బాదుడు భయం!
- 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
- క్రయవిక్రయాలకు జనం పరుగులు
- కిటకిటలాడుతున్న రిజిస్ట్రార్ ఆఫీసులు
- ప్రభుత్వానికి దండిగా ఆదాయం
తీసినా వేసినా బాధించేవి పన్నులని ఏ ‘పన్’డితుడు చెప్పాడో కానీ.. జనం ఈ రెండు రకాల ఈతి బాధలతో సత మతమైపోతున్నారు. నిజానికి పన్ను వేసినప్పటి బాధతో పోలిస్తే, తీసినప్పటి బాధ లెక్కలోకి రాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.. అందుకే ఇప్పుడు అంతా రిజిస్ట్రార్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో అంతా ముందే క్రయవిక్రయాలు పూర్తి చేసే హడావుడిలో ఉన్నారు. ఏదైతేనేం ఆ విధంగా కూడా ప్రభుత్వానికి దండిగా రాబడి సమకూరుస్తున్నారు.
మధురవాడ/ఆనందపురం/పెందుర్తి/భీమిలి : రద్దీ.. రద్దీ.. ఒకటే రద్దీ.. భూముల క్రయవిక్రయాలు రిజిస్టర్ చేసే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారుల రద్దీ భారీ ఎత్తున ఉంది. భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు అనివార్యమని తెలియడంతో ఈ రద్దీ గత రెండు మూడు రోజుల్లో బాగా పెరిగింది. ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం చార్జీల బాదుడుకు సిద్ధం కావడంతో క్రయవిక్రయాల జోరు పెరిగింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రోజుల వ్యవధిలోనే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. మరోవైపు శ్రావణమాసం కూడా కలిసి రావడంతో ఈ హడావుడి మరింత పెరిగింది. దీంతో బుధవారం మధురవాడ, ఆనందపురం, పెందుర్తి, భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జనం సందడి బాగా కనిపించింది. కక్షిదారులతో ప్రతి కార్యాలయం కిటకిటలాడింది. నగరంలోని టర్నర్ చౌల్ట్రీ వద్దనున్న కార్యాలయంలోనూ ఇదే వాతావరణం కనిపించింది.
రోజంతా హడావుడే
పెందుర్తి విషయానికే వస్తే.. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. గత నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గింది. రోజుకు పది లక్షలు కూడా వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు ప్రతిపాదనతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వచ్చే నెల ఒకటి నుంచి ఇప్పుడున్న చార్జీల కంటే 15 నుంచి 30 శాతం అదనంగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో అంతా తొందరపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పెందుర్తి రిజిస్ట్రార్ కార్యాలయం క్రయవిక్రయదారులతో కిటకిటలాడింది. ఒక్కరోజునే దాదాపు వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అంచనా.
రూ.కోట్లలో ఆదాయం..
వాస్తవానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకుంది. అయితే మంగళవారం సెలవుదినం కావడంతో బుధవారం జోరందుకుంది. ఈ రెండు రోజులు కలిపి పెందుర్తిలోనే దాదాపు కోటిన్నర పైగా ఆదాయం వచ్చినట్లు అధికారవర్గాలు అంటున్నాయి. రానున్న రెండు రోజులు గురు,శుక్రవారాలు కావడంతో ఈ ఆదాయం మూడు నాలుగురెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
భీమిలిలో సందడి
భీమునిపట్నం: రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగున్న నేపద్యంలో భీమిలి సబ్‌రిజిస్రార్ కార్యాలయం వద్ద బుధవారం సందడి నెలకొంది. భూములు కొనుగోలు చేసేవారు, విక్రయించేవారు పెద్ద సంఖ్యలో రావడంతో ఇక్కడ వాతావరణం హడావుడిగా మారింది. సోమవారం 83 రిజిస్ట్రేషన్లు జరగగా రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింతగా పెరిగే సూచనలున్నాయి.