పెనుముప్పుగా మారుతున్న కృత్రిమమేధ
తప్పుడు ఆడియో, వీడియోలతో గందరగోళం
కలకలం రేపుతున్న అమిత్ షా డీప్ ఫేక్ వీడియో
రిజర్వేషన్లనే రద్దు చేస్తామన్నట్టుగా ఎడిట్ చేసిన వైనం
దాన్ని షేర్ చేశారంటూ తెలంగాణ సీఎం రేవంత్‌కు సమన్లు
లోక్‌సభ ఎన్నికల వేళ డీప్ ఫేక్ బెడదపై సర్వత్రా చర్చ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగిస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా మారి్ఫంగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరలవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.
దీంతో సంబంధముందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు! సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్‌చార్జి, మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు! అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారన్నది రేవంత్‌పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది...
దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తోందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచి్చన వికృత శిశువు ‘డీప్ ఫేక్’ ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా మారిపోయింది. పారీ్టలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దు్రష్పచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే గాక ఓటర్లపైనా బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు! పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్‌లను వీలైనంతగా వాడుకుంటున్నాయి.
చౌక బేరం
డీప్ ఫేక్‌లను రూపొందించడానికి అవసరమైన కృత్రిమ మేధ సాధనాలు కారుచౌకగా అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే ఉచితం కూడా! దాంతో పారీ్టలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎడాపెడా డీప్ ఫేక్‌లను తయారు చేసి వదులుతున్నట్టు వాటి నిర్వాహకులే చెబుతున్నారు. టీవీ వార్తలు మొదలుకుని ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫాంల దాకా నకిలీ వార్తల రూపకల్పన, ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవి ఒకసారి జనంలోకి వెళ్లాక ఏం చేసినా నష్ట నివారణ కష్టమే.
ఏఐ వాడకం..
బీజేపీతోనే మొదలు...
» ప్రచారంలో సాంకేతికతను వాడకంలో అధికార బీజేపీ ఎంతో ముందంజలో ఉంది.
» ఆ పార్టీ 2012లోనే మోదీ త్రీడీ హాలోగ్రామ్‌ను వాడింది! దీని ద్వారా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు.
» ఈ వ్యూహాన్ని 2014 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేశారు.
» ప్రచారం కోసం డీప్‌ఫేక్‌లను వాడిన తొలి నేతగా ఢిల్లీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారీ నిలిచారు. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందీ, హర్యాణ్వీ, ఇంగ్లిష్ భాషల్లో ఓటర్లనుద్దేశించి మూడు వీడియోల్లో ప్రసంగించారు. వీటిలో హిందీ వీడియో మాత్రమే అసలుది. మిగతా రెండూ డీప్ ఫేక్‌లు. కానీ ఏ మాత్రమూ గుర్తించలేనంత పకడ్బందీగా తివారీ గొంతు, పెదవుల కదలిక తదితరాలను మార్చారు!
గతి తప్పుతున్న వ్యూహం
అధికారికంగా, బహిరంగంగా జరిగే డీప్ ఫేక్ వ్యవహారాన్ని మించి ప్రత్యర్థులపై బురదజల్లేలా ‘అనైతిక ప్రచారం’ జోరుగా సాగుతోంది. వాట్సాప్‌లో అంతర్జాతీయ నంబర్లు, ఇన్‌స్టా్రగాంలో బర్నర్ హ్యాండిల్స్ తదితరాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రజలను చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థుల వీడియోలు, ఆడియోలకు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌ను జోడిస్తూ డీప్ ఫేక్‌లు హోరెత్తిస్తున్నాయి. పలు సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారీతో పాటు దాన్ని వైరల్ చేసే బాధ్యతనూ తీసుకుంటున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా నిర్మాణ కారి్మకుల ఫోన్ నంబర్ల సాయంతో డీప్ ఫేక్‌లను విచ్చలవిడిగా వైరల్ చేశారు. అభ్యర్థులు అవినీతిపరులని చూపేందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నట్టు, డబ్బు పంచుతున్నట్టు వీడియోలు, ఆడియోలు రూపొందించి ప్రచారం చేశారు. ప్రత్యర్థులపైనే గాక సొంత పారీ్టలోనూ శత్రువులపైనా కొందరు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారు!
చట్టాలకావల
మన దేశంలో డీప్ ఫేక్ ఎన్నికల సమగ్రతకే ముప్పుగా మారుతోంది. ప్రస్తుత చట్టాలేవీ డీప్ ఫేక్‌ను స్పష్టంగా నిర్వచించడం లేదు. వ్యక్తిగత కేసుల్లో ఐటీ చట్టంతో కలిపి, పరువు నష్టం, నకిలీ వార్తలు, వ్యక్తి ప్రతిష్టకు భంగం, ప్రైవసీ ఉల్లంఘన వంటి చట్టాలను వాడుతూ పోలీసులు నెట్టుకొస్తున్నారు.
నిరాశపరిచిన మ్యూనిచ్ ఒప్పందం
డీప్ ఫేక్‌లను నియంత్రించాలంటూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ సాధనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ప్రముఖ టెక్ కంపెనీలు మ్యూనిచ్ సదస్సులో ఒప్పందానికి వచి్చనా ఆచరణలో పెద్దగా జరిగిందేమీ లేదు.
గతేడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటిదే జరిగింది. కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ బీఆర్‌ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న వీడియో క్లిప్ పోలింగ్‌కు ముందు రోజు తెగ వైరలైంది. దాన్ని లక్షలాది మంది చూశారు. ఇదీ కృత్రిమ మేధ సాయంతో రూపొందిన డీప్ ఫేక్ వీడియోనే.
నోట్ దీజ్ పాయింట్స్
» భారత్‌లో జనాభాలో సగానికి పైగా, అంటే ఏకంగా 76 కోట్ల పై చిలుకు ఇంటర్నెట్ వినియోగదారులున్నారు.
» కనుక ఆన్‌లైన్ ప్రచారం శరవేగంగా ప్రజలను చేరుతోంది.
» రీల్స్, షార్ట్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క క్లిక్, ఒక్క స్వైప్‌తో ఓటరు అభిప్రాయాన్ని మార్చొచ్చు. కనీసం ప్రభావితం చేయొచ్చు.
» పార్టీ అభిమానులు పెద్దగా పట్టించుకోకున్నా తటస్థ ఓటర్లను ఇలాంటి ప్రచారం ప్రభావితం చేయగలదు.
» ఈ అంశాన్ని తమ అభిమాన పార్టీలకు సానుకూలంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
» అందుకే కృత్రిమ మేధతో పుట్టుకొచ్చే ‘మానిప్యులేటెడ్ కంటెంట్’ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అనేక రెట్లు పెరగనుందని అంచనా.
తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలిపెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్‌ఫేక్‌లను నియంత్రించాల్సిన అవసరముంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి
– కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషీ
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment