రైలు టికెట్‌తోపాటే బీమా.. అనూహ్య స్పందన
హైదరాబాద్ : రైలు ప్రయాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా.. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే టిక్కెట్‌తో పాటే ప్రయాణ బీమాను సైతం నమోదు చేసుకోవడం మరచిపోవద్దు. రైల్వేశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బీమా సదుపాయం వల్ల ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. కేవలం 92 పైసల ప్రీమియం చెల్లింపుతో ఈ బీమా సదుపాయాన్ని పొందవచ్చు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు గత నెలలో ప్రమాద బీమా గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకొనే సమయంలో టికెట్ రిజర్వేషన్ బుక్ అయిన వెంటనే 92 పైసల ప్రీమియం చెల్లిస్తే చాలు. రైల్వేశాఖ అమల్లోకి తెచ్చిన బీమా పరిధిలో చేరిపోతారు. ట్రైన్ ఎక్కే సమయం నుంచి గమ్యస్థానానికి చేరుకొని ట్రైన్ దిగే వరకు బీమా వర్తిస్తుంది. ఒక టిక్కెట్ పై ఎంతమంది ప్రయాణికులు బుక్ అయితే అంతమందికి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. గత 15 రోజుల్లో 5.75 లక్షల మంది ప్రయాణికులు ఈ పథకాన్ని నమోదు చేసుకోవడం గమనార్హం.
లక్షలాది మందికి ప్రయోజనం...
తరచుగా ఎక్కడో ఒక చోట రైలుప్రమాదాలు, బోగీల దహనం, రైలెక్కబోతూ..దిగబోతూ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. ప్రమాద దుర్ఘటనల్లో రైల్వేశాఖ స్వతహాగా పరిహారం చెల్లిస్తున్నప్పటికీ ప్రయాణికులు సైతం స్వయంగా బీమా చేసుకోవడం వల్ల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు మినహా అన్ని వయస్సుల ప్రయాణికులు ఈ బీమా పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ టిక్కెట్‌లు తీసుకొనే వాళ్లకు ఇది వర్తిస్తుంది. కనీస టిక్కెట్ చార్జీలతో కానీ, గరిష్ట చార్జీలతో కానీ నిమిత్తం లేకుండా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్ బుక్ చేసుకొన్న వెంటనే 'ఇన్సూరెన్స్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
ప్రయాణికులు తమ ఖాతాలోంచి 92 పైసలు సదరు బీమా సంస్థ ఖాతాలోకి బదిలీ చేయాలి. వెంటనే ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. బీమా వివరాలు ఈ మెయిల్‌కు చేరుతాయి. ఇన్స్యూరెన్స్ ఎంపిక సమయంలో ఒక టిక్కెట్ పీఎన్‌ఆర్ నెంబర్‌పైన ఎంత మంది ప్రయాణికులు ఉంటే అంతమందికి బీమా ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తాన్ని చెల్లించవలసి వస్తే ఎవరికి అందజేయాలో తెలిపే నామిని వివరాలను కూడా నమోదు చేయాలి. ప్రమాదం జరిగిన 4 నెలలోపు బీమా సొమ్మును రాబట్టుకోవాలి. 15 రోజుల్లోపు ఈ ప్రక్రియ ముగిస్తారు.
ప్రమాదం జరిగిన నాలుగు నెలలు దాటిన తరువాత వెళితే సదరు బీమా పథకం వర్తించదు. దక్షిణమధ్య రైల్వేలో ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తారు. వీరిలో 40 శాతానికి పైగా ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్‌లు నమోదు చేసుకుంటారు. ఈ ఆన్‌లైన్ ప్రయాణికులు 'ఇన్సూరెన్స్' ప్రీమియం చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 17 బీమా కంపెనీలో ఈ పథకం కోసం పోటీ పడగా 3 కంపెనీలకు మాత్రమే అవకాశం లభించింది. శ్రీరాం జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం, ఐసీఐసీఐ లాంబార్డ్ కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఐఆర్‌సీటీసీకి అనుసంధానమై ఉన్నాయి.
------------------------
ఆధారాలు తప్పనిసరి...
రైలు పట్టాలు తప్పడం, బోగీలకు నిప్పంటుకోవడం, ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వంటి దుర్ఘటనలు ఏవైనా కావచ్చు. ప్రయాణికులు ఏ ప్రమాదం వల్ల గాయపడ్డారో, చనిపోయారో తెలిపే ఆధారాలను బీమా క్లెయిమ్ చేసుకొనే సమయంలో అందజేయాలి. సంఘటన వివరాలను తెలియజేసే ఎలాంటి ఆధారాలనైనా పరిగణనలోకి తీసుకొని బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.
ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షలు లభిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు చెల్లిస్తారు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరితే రూ.2 లక్షలు లభిస్తుంది. బీమా మొత్తంతో పాటు, రవాణా ఖర్చుల కోసం రూ.10 వేల వరకు చెల్లిస్తారు. ప్రమాద ఘటనల్లో రైల్వేశాఖ చెల్లించే పరిహారానికి, బీమాకు ఎలాంటి సంబంధం ఉండదు.