చేతిలో స్టీరింగ్‌..చెవిలో సెల్‌ఫోన్‌ | Mancherial Depot RTC Officials Negligence | Sakshi
Sakshi News home page

చేతిలో స్టీరింగ్‌..చెవిలో సెల్‌ఫోన్‌

Published Fri, Apr 26 2019 6:06 PM | Last Updated on Fri, Apr 26 2019 8:04 PM

Mancherial Depot RTC Officials Negligence - Sakshi

సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్న డ్రైవర్‌ 

మంచిర్యాలఅర్బన్‌: అనుకోని ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరు.. కానీ నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకునే ప్రమాదాలను నివారించే అవకాశాలున్నాయి. అయితే ఆర్టీసీ అధికారుల తీరుతో ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లు అవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌ సంభాషిస్తున్న ఘటనలు కూడా ఓ కారణమే. ఇటీవలనే ఆర్టీసీ జాతీయ రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించి నిబంధనలు గుర్తుచేశారు. అయితే సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ను నియంత్రించిన ఆర్టీసీ అధికారులే నిబంధనలు అతిక్రమించటం ఆర్టీసీలో చెల్లుబాటు అవుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజమే. మంచిర్యాల డిపోలో కొంతకాలంగా డ్రైవింగ్‌లో ఉన్నా.. ఖాళీగా ఉన్నా విధుల్లోకి చేరాడంటే సెల్‌ఫోన్‌ లేనిదే డ్రైవర్లు డ్యూటీ చేయలేని విచిత్ర పరిస్థితిపై ‘సాక్షి’ కథనం.

జిల్లాలో ఏకైక డిపో మంచిర్యాలలో మొత్తం 560 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 263 మంది ఉండాల్సిన డ్రైవర్ల స్థానంలో 201 మందితోనే నెట్టుకువస్తున్నారు. కొత్తగా నియామకాలు లేకపోవటం.. సిక్‌లో ఉండటం ఖాళీలు భర్తీకాక ఉన్న డ్రైవర్‌లపైనే పనిభారం పడుతోంది. చేతిలో స్టీరింగ్‌ ఉన్నా ఫోన్‌ సంభాషణ చేయాల్సిందే. లేదంటే ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే డ్రైవర్‌లపై చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ బస్సుల్లోనే...
దూరప్రాంతమైన హైదరాబాద్‌కు నడిచే బస్సుల్లోనే డ్రైవర్లు ఫోన్‌ వినియోగిస్తారు. బస్సు ఎక్కింది మొదలు సీట్లు నిండే వరకు ప్రయాణికుల ఫోన్‌లతో సతమతమవుతున్నారు. ఉదా..కాసిపేట్‌ మండలం దేవాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు బస్సు వెళ్లాలంటే మంచిర్యాల డిపో నుంచి వెళ్లేముందు డ్రైవర్‌ రిపోర్టు చేసే సమయం 7.30 గంటలు ఉంటుంది. బస్సు ప్లాట్‌ఫారంపై 8 గంటలకు నిలిపి అక్కడి నుంచి 9 గంటలకు దేవాపూర్‌కు చేరుకుంటుంది. 9.30 గంటలకు బయలుదేరి మంచిర్యాల బస్‌స్టేషన్‌కు వచ్చి హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంటుంది. అయితే దేవాపూర్‌కు వెళ్లి వచ్చేంత వరకు డ్రైవర్‌కు ఫోన్లు వస్తూనే ఉంటాయి. మంచిర్యాలలో రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుడు డ్రైవర్‌కు ఫోన్‌ చేసి బస్సు ఎక్కడ ఉంది.. ఎంతసేపటికి వస్తారు.. పలు ప్రశ్నలతో విసిగిస్తుంటారు. ఫోన్‌లో మాట్లాడిన తప్పే.. మాట్లాడకపోయిన తప్పే అనే మాదిరిగా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కరీంనగర్‌లో వేబిల్లులో కంట్రోలర్‌ నంబర్‌ ముద్రణ 

ఎందుకిలా? 
మంచిర్యాల డిపోలో విధులు నిర్వహించే డ్రైవర్‌ల సెల్‌ఫోన్‌ నంబర్లు ప్రయాణికులకు ఎలా చేరుతున్నాయనే అనే అంశాలపై ‘సాక్షి’ ఆరా తీస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్‌ పొందినప్పుడు టిక్కెట్‌పై.. ప్రయాణికుడికి వచ్చే మెసెజ్‌ (సందేశం)లో బస్సుపై విధులు నిర్వహించే డ్రైవర్‌ ఫోన్‌నంబర్‌ ముద్రిస్తారన్నమాట. ఇది అధికారుల సూచనలతోనే ప్రయాణికుడికి సులువుగా బస్సు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఫోన్‌నంబర్లు ముద్రిస్తారు. బస్సుల్లో ఉన్న ప్రయాణికుడు ఒక్కోసారి కాకుండా పలుమార్లు చేయడటంతో చేతిలో స్టీరింగ్‌ ఉన్నా తప్పని సరిగా ఫోన్‌లో మాట్లాడాల్సిన పరిస్థితులున్నాయి. ఇక్కడ మాత్రం కంట్రోలర్‌ది కాకుండా డ్రైవర్‌ల ఫోన్‌ నెంబర్‌ ఇవ్వటంపై కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా బస్సుస్టేషన్‌ కంట్రోలర్‌ నెంబర్‌ ఇస్తే ప్రమాదాల నివారణతోపాటు డ్రైవర్‌కు ఇక్కట్లు తొలగిపోతాయి. 

 డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతుంది 
ఎక్కడ లేని విధంగా మంచిర్యాల డిపోలో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్‌పై డ్రైవర్ల నంబర్లు ముద్రిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కంట్రోలర్‌ నంబర్, ఇతర అధికారుల ఫోన్‌నంబర్లు ఇస్తే బాగుంటుంది. కానీ నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులే ఉల్లంఘించడం సరికాదు. కరీంనగర్‌ డిపోలో అక్కడ టికెట్‌లపై ఇచ్చే ఫోన్‌నంబర్‌ డ్రైవర్‌ది కాకుండా కంట్రోలర్‌ది ఇస్తారు..దీంతో ఏ సమాచారమైన కంట్రోలర్‌ తెలుసుకుని ప్రయాణికుడికి అందిస్తారు.– వీబీరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రీజినల్‌ కార్యదర్శి 

విచారించి చర్యలు చేపడుతాం 
ఆర్టీసీలో నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్‌లపై ఫోన్‌నంబర్లు ముద్రిస్తుంటారు. ఇతర ప్రాంతాల్లో పరిశీలన చేసి అక్కడ ఏవిధంగా ఉంటే మంచిర్యాలలో కూడా అలాగే నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు చేపడతాం.– శ్రీనివాస్, ఆర్టీసీ డీవీఎం, మంచిర్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement