సత్యానికి సవాల్‌! | Sakshi Editorial On Deep Fake Videos In General Election Campaign | Sakshi
Sakshi News home page

సత్యానికి సవాల్‌!

Published Thu, May 2 2024 12:11 AM | Last Updated on Thu, May 2 2024 12:36 AM

Sakshi Editorial On Deep Fake Videos In General Election Campaign

కంటికి కనిపిస్తున్నదంతా నిజమేనా? ఏది సత్యం? ఏదసత్యం? వేసవి తాపానికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారపు వేడి ఎక్కువై, నేతలు పరస్పరం మాటల ఈటెలు విసురుకుంటున్న వేళ... కృతిమ మేధ (ఏఐ) సాయంతో ఇష్టారాజ్యపు మార్పుచేర్పుల నకిలీ వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రచార మవుతున్నందున... ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. సాక్షాత్తూ కేంద్ర హోమ్‌మంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ప్రచారమవుతుంది. 

ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడినట్టు మరో వీడియో ప్రత్యక్షమవుతుంది. మరో ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ కాశీలోని గంగాతీరంలో తన పుణ్యక్షేత్ర దర్శనానుభూతిని పంచుకుంటే ఆ మాటలు మోదీ, బీజేపీలకు మద్దతు పలికినట్టుగా నకిలీ వీడియోలో మారిపోతాయి. ఇదీ వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోల వైచిత్రి. గడచిన 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు వాట్సప్‌ యూనివర్సిటీల్లో తప్పుడు సమాచారం వీరవిహారం చేస్తే, ఈసారి ఏఐ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకూ, ఓటర్లకూ సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. నాటి ఐటీ బాట్ల నుంచి నేటి ఏఐ డీప్‌ఫేక్‌ల దాకా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయింది.

తాజాగా ఈ నకిలీ వీడియోల సెగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ, హోమ్‌ మంత్రి అమిత్‌షాలు ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుకు నిదర్శనం. రిజర్వేషన్ల అంశంపై హోమ్‌ మంత్రి అనని మాటలను అన్నట్టుగా మార్చి చూపించిన ఫేక్‌ వీడియో ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారమైంది. సంచలనం రేపింది. తమతో సహా పలువురు బీజేపీ నేతల నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి, శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయ డానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఆరోపించారు. 

ఎన్నికల వేళ పెద్ద తల నొప్పిగా మారిన ఈ అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోను ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) ఖాతాలో షేర్‌ చేశారనే ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వడంపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తోంది. మరోపక్క ఈ వీడియో వ్యవహారంపై అసోమ్‌లో ఒకరితో పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మంత్రం ఆశించినంతగా ఫలించడం లేదనీ, ‘ఈసారి 400 సీట్ల పైనే’ (అబ్‌ కీ బార్‌ 400 పార్‌) అన్న బీజేపీ నినాదం మంచి కన్నా చెడు చేస్తోందనీ ఒక విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలు మరిన్ని వర్గాలను అధికార పార్టీకి దూరం చేసే ప్రమాదం లేకపోలేదు. అయితే, ఈ నకిలీ వీడియోల ముప్పు అధికార పార్టీకే కాదు... ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకూ ఉంది. 

ఇంకా చెప్పాలంటే, గడచిన 2019 ఎన్నికలు ‘సోషల్‌ మీడియా ఎన్నిక’లైతే, ఈ 2024 ఎన్నికలు ‘ఏఐ యుగపు ఎన్నికల’ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సగటు ఓటరుకు మునుపెన్నడూ లేనంతగా తప్పుడు సమాచారమందే ప్రమాదం ఈసారి పెరిగింది. చేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చిన స్మార్ట్‌ఫోన్‌లో వస్తున్నదంతా నిజమని నమ్మే ధోరణిని మార్చుకోక పోతే కష్టమే. వాట్సప్‌ సహా వివిధ మాధ్యమాల్లో షేర్‌ అవుతున్న వాటిలో ఏది అసలో, ఏది ఏఐతో మార్చిన నకిలీయో తెలుసుకోవడం తెలీక సామాన్యులు మోసపోయే ప్రమాదం మరీ ఎక్కువైంది.  

గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేకపోలేదు. కాకపోతే ఫలానా వర్గం ఎక్కువ మంది పిల్లల్ని కంటోంది, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను సైతం లాగేసుకుంటుంది లాంటి మాటలు ఈ తడవ మాత్రమే ఏలికల నోట విని పిస్తున్నాయి. సాంకేతికత వెర్రితలలు వేయడంతో ఈసారి మరింత చిక్కొచ్చి పడింది. మొత్తం మన రాజకీయ సమాచార ప్రసార, ప్రచారాలు శరవేగంతో మారిపోయాయి. 

2019 ఎన్నికల ముందు మన ‘జనగణమన’ను ప్రపంచ అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందనే మెసేజ్‌ వాట్సప్‌లో తెగ తిరిగితే... ఇప్పుడు జనరేటివ్‌ ఏఐ సాయంతో మోదీ పెదాల కదలికకు అచ్చు గుద్దినట్టు సరిపోయేలా మూడు భాషల్లో ఆయన ప్రసంగపు యూట్యూబ్‌ షార్ట్‌ వంతు వచ్చింది. జనాన్ని ఎలాగోలా బురిడీ కొట్టించి, బుట్టలో వేసుకోవాలనే తపన, తాపత్రయం గడచిన అయి దేళ్ళలో కొత్త పుంతలు తొక్కింది. నిజానికి, సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఫేక్‌ న్యూస్, ప్రాపగాండాలను అరికట్టడానికి కిందా మీదా పడుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ డీప్‌ఫేక్‌ను అడ్డుకొనేందుకు ప్రస్తుత చట్టాలను నవీకరించేందుకు భారత ప్రభుత్వమూ ప్రయత్నిస్తోంది. 

ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధిగా మారిన కాలంలో ప్రతి పార్టీ ఒక సోషల్‌ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తోంది. ఆన్‌లైన్‌ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా అందరూ అనుసరిస్తున్న రోజులొచ్చిపడ్డాయి. సమాచారాన్ని వైరల్‌ చేసే బాట్లకు ఇప్పుడు విశ్వామిత్ర సృష్టి జనరేటివ్‌ ఏఐ కూడా జతపడేసరికి అగ్నికి ఆజ్యం తోడైంది. ఉచితంగా, కాదంటే కారుచౌకగా ఏఐ సహా రకరకాల ఉపకరణాలు అందుబాటులోకి రావడం ఆకతాయిలకూ వరమైంది. 

ఓ డీప్‌ఫేక్‌ వీడియో సృష్టికి మూడేళ్ళ క్రితం పది రోజులు పడితే, ఇప్పుడు మూడు నిమి షాల్లో చేయగలుగుతున్నారు. ఇవన్నీ సత్యాన్వేషణలో నేటి సవాళ్ళు. ఎన్నికల్లో అనియంత్రిత ఏఐ వినియోగానికి తక్షణం అడ్డుకట్ట వేయకుంటే అనర్థం తప్పదు. నేతలు, జర్నలిస్టులు, నటీనటులు ప్రధాన లక్ష్యంగా సాగుతున్న విషం చిమ్ముడుకు విరుగుడు వెతకాలి. లేదంటే, వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. యావత్‌ సమాజం, ప్రజాస్వామ్యం నకిలీలతో నిండిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement