శ్రావణం.. పండుగలమయం
- దేవతలకు ప్రీతికరం.. సిరిసంపదలకు ఆలవాలం
- అమ్మవార్ల అనుగ్రహానికి అనువైన కాలం
- ప్రతి రోజూ శుభప్రదమే
శ్రావణంలో ముఖ్య పండుగల తేదీలు
నాగుల పంచమి 7
మంగళ గౌరీ వ్రతం 9
వరలక్ష్మీవ్రతం 12
రక్షాబంధన్ 18
శ్రీ కృష్ణాష్టమి 25
జోగిపేట: మహాశక్తిదాయిని, సౌభాగ్య సంతాన ఫలాలనిచ్చే వరప్రదాయిని శ్రీ మహాలక్ష్మి మాత. గుమ్మం ముందు ముగ్గు.. పూజాపీఠం వద్ద దీపం.. పెరట్లో గోమహాలక్ష్మి.. తులసికోట.. గడపకు పసుపు.. నుదుటున కుంకుమతో కళకళలాడే ఇంతులున్న ఇంట ఆ అమ్మవారు కొలువై ఉంటారట. శ్రీమహావిష్ణువు హృదయవాసినిగా భాసిల్లే ఆ అమృత స్వరూపిణికి కొలువై ఉన్న ఇల్లు ఎల్లవేళలా సిరిసంపదలు సుమంగళీ భాగ్యంతో అలరారుతుంది. అంతటి కరుణామూర్తిని పూజించేందుకు.. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు అనువైన మాసం శ్రావణం. ఈ మాసం దేవికే కాదు..శివుడికి కూడా ప్రీతికరమైనదే. ఆధ్యాత్మిక మాసం శ్రావణంలో ప్రతి రోజు ప్రత్యేకమే...శుభప్రదమే.
ఒక్కోరోజు ఒక్కో దేవునికి పూజలు
పాడ్యమి బ్రహ్మదేవుడు
విదియ శ్రీయఃపతి
తదియ పార్వతీదేవి
చవితి వినాయకుడు
పంచమి శశి
షష్టి నాగదేవతలు
సప్తమి సూర్యుడు
అష్టమి దుర్గాదేవి
నవమి మాతృదేవతలు
దశమి ధర్మరాజు
ఏకాదశి మహర్షులు
ద్వాదశి శ్రీమహావిష్ణువు
త్రయోదశి అనంగుడు
చతుర్దశి పరమశివుడు
పూర్ణిమ పితృదేవతలు
పండగల మాసమే...
శ్రావణమాసం వ్రతాలు, పూజలు, ఉపవాసాలతో పాటు ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంటుంది. మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా చెబుతారు.
నాగుల పంచమి
సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి (ఆగస్టు7)రోజు నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తారు.వెండితో నాగ ప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు. మహిళలు ఉపవాసం ఉండి పుట్టలో పాలుపోస్తారు.
మంగళగౌరీ వ్రతం
శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం చేస్తారు.(ఆగస్టు9)అన్యోన్య దాంపత్యం, సంతానం, కలగాలని వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహంన జరిగిన మొదటి ఐదేళ్లూ ఈ మాసంలో ప్రతి మంగళవారం చేపడతారు.
వరలక్ష్మీ వ్రతం
మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు12)రోజున వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుతూ ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు.
రాఖీపూర్ణిమ
సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్లు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ రోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. సోదర, సోదరీమణుల బంధానికి ప్రతీకంగా నిలచిన రక్షాబంధన్(ఆగస్టు18)ను జరుపుకుంటారు.
శ్రీకృష్ణాష్టమి
శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం. శ్రావణ బహుళ అష్టమి రోజున (ఆగస్టు 25) న శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కృష్ణుడిని ఊయలలో వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు.