
నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రముఖ నటనా శిక్షణ సంస్థ "నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా" హైదరాబాద్‌లో మొదటిసారిగా ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, నటుడు అనీష్ కురువిల్ల, డైరెక్టర్లు వినయ్ వర్మ, వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా, భోపాల్, కేరళ ప్రాంతాలతో పాటు నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొంటున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికగా ఈ నాటక ఉత్సవం నిలవనుంది. కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు.