సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల తర్వాత తిరిగి మొదలైన ఐఆర్‌సీటీసీ సర్వీస్ చార్జీలతో ప్రయాణికులు ఆన్‌లైన్ బుకింగ్స్‌పై వెనకడుగు వేస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం సర్వీస్ చార్జీలను తొలగించడంతో ఆన్‌లైన్ బుకింగ్స్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని వర్గాల ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రధాన బుకింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రయాణికులు ఏజెంట్‌లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా సొంతంగా టికెట్లను బుక్ చేసుకున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు రైల్వే చేపట్టిన డిజిటలైజేషన్‌కు సైతం ఊతమిచ్చింది. కానీ ఇటీవల మళ్లీ సర్వీస్ చార్జీలను అమల్లోకి తేవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఆన్‌లైన్‌లోనే 65శాతం...
దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు రిజర్వేషన్‌లపై రాకపోకలు సాగిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్‌ల నుంచి ప్రతిరోజు సుమారు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య నడుస్తాయి. ఏసీ, స్లీపర్ కోచ్‌లకు ఉన్న డిమాండ్ మేరకు సాధారణంగా ప్రయాణికులు 3 నెలల ముందే బుక్ చేసుకుంటారు. పండగలు, వరుస సెలవుల లాంటి ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్‌లకు డిమాండ్ మరింత పెరుగుతుంది. నగరంలోని అన్ని ప్రధాన స్టేషన్‌లు, ఎంఎంటీఎస్ స్టేషన్‌లతో పాటు వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
కానీ డిమాండ్‌కు తగిన కౌంటర్లు లేకపోవడం, సిబ్బంది కొరత, పని గంటలు తదితర సమస్యల దృష్ట్యా ప్రయాణికులు ఆన్‌లైన్ బుకింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు విక్రయించే రిజర్వేషన్ టికెట్‌లలో 65శాతం ఆన్‌లైన్ ద్వారానే బుక్ కావడం గమనార్హం. కేవలం 35శాతం టికెట్‌లు కౌంటర్‌ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రయాణికులు ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుంటే చాలు... క్షణాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏజెంట్‌లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం అంతకన్నా లేదు.
తాజాగా 10శాతం తగ్గుదల...
రెండేళ్ల క్రితం తొలగించిన సర్వీస్ చార్జీలను తిరిగి విధించడంతో ప్రయాణికులు ప్రస్తుతం ఒక్కో స్లీపర్ టికెట్ బుకింగ్‌కు రూ.18, ఒక్కో ఏసీ టికెట్ బుకింగ్ కోసం రూ.40 చెల్లించాల్సి వస్తోంది. మొదటి నుంచి ఆన్‌లైన్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తిరిగి అమల్లోకి వచ్చిన భారాన్ని యథావిధిగా భరిస్తున్నప్పటికీ.. ఈ రెండేళ్లలో కొత్తగా ఆన్‌లైన్ పరిధిలోకి వచ్చినవాళ్లు మాత్రం కౌంటర్‌ల వైపు మళ్లుతున్నారు. ఇటీవల కాలంలో సుమారు 10 శాతం మంది ప్రయాణికులు ఆన్‌లైన్ బుకింగ్‌ల నుంచి కౌంటర్ బుకింగ్‌లకు మళ్లినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సాధారణంగా రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8వరకు పని చేస్తాయి. ఆదివారం మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే ఉంటాయి. కానీ చాలా చోట్ల సిబ్బంది కొరత కారణంగా ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా కౌంటర్లు పని చేయడం లేదు. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 12:15 వరకు అంటే 30 నిమిషాలు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉండదు. మిగతా అన్ని సమయాల్లోనూ ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉన్న ఆన్‌లైన్ బుకింగ్‌లపై తాజాగా విధించిన సర్వీస్ చార్జీలను శాశ్వతంగా తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment