![Sakshi Editorial Sravana Masam Clouds Significance](/styles/webp/s3/article_images/2022/07/24/clouds.jpg.webp?itok=zyGZgvpC)
శ్రావణమాసం కొద్దిరోజుల్లోనే రానుంది. ఇది ప్రకృతి మేఘమల్హరాలాపనతో పరవశించే మాసం. శ్రావణమాసానికి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకొంటారు. వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకొనే మహిళలు పట్టుచీరలతోను, నగలతోను కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందుకే శ్రావణమాసాన్ని ‘నగల మాసం, శనగల మాసం’ అంటూ చమత్కరించారు ముళ్లపూడి వెంకటరమణ. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే, శ్రావణమాసంలో కనిపించే కారుమబ్బులు, అవి కురిపించే కుండపోత వర్షాలు ప్రకృతి గమనంలోని సహజ పరిణామాలు. మేఘసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు’ అంటూ కారుమబ్బుల అందాలను కళ్లముందు నిలిపారు కృష్ణశాస్త్రి.
మేఘాల గురించి ‘గాథా సప్తశతి’లో ఒక అరుదైన, అపురూపమైన వర్ణన ఉంది. ‘అవిరల పడంత నవజల ధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ/ అపహుత్తో ఉఖేతుం రస ఇవ మేహో మహింవు అహ’. అంటే, వర్షధారల దారాలతో భూమిని బంధించి పైకి లాగేయడానికి మేఘం విఫలయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మేఘం ఎంతో కష్టపడుతోంది. అందుకు నిదర్శనం– అది చేస్తున్న ఉరుముల హూంకారాలే! ఇంతటి కవి చమత్కారం మరే భాషా సాహిత్యంలోనూ కనిపించదు.
మబ్బులు కమ్ముకున్నాక, అవి ఉరుములు ఉరమడం, మెరుపులు మెరవడం, చినుకులు కురవడం సహజమే! అలాగని ప్రతి మబ్బూ వాన కురుస్తుందనే భరోసా ఏమీ లేదు. మబ్బుల్లో నాలుగు రకాలు ఉంటాయని, అలాగే మనుషుల్లోనూ నాలుగు రకాలు ఉంటారని బుద్ధుడు తన శిష్యులకు ఎరుకపరచాడట! ఉరుములు ఉరిమినా చినుకు కురవకుండానే వెళ్లిపోయేవి ఒకరకం, ఉరుములు మెరుపులు లేకపోయినా చినుకులు కురిసిపోయేవి మరోరకం, ఉరుములు మెరుపుల సందడితో వాన హోరెత్తించేవి ఒకరకం, ఉరుముల శబ్దం చేయకుండా, చినుకైనా కురవకుండా తేలిపోయేవి ఇంకోరకం. మేఘాల స్వభావం లాగానే మనుషుల స్వభావాలూ ఉంటాయి. ఊరకే నీతులు చెబుతూ ఆచరించని వాళ్లు ఒక రకం, శాస్త్రాలు చదువుకున్నా వాటి సారాన్ని గ్రహించని వాళ్లు ఇంకో రకం. శాస్త్రాలు చదవకున్నా, ధర్మసారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు ఒకరకం, శాస్త్రాలు చదివి, వాటి సారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు మరోరకం.
సాహిత్యంలోను, కళల్లోను మబ్బులు రకరకాల భావనలకు సంకేతాలుగా చలామణీలో ఉన్నాయి. దిగులుకు, దుఃఖభారానికి, అంతుచిక్కని రహస్యానికి, అనిశ్చితికి, ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా మబ్బులను పోల్చుతారు. అంతేకాదు, మబ్బులు క్షాళనకు కూడా సంకేతాలు. మబ్బులు కురిపించే వానలో నేల మీద ఉన్న చెత్తాచెదారం కొట్టుకుపోయినట్లే, దుఃఖ వర్షం తర్వాత గుండెలో గూడు కట్టుకున్న దిగులు కొట్టుకుపోయి మనసు తేటపడుతుందని కొందరి భావన. ‘భారమైన హృదయాలు దట్టమైన మబ్బుల్లాంటివి. వాటి నుంచి కాస్త నీటిని బయటకు పోనిస్తేనే మంచిది. అప్పుడే ఊరట చెందుతాయి’ అంటాడు అమెరికన్ రచయిత క్రిస్టఫర్ మోర్లే.
మేఘతతులు ఎరుకకు, పరివర్తనకు, కలలకు కూడా సంకేతాలు. అయితే, ఎక్కువగా మబ్బులను దిగులుకు, ప్రతికూలతలకు సంకేతంగానే భావిస్తారు. సాహిత్యంలోనూ ఇలాంటి వర్ణనలే కొంత ఎక్కువగా కనిపిస్తాయి. ‘భారమైన మేఘాలు నక్షత్రాలను ఆర్పేస్తున్నాయి’ అని తన ‘నైట్ ఫ్లైట్’ నవలలో వర్ణించాడు ఆంటోయిన్ డి సెయింట్ ఎక్సు్యపెరీ. పైలట్‌గా పనిచేసినప్పుడు నక్షత్రాలను మేఘాలు కమ్మేసిన దృశ్యాలను క్లోజప్‌లో చూసిన అనుభవం ఉన్నవాడాయన. దట్టంగా కమ్ముకున్న మబ్బులు పగలు సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి, నక్షత్రాలను కనపించనివ్వవు. అలాగని ఆకాశంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు అదృశ్యమైపోవు. తాత్కాలికంగా అలా అనిపిస్తాయంతే! మబ్బులు మటుమాయం కాగానే, మళ్లీ తమ సహజకాంతులతో కనిపిస్తాయి. గుండెలోని గుబులు, మనసులోని దిగులు కూడా అంతే! దిగులు మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన మనసులోని ఆశలు పూర్తిగా అడుగంటిపోవు. అందుకే, ‘మబ్బులకు ఆవల సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాడు’ అంటాడు అమెరికన్ రచయిత పాల్ ఎఫ్. డేవిస్.
ఉరిమే ప్రతి మబ్బూ కురవదని లోకోక్తి. వ్యర్థ ప్రసంగాలతో హోరెత్తించే వారికి ఇది చక్కగా వర్తిస్తుంది. ‘వాగ్దానం మబ్బు మాత్రమే, అది నెరవేరినప్పుడే వాన కురిసినట్లు’ అని ఇంగ్లిష్ సామెత. వాగ్దానకర్ణులైన రాజకీయ నాయకులకు ఇది అక్షరాలా సరిపోతుంది. ‘ఎంతటి రాగి గొలుసులతోనైనా మబ్బులను బంధించలేము’ అనే సామెత కూడా ఉంది. నింగిలోని మబ్బులు స్వైరవిహారం జరిపే స్వేచ్ఛాసంచారులు. వాటి మానాన అవి ముందుకు సాగుతూనే పోతాయి. ప్రపంచంలో వాటిని బంధించే శక్తి ఏదీ లేదు. ఎక్కడైనా, ఎవరైనా స్వాభావికమైన స్వేచ్ఛను బంధించబూనితే, దాని పర్యవసానం మేఘవిస్ఫోటం కూడా కావచ్చు! ఇటీవల శ్రావణ భార్గవి అనే గాయని అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుని పదాన్ని పాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అనవసర దుమారానికి దారితీసింది. కొందరి అభ్యంతరాల ధాటికి ఆమె వెనక్కు తగ్గి, ఆ వీడియోను తొలగించింది. ఈ దుమారం సద్దుమణిగినా ఇదంత మంచి సంకేతం కాదు. ప్రజాస్వామ్య ప్రభలను మూకస్వామ్య దౌర్జన్యపర్జన్యాలు కబళించడం వాంఛనీయం కాదు.
Comments
Please login to add a commentAdd a comment