జైపూర్: సర్వీస్ టాక్స్ పేరుతో ఐఆర్‌సీటీసీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది. తన నుంచి రూ.35 అదనంగా వసూలు చేయటంపై రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో 9 లక్షల మంది ప్రయాణికుల నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగానే ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జీల రూపంలో వసూలు చేసినట్లు తేలింది.
వివరాల్లోకి వెళ్తే... ఏప్రిల్, 2017లో కోటాకు చెందిన సుజిత్ స్వామి అనే ఇంజనీర్ కోటా నుంచి న్యూఢిల్లీ వరకు టికెట్ బుక్ చేసుకున్నాడు. జూలై 2న అతను ప్రయాణించాల్సి ఉంది. అయితే టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటంతో ఆ యువకుడు తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో టికెట్ డబ్బులు రిఫండ్ అయ్యాయి. మొత్తం రూ. 765 టికెట్ ధరకుగానూ రూ.665 అతనికి వెనక్కి వచ్చింది. లెక్క ప్రకారం చూసుకుంటే అతనికి రూ.65 మాత్రమే ఛార్జీ చేయాల్సి ఉంది. కానీ, అదనంగా రూ. 35 వసూలు చేయటంతో అతను న్యాయ పోరాటానికి దిగాడు.
ఆర్టీఐ వివరణ ప్రకారం... అదనపు ఛార్జీల వ్యవహారంపై సుజిత్ తొలుత ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశాడు. మిగతా సొమ్మును త్వరలోనే రిఫండ్ చేస్తామని ఐఆర్‌సీటీసీ అతనికి బదులిచ్చింది. కానీ, అది జరగలేదు. దీంతో ఆర్టీఐ కింద వివరణ కోరగా.. దానికి ఐఆర్‌సీటీసీ ఇచ్చిన వివరణను అతను మీడియాకు చూపించాడు. ‘రైల్వే కమర్షియల్ సర్క్ఘులర్ 43’ ప్రకారం.. జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. జీఎస్టీ అమలు(జూలై 1వ తేదీ తర్వాత)లోకి వచ్చాక టికెట్ రద్దు చేసుకుంటే వారికి కూడా సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ లెక్కన సుజిత్‌కు రిఫండ్ చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే సుజిత్ నుంచి రూ.100(రూ.65 క్లరికల్ ఛార్జ్+సర్వీస్ టాక్స్ రూ.35) వసూలు చేయటం జరిగింది అని తెలిపింది.
అంతేకాదు ఆర్టీఐ కింద స్వామి దాఖలు చేసిన మరో లేఖలో ఆశ్చర్యానికి గురిచేసే విషయం వెలుగు చూసింది. మొత్తం 9 లక్షల ప్రయాణికుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేశారు. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 11 రోజుల మధ్య ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకుని.. ఆపై రద్దు చేసుకున్న వారికి ఇలాగే ఛార్జీల పేరుతో కోతలు విధించారు. ఆ సొమ్ము మొత్తం రూ.3.34 కోట్లుగా తేలింది. చాలా మంది ప్రయాణికులు ఈ విషయం తెలీకపోగా.. మరికొందరు తెలిసినా కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆర్టీఐ వివరణలో ఉందని స్వామి చెబుతున్నాడు.
ఈ వ్యవహారంపై లోక్‌అదాలత్‌లో సుజిత్ స్వామి పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో అదాలత్.. రైల్వే బోర్డు చైర్మన్‌కి, పశ్చిమ మధ్య రైల్వే జీఎంకి, ఐఆర్‌సీటీసీ జీఎంకీ, కోటా డివిజినల్ రైల్వే మేనేజర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment