
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులకు డీప్ ఫేక్ వీడియోలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆ వాయిస్ క్లిప్ విపిస్తుంది. ఏఐ వాయిస్‌తో పాటు.. మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృష్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్‌ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The day is soon… on June 4… The Prime Minister will be Rahul Gandhi… pic.twitter.com/ymrLZC447q
— Aaron Mathew (@AaronMathewINC) April 25, 2024
ఒకవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. రాహుల్ గాంధీ ప్రమాణం చేసినట్లు ఆడియో క్లిప్ వైరల్ కావటంతో నెటిజన్లు తమ నేతకు మద్దతుగా కామెంట్లు పెడుతూ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు.
‘ఆ రోజు త్వరలోనే రానుంది.. అది జూన్ 4’, ‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఆడియో క్లిప్.. ఏఐ వాయిస్ క్లోన్ అని కొన్ని డిటెక్షన్ టూల్స్ నిర్ధారణ చేశాయి. ఆడియో, వీడియో రెండు వేరుగా చేసి.. ఫ్యాక్ట్ చేయగా ఈ క్లిప్ ఏఐ జనరేటెడ్‌గా తేలిందని పేర్కొంటున్నాయి. ఇది ఫేక్ ఆడియో క్లిప్ అని తేల్చాయి. ఇక.. ఇటీవల ఇదే తరహాలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఏఐ వాయిస్ క్లోన్ క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడినట్టు ఉంది.