మహిమాన్వితం.. ఉరుకుంద క్షేత్రం
మహిమాన్వితం.. ఉరుకుంద క్షేత్రం
Published Tue, Aug 2 2016 12:30 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
– 3 నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
– ఉత్సవాలకు ముస్తాబైన నారసింహుడు
– ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న (నరసింహ) స్వామి క్షేత్రం భక్త జనుల పుణ్యధామంగా వెలుగొందుతోంది. మహిమాన్వితుడైన ఈరన్న స్వామిని మనసా, వాచా కొలిస్తే శుభం జరుగుతుందనే నమ్మకం ఉంది. స్వామి పాదాలు తాకితే సర్వపాపాలు తొలగి ముక్తిమార్గం సంప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఈనెల 3వ తేదీ బుధవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ గురువారం వరకు జరుగుతాయి. ఉత్సవాల్లో సోమవారం, గురువారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ సారి ఐదు గురువారాలు, నాలుగు సోమవారాలు వచ్చాయి. మూడో∙సోమవారం ఒక్కరోజే లక్షల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని అంచనా. నాలుగవ సోమవారం 29వ తేదీ స్వామి వారి పల్లకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు ఈ ప్రాంతం ప్రజలు మద్యపానానికి మాంసాహారానికి దూరంగా ఉంటారు.
నిరాకారుడు..
కౌతాళం మండల కేంద్రానికి 6కి.మీ. దూరంలోని ఉరుకుంద గ్రామంలో ఈరన్న (నరసింహ) స్వామి వెలిశారు. స్వామికి నిర్దిష్టమైన ఆకారం అంటూ లేదు. ఒక సిద్ద పురషుడని, వీరభద్ర అంశంతో భూలోకానికి వచ్చిన దేవదూతగా పెద్దలు చెబుతారు. దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం ఆయన ఉరుకుంద గ్రామాన్ని కేంద్రంగా చేసుకోని మానవజాతిని ఉద్ధరించేవాడని కథలు ప్రచారంలో ఉన్నాయి. నిరాకారుడైన స్వామి అశ్వర్థ వక్ష స్వరూపుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఆలయంలో పెద్దమర్రి చెట్టు ఉంది. చెట్టు చుట్టూ కట్టను నిర్మించారు. ప్రస్తుతం భక్తులు కట్టకే పూజలు చేస్తున్నారు. స్వామి ఇప్పటì కి రాత్రివేళ్లల్లో సర్ప రూపంలో సంచరిస్తుంటాడని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామిపై భక్తితో ఈరన్న, ఈరమ్మ, నాగరాజు, నాగమ్మ, వీరేష్, వీరన్న ఇలా పేర్లు పెట్టుకుంటున్నారు. పిల్లలకు స్వామి పేర్లు పెట్టడం వల్ల ఇంటికి అంతా శుభం జరుగుతోందని భక్తులు భావిస్తున్నారు.
నిత్యాన్నదానం
ఆలయం వద్ద నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతోంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక భవనాన్ని విశాలమైన ప్రదేÔ¶ ంలో నిర్మించారు. అన్నదానానికి భక్తులు ఇచ్చిన విరాళాలు సుమారు రూ.3కోట్లకు పైగా ఉన్నట్లు ఆలయన చైర్మన్ చెన్న బసప్ప, ఈవో మల్లికార్జున ప్రసాద్‌లు తెలిపారు.
దర్శనీయ స్థలాలు
ఆలయం వెనుక ఉన్న ఆంజనేయ స్వామి, నాగుల స్వామి, బసవన్న కట్టను దర్శించుకోవడం అనవాయితీ. ఉరుకుందకు సుమారు 35 కి,మీ. దూరంలో మంత్రాలయం మఠం ఉంది. ఉరుకుందకు మూడు కి,మీ. దూరంలో బుడుములదొడ్డి ఆంజినేయ స్వామి ఉంది. కౌతాళం–సుళేకేరి రోడ్డులో ఉన్న ఈఆలయం అత్యంత పురాతనమైనది. ఉరుకుందకు 21 కి,మీ. దూరంలో మేళిగనూరు వద్ద రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది.
నీటి సదుపాయం
ఆలయం సమీపంలోనే తుంగభద్ర దిగువకాలువ ప్రవహిస్తుంది. దీంతో భక్తులకు నీటి సమస్య ఉండదు. ఈ ఏడాది దేవాలయ అధికారులు.. ఆదోని, కోసిగి రోడ్లలో అలాగే బావి వద్ద బోర్లు వేసి షవర్లు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. దేవాలయం వద్ద నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసి మినరల్ వాటర్‌ను సరఫరా చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
వసతి సదుపాయం
భక్తుల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో మల్లికార్జున ప్రసాద్, చైర్మన్ చెన్నబసప్పలు తెలిపారు. భక్తుల సహకారంతో నిర్మించిన 160 గదులు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు.
ప్రత్యేక బందోబస్తు
ఉత్సవాలు ముగిసే వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 50 మంది కానిస్టేబుళ్లు, 10మంది మహిళ పీసీలు, 40 మంది హోంగార్డులతో పాటు ఆదోనిఎన్‌సీసీ విద్యార్థుల సహకారంతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాట్లు కౌతాళం ఎస్‌ఐ నల్లప్ప తెలిపారు.
రవాణా సౌకర్యం
ఆదోని, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలతోపాటు కర్ణాటకలోని బళ్లారి, శిరుగుప్ప, రాయచూరు, సింధనూరు ఆర్టీసీ డిపోల నుంచి ఉరుకుందకు బస్సులు నడుపుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరుకు చేరుకుంటే అక్కడి నుంచి ఉరకుందకు వెళ్లేందుకు బస్సులు సిద్ధంగా ఉంటాయి.
Advertisement
Advertisement