ గదుల వివరాలు కనిపిస్తాయి. వెంటనే ఏ సత్రంలో గది కావాలో క్లిక్ చేస్తే వెంటనే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆ నంబర్ అప్లోడ్ చేసిన వెంటనే సంబంధిత ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని అప్లోడ్ చేయగానే యూజర్ ఐడీ వస్తుంది. దాని ద్వారా రూము కోసం అప్లికేషన్ వస్తుంది. అందులో వివరాలు పొందుపరచాలి. ఒక ఆధార్ కార్డుతో నిర్దేశిత మొత్తం చెల్లించి, ఒక రూము మాత్రమే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక యూజర్ ఐడీతో మరో ఆధార్ కార్డు అప్లోడ్ చేసి, మరో రూము తీసుకునే అవకాశం కూడా ఉంది. దళారీలకు అడ్డుకట్ట వేయాలి అన్నవరం దేవస్థానంలో ఆన్లైన్లో వసతి గదులు రిజర్వ్ చేసుకునే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు దళారులు వెబ్సైట్లో రూములు ఓపెన్ అయిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే రిజర్వ్ చేసుకుంటున్నారు. అటువంటి దళారీలకు అడ్డుకట్ట వేసి, అవసరమైన భక్తులకే గదులు లభ్యమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొండపల్లి అప్పారావు, భక్తుడు, అన్నవరం అంతా నిమిషాల్లోనే.. సాధారణంగా ఎవరైనా సత్రం గదుల రిజర్వేషన్ కోసం ఈ ప్రొïసీజర్ అంతా పూర్తి చేసి, రూమ్ రిజర్వ్ చేసుకోవడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది. అయితే సైట్ ఓపెన్ అయిన రెండు నిమిషాల్లోనే దళారీలు పలువురి ఆధార్ కార్డులు ఉపయోగించి రూములు రిజర్వ్ చేసేసుకుంటున్నారు. దీంతో మిగిలిన వారికి గదులు దొరకడం లేదు. అంతే కాదు.. ఒక్కోసారి దేవస్థానంలోని ఉద్యోగులకు కూడా ఆన్లైన్లో గదులు లభ్యం కాని పరిస్థితి. అటువంటి వారికి ఆ దళారీలు ఎర వేసి, దేవస్థానం గదులు ఇస్తూ.. వారి నుంచి అధిక మొత్తాలు గుంజుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. ఆ వివాహ ముహూర్తాలున్న తేదీల్లో ఇప్పటికే 30 శాతం గదులూ రిజర్వ్ అయిపోయాయి. అలా రిజర్వ్ చేసుకున్న వారు పెళ్లి బృందాలే అనుకుంటే పొరపాటే. దళారీలే పలువురి ఆధార్ కార్డులతో ఈ గదులు హస్తగతం చేసేసుకున్నారు. వివాహాల సీజన్లో విష్ణు సదన్ హాల్స్‌కు దగ్గరగా ఉండే హరిహర సదన్, సీతారామ, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ వంటి సత్రాల్లోను గదులకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని దళారీలు ఆన్లైన్ వేదికగా ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఏం చేయాలంటే.. దళారీలకు అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఎవరి ఆధార్‌తో గదులు రిజర్వ్ చేశారో వారి ఆధార్ కార్డు నకలు ఎవరు తెచ్చి చూపించినా రూము ఇచ్చేస్తున్నారు. దీనికి బదులు ఎవరి ఆధార్ కార్డుతో గది రిజర్వ్ చేసుకున్నారో ఆ వ్యక్తే స్వయంగా సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయానికి (సీఆర్ఓ) వచ్చి, ఆధార్ కార్డు చూపించి, గది తీసుకోవాలనే నిబంధన పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. అలాగే, సత్రం గదుల రిజర్వేషన్‌కు గతంలో గది అద్దెలో 150 శాతం వసూలు చేసేవారు. ప్రస్తుతం 100 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అంటే సీఆర్ఓకు వచ్చి అద్దెకు తీసుకుంటే ఎంత చెల్లించాలో రిజర్వేషన్ చేయించుకున్నా అంతే మొత్తం చెల్లిస్తున్నారు. దీనిని 150 అంటే అద్దె కన్నా 50 శాతం ఎక్కువ వసూలు చేస్తే దళారీలకు కాస్త అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. -
రైల్వే ప్రయాణికులు తీవ్ర నిరాశ..
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల తర్వాత తిరిగి మొదలైన ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీలతో ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్స్‌పై వెనకడుగు వేస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం సర్వీస్ చార్జీలను తొలగించడంతో ఆన్లైన్ బుకింగ్స్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని వర్గాల ప్రయాణికులు ఆన్లైన్లోనే టికెట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రధాన బుకింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రయాణికులు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా సొంతంగా టికెట్లను బుక్ చేసుకున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు రైల్వే చేపట్టిన డిజిటలైజేషన్‌కు సైతం ఊతమిచ్చింది. కానీ ఇటీవల మళ్లీ సర్వీస్ చార్జీలను అమల్లోకి తేవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆన్లైన్లోనే 65శాతం... దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు రిజర్వేషన్లపై రాకపోకలు సాగిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్ల నుంచి ప్రతిరోజు సుమారు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య నడుస్తాయి. ఏసీ, స్లీపర్ కోచ్‌లకు ఉన్న డిమాండ్ మేరకు సాధారణంగా ప్రయాణికులు 3 నెలల ముందే బుక్ చేసుకుంటారు. పండగలు, వరుస సెలవుల లాంటి ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ మరింత పెరుగుతుంది. నగరంలోని అన్ని ప్రధాన స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ డిమాండ్‌కు తగిన కౌంటర్లు లేకపోవడం, సిబ్బంది కొరత, పని గంటలు తదితర సమస్యల దృష్ట్యా ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు విక్రయించే రిజర్వేషన్ టికెట్లలో 65శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ కావడం గమనార్హం. కేవలం 35శాతం టికెట్లు కౌంటర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రయాణికులు ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుంటే చాలు... క్షణాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తాజాగా 10శాతం తగ్గుదల... రెండేళ్ల క్రితం తొలగించిన సర్వీస్ చార్జీలను తిరిగి విధించడంతో ప్రయాణికులు ప్రస్తుతం ఒక్కో స్లీపర్ టికెట్ బుకింగ్‌కు రూ.18, ఒక్కో ఏసీ టికెట్ బుకింగ్ కోసం రూ.40 చెల్లించాల్సి వస్తోంది. మొదటి నుంచి ఆన్‌లైన్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తిరిగి అమల్లోకి వచ్చిన భారాన్ని యథావిధిగా భరిస్తున్నప్పటికీ.. ఈ రెండేళ్లలో కొత్తగా ఆన్లైన్ పరిధిలోకి వచ్చినవాళ్లు మాత్రం కౌంటర్ల వైపు మళ్లుతున్నారు. ఇటీవల కాలంలో సుమారు 10 శాతం మంది ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్‌ల నుంచి కౌంటర్ బుకింగ్‌లకు మళ్లినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8వరకు పని చేస్తాయి. ఆదివారం మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే ఉంటాయి. కానీ చాలా చోట్ల సిబ్బంది కొరత కారణంగా ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా కౌంటర్లు పని చేయడం లేదు. ఐఆర్సీటీసీ ఆన్లైన్లో రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 12:15 వరకు అంటే 30 నిమిషాలు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉండదు. మిగతా అన్ని సమయాల్లోనూ ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉన్న ఆన్లైన్ బుకింగ్‌లపై తాజాగా విధించిన సర్వీస్ చార్జీలను శాశ్వతంగా తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
చేతిలో స్టీరింగ్..చెవిలో సెల్‌ఫోన్
మంచిర్యాలఅర్బన్: అనుకోని ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరు.. కానీ నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకునే ప్రమాదాలను నివారించే అవకాశాలున్నాయి. అయితే ఆర్టీసీ అధికారుల తీరుతో ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లు అవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ సంభాషిస్తున్న ఘటనలు కూడా ఓ కారణమే. ఇటీవలనే ఆర్టీసీ జాతీయ రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించి నిబంధనలు గుర్తుచేశారు. అయితే సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్‌ను నియంత్రించిన ఆర్టీసీ అధికారులే నిబంధనలు అతిక్రమించటం ఆర్టీసీలో చెల్లుబాటు అవుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజమే. మంచిర్యాల డిపోలో కొంతకాలంగా డ్రైవింగ్‌లో ఉన్నా.. ఖాళీగా ఉన్నా విధుల్లోకి చేరాడంటే సెల్‌ఫోన్ లేనిదే డ్రైవర్లు డ్యూటీ చేయలేని విచిత్ర పరిస్థితిపై ‘సాక్షి’ కథనం. జిల్లాలో ఏకైక డిపో మంచిర్యాలలో మొత్తం 560 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 263 మంది ఉండాల్సిన డ్రైవర్ల స్థానంలో 201 మందితోనే నెట్టుకువస్తున్నారు. కొత్తగా నియామకాలు లేకపోవటం.. సిక్లో ఉండటం ఖాళీలు భర్తీకాక ఉన్న డ్రైవర్లపైనే పనిభారం పడుతోంది. చేతిలో స్టీరింగ్ ఉన్నా ఫోన్ సంభాషణ చేయాల్సిందే. లేదంటే ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆన్లైన్ రిజర్వేషన్ బస్సుల్లోనే... దూరప్రాంతమైన హైదరాబాద్‌కు నడిచే బస్సుల్లోనే డ్రైవర్లు ఫోన్ వినియోగిస్తారు. బస్సు ఎక్కింది మొదలు సీట్లు నిండే వరకు ప్రయాణికుల ఫోన్లతో సతమతమవుతున్నారు. ఉదా..కాసిపేట్ మండలం దేవాపూర్ నుంచి హైదరాబాద్‌కు బస్సు వెళ్లాలంటే మంచిర్యాల డిపో నుంచి వెళ్లేముందు డ్రైవర్ రిపోర్టు చేసే సమయం 7.30 గంటలు ఉంటుంది. బస్సు ప్లాట్‌ఫారంపై 8 గంటలకు నిలిపి అక్కడి నుంచి 9 గంటలకు దేవాపూర్‌కు చేరుకుంటుంది. 9.30 గంటలకు బయలుదేరి మంచిర్యాల బస్‌స్టేషన్‌కు వచ్చి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే దేవాపూర్‌కు వెళ్లి వచ్చేంత వరకు డ్రైవర్‌కు ఫోన్లు వస్తూనే ఉంటాయి. మంచిర్యాలలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుడు డ్రైవర్‌కు ఫోన్ చేసి బస్సు ఎక్కడ ఉంది.. ఎంతసేపటికి వస్తారు.. పలు ప్రశ్నలతో విసిగిస్తుంటారు. ఫోన్లో మాట్లాడిన తప్పే.. మాట్లాడకపోయిన తప్పే అనే మాదిరిగా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో వేబిల్లులో కంట్రోలర్ నంబర్ ముద్రణ ఎందుకిలా? మంచిర్యాల డిపోలో విధులు నిర్వహించే డ్రైవర్ల సెల్‌ఫోన్ నంబర్లు ప్రయాణికులకు ఎలా చేరుతున్నాయనే అనే అంశాలపై ‘సాక్షి’ ఆరా తీస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్ పొందినప్పుడు టిక్కెట్‌పై.. ప్రయాణికుడికి వచ్చే మెసెజ్ (సందేశం)లో బస్సుపై విధులు నిర్వహించే డ్రైవర్ ఫోన్‌నంబర్ ముద్రిస్తారన్నమాట. ఇది అధికారుల సూచనలతోనే ప్రయాణికుడికి సులువుగా బస్సు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఫోన్‌నంబర్లు ముద్రిస్తారు. బస్సుల్లో ఉన్న ప్రయాణికుడు ఒక్కోసారి కాకుండా పలుమార్లు చేయడటంతో చేతిలో స్టీరింగ్ ఉన్నా తప్పని సరిగా ఫోన్లో మాట్లాడాల్సిన పరిస్థితులున్నాయి. ఇక్కడ మాత్రం కంట్రోలర్‌ది కాకుండా డ్రైవర్ల ఫోన్ నెంబర్ ఇవ్వటంపై కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా బస్సుస్టేషన్ కంట్రోలర్ నెంబర్ ఇస్తే ప్రమాదాల నివారణతోపాటు డ్రైవర్‌కు ఇక్కట్లు తొలగిపోతాయి. డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతుంది ఎక్కడ లేని విధంగా మంచిర్యాల డిపోలో ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్‌పై డ్రైవర్ల నంబర్లు ముద్రిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కంట్రోలర్ నంబర్, ఇతర అధికారుల ఫోన్‌నంబర్లు ఇస్తే బాగుంటుంది. కానీ నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులే ఉల్లంఘించడం సరికాదు. కరీంనగర్ డిపోలో అక్కడ టికెట్లపై ఇచ్చే ఫోన్‌నంబర్ డ్రైవర్‌ది కాకుండా కంట్రోలర్‌ది ఇస్తారు..దీంతో ఏ సమాచారమైన కంట్రోలర్ తెలుసుకుని ప్రయాణికుడికి అందిస్తారు.– వీబీరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి విచారించి చర్యలు చేపడుతాం ఆర్టీసీలో నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లపై ఫోన్‌నంబర్లు ముద్రిస్తుంటారు. ఇతర ప్రాంతాల్లో పరిశీలన చేసి అక్కడ ఏవిధంగా ఉంటే మంచిర్యాలలో కూడా అలాగే నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు చేపడతాం.– శ్రీనివాస్, ఆర్టీసీ డీవీఎం, మంచిర్యాల -
రైలు రద్దయితే నేరుగా ఖాతాలోకే రీఫండ్
న్యూఢిల్లీ: ఏదేనీ రైలు తొలి స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు మొత్తంగా రద్దయితే, ఆ రైలుకు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకే ఆటోమేటిక్‌గా వెనక్కు వస్తాయని ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) స్పష్టంచేసింది. ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దుచేసుకుని రీఫండ్ కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదంది. రైలు పూర్తిగా రద్దయినప్పుడు ఆ రైలు ఎక్కాల్సిన ప్రయాణికులందరి పీఎన్ఆర్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలో ఏ బ్యాంకు ఖాతాను/కార్డును వాడతారో ఆ ఖాతాలోకే నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపింది. కాగా, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాక, రైలు బయలుదేరే సమయానికి కూడా బెర్తు/సీటు కన్ఫర్మ్ అవ్వకపోతే కూడా ఆ వెయిట్‌లిస్టింగ్ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దయ్యి రీఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాలోకొస్తాయి. -
రైలు టికెట్‌తోపాటే బీమా.. అనూహ్య స్పందన
హైదరాబాద్ : రైలు ప్రయాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా.. ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే టిక్కెట్‌తో పాటే ప్రయాణ బీమాను సైతం నమోదు చేసుకోవడం మరచిపోవద్దు. రైల్వేశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బీమా సదుపాయం వల్ల ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. కేవలం 92 పైసల ప్రీమియం చెల్లింపుతో ఈ బీమా సదుపాయాన్ని పొందవచ్చు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు గత నెలలో ప్రమాద బీమా గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకొనే సమయంలో టికెట్ రిజర్వేషన్ బుక్ అయిన వెంటనే 92 పైసల ప్రీమియం చెల్లిస్తే చాలు. రైల్వేశాఖ అమల్లోకి తెచ్చిన బీమా పరిధిలో చేరిపోతారు. ట్రైన్ ఎక్కే సమయం నుంచి గమ్యస్థానానికి చేరుకొని ట్రైన్ దిగే వరకు బీమా వర్తిస్తుంది. ఒక టిక్కెట్ పై ఎంతమంది ప్రయాణికులు బుక్ అయితే అంతమందికి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. గత 15 రోజుల్లో 5.75 లక్షల మంది ప్రయాణికులు ఈ పథకాన్ని నమోదు చేసుకోవడం గమనార్హం. లక్షలాది మందికి ప్రయోజనం... తరచుగా ఎక్కడో ఒక చోట రైలుప్రమాదాలు, బోగీల దహనం, రైలెక్కబోతూ..దిగబోతూ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. ప్రమాద దుర్ఘటనల్లో రైల్వేశాఖ స్వతహాగా పరిహారం చెల్లిస్తున్నప్పటికీ ప్రయాణికులు సైతం స్వయంగా బీమా చేసుకోవడం వల్ల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు మినహా అన్ని వయస్సుల ప్రయాణికులు ఈ బీమా పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ టిక్కెట్లు తీసుకొనే వాళ్లకు ఇది వర్తిస్తుంది. కనీస టిక్కెట్ చార్జీలతో కానీ, గరిష్ట చార్జీలతో కానీ నిమిత్తం లేకుండా ఆన్లైన్లోనే టిక్కెట్ బుక్ చేసుకొన్న వెంటనే 'ఇన్సూరెన్స్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రయాణికులు తమ ఖాతాలోంచి 92 పైసలు సదరు బీమా సంస్థ ఖాతాలోకి బదిలీ చేయాలి. వెంటనే ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. బీమా వివరాలు ఈ మెయిల్‌కు చేరుతాయి. ఇన్స్యూరెన్స్ ఎంపిక సమయంలో ఒక టిక్కెట్ పీఎన్ఆర్ నెంబర్‌పైన ఎంత మంది ప్రయాణికులు ఉంటే అంతమందికి బీమా ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తాన్ని చెల్లించవలసి వస్తే ఎవరికి అందజేయాలో తెలిపే నామిని వివరాలను కూడా నమోదు చేయాలి. ప్రమాదం జరిగిన 4 నెలలోపు బీమా సొమ్మును రాబట్టుకోవాలి. 15 రోజుల్లోపు ఈ ప్రక్రియ ముగిస్తారు. ప్రమాదం జరిగిన నాలుగు నెలలు దాటిన తరువాత వెళితే సదరు బీమా పథకం వర్తించదు. దక్షిణమధ్య రైల్వేలో ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తారు. వీరిలో 40 శాతానికి పైగా ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్లు నమోదు చేసుకుంటారు. ఈ ఆన్లైన్ ప్రయాణికులు 'ఇన్సూరెన్స్' ప్రీమియం చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 17 బీమా కంపెనీలో ఈ పథకం కోసం పోటీ పడగా 3 కంపెనీలకు మాత్రమే అవకాశం లభించింది. శ్రీరాం జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం, ఐసీఐసీఐ లాంబార్డ్ కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఐఆర్సీటీసీకి అనుసంధానమై ఉన్నాయి. ------------------------ ఆధారాలు తప్పనిసరి... రైలు పట్టాలు తప్పడం, బోగీలకు నిప్పంటుకోవడం, ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వంటి దుర్ఘటనలు ఏవైనా కావచ్చు. ప్రయాణికులు ఏ ప్రమాదం వల్ల గాయపడ్డారో, చనిపోయారో తెలిపే ఆధారాలను బీమా క్లెయిమ్ చేసుకొనే సమయంలో అందజేయాలి. సంఘటన వివరాలను తెలియజేసే ఎలాంటి ఆధారాలనైనా పరిగణనలోకి తీసుకొని బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షలు లభిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు చెల్లిస్తారు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరితే రూ.2 లక్షలు లభిస్తుంది. బీమా మొత్తంతో పాటు, రవాణా ఖర్చుల కోసం రూ.10 వేల వరకు చెల్లిస్తారు. ప్రమాద ఘటనల్లో రైల్వేశాఖ చెల్లించే పరిహారానికి, బీమాకు ఎలాంటి సంబంధం ఉండదు.