నిజశ్రావణం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో పాటే శుభముహూర్తాలు మొదలుకానున్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో అధిక మాసంగా శ్రావణం వచ్చింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈ నెల 17వ తేదీ గురువారం నుంచి మొదలయ్యే నిజ శ్రావణ మాసం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది.
శుభకార్యాలకు వేళాయె..
శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. కాగా, శ్రావణ మాసంలో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ముహూర్తాలు ఉండగా, ఆ తర్వాత సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 14 వరకు కొనసాగే భాద్రపదంలో ఎలాంటి ముహూర్తాలు లేవు. దీంతో ఈ నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
శుభకార్యాల కాలం
నిజ శ్రావణ మాసం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. భాద్రపదం, పుష్యమాసాల్లో మినహా మిగిలిన మాసాల్లో శుభ ముహూర్తాలు బాగానే ఉన్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఇప్పటికే చాలామంది ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment