Mullapudi Venkataramana
-
అవార్డులూ.. బహుమతులూను
‘అవార్డులు రావు. కష్టపడి సంపాదించుకోవాలి’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు ఒకసారి అన్నారు. సాహిత్యం, ఆ మాటకొస్తే ఏ కళైనా ప్రచారం కోరుకుంటుంది. ప్రచారం దేనికి? కీర్తి కోసం అనుకునేవారు కొందరు. కళ నిర్వర్తించాల్సిన పరమార్థం కోసం అనుకునేవారు కొందరు. ఉత్కృష్టమైన కళ మబ్బుల చాటు సూరీడు వలే ఎల్లకాలం దాగి ఉండదు. జనులకు తెలిసే తీరుతుంది. ఆదరణ పొందుతుంది. కాని బంగారు చేటకు కూడా గోడచేర్పు అవసరం అన్నట్టు కొన్నిసార్లు కళ ప్రచారం కావడానికి, ఫలానా కళాకారుడి కృషి చూడండహో అని తెలుపడానికి అవార్డులూ, బహుమతులూ ఉపయోగపడతాయి. అయితే కాలక్రమంలో ఇడ్లీ కంటే చట్నీకి విలువెక్కువైనట్టు కళ కంటే ఈ అవార్డులకు విలువ ఎక్కువై అవార్డు వచ్చినవారు ‘గొప్పవారేమో’ అనే భావన జన సామాన్యులలో ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ఏదో పాత్ర చేత అనిపిస్తారు. చచ్చు పుచ్చు పుస్తకాలు ఎన్ని రాసినా ఒక సరైన అవార్డు కొడితే తల ఎగరేస్తూ తిరగొచ్చు కదా అనుకునే స్త్రీ పురుష సాహితీకారులు నేడు ఇరు రాష్ట్రాలలో తగు మోతాదులో మేట వేశారనే వాస్తవిక అపోహ ఉంది. జోకులు చలామణీలో ఉన్నాయి. ఒక ప్రఖ్యాత కవికి సరస్వతీదేవి ప్రత్యక్షమై ‘వత్సా! కవిత్వం కావలెనా? న్యూఢిల్లీ వారి ఫలానా సాహితీ అవార్డు కావలెనా?’ అని అడిగితే ఆ కవి సెకను తొట్రుపడకుండా ‘కవిత్వమే దయచేయి తల్లీ! అవార్డును ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను’ అన్నాట్ట! మనుషులంటూ ఉన్న ప్రతిచోటా తప్పులు, పొరపాట్లు ఉన్నట్టే అవార్డు అనే మాట ఉన్న చోటల్లా తప్పులూ, పొరపాట్లూ, రాజకీయాలూ, బానిసలకు వరాలూ ఉంటాయి. సాహిత్యంలో సర్వోన్నతమైనదిగా భావించే నోబెల్ పురస్కారం టాల్‌స్టాయ్‌కి రాలేదు. ఆయనకు కాకుండా ఆ తర్వాత దాదాపు 39 మంది నవలాకారులకు నోబెల్ ఇచ్చారు. వారంతా ‘మేము టాల్‌స్టాయ్‌కి వారసులం మొర్రోయ్’ అన్నారు. గాంధీకి నోబెల్ శాంతి ఇవ్వలేదుగాని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన మార్టిన్ లూథర్ కింగ్‌కు ఇచ్చారు. చైతన్య స్రవంతికి ఆద్యుడైన జేమ్స్ జాయిస్‌కి నోబెల్ రాలేదు. కథా చక్రవర్తయిన సోమర్సెట్ మామ్‌కు ఎందుకివ్వలేదయ్యా అనంటే ‘అతడు అక్కరకు మించిన ప్రచారం పొందాడు’ అని సాకు చెప్పారు. మన దగ్గర రవీంద్రనాథ్ టాగోర్‌కి సరే, ప్రేమ్‌చంద్, శరత్‌లు నోబెల్‌కు ఏం తక్కువ అని తూకం వేసి నిరూపిస్తే సదరు అవార్డు కమిటీ ఏం చెబుతుందో ఏమో! భారతదేశం వంటి దేశంలో రచయితలు, కవులు కేవలం తన రచనలతో బతికే పరిస్థితులు లేవు. ఎంతో గొప్ప అంకితభావం, ప్రతిభ, రచనాశక్తి, జనహిత అభిలాష కలిగిన రచయితలైనా బతుకు బాదరబందీలకు అవస్థలు పడుతూ కవిత్వమో, కథో రాయాలి. అప్పొసప్పో చేసి పుస్తకాలు వేసుకోవాలి. అవి అమ్ముడు పోకపోతే అటక మీద గుడ్డ కప్పి దాచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో వీరికి తృణమో పణమో ఇచ్చి అవార్డు చేతపెట్టి గౌరవించుకుందాం అనే సదుద్దేశ సాహితీ సంస్థలు అనేకమే వచ్చాయి. ఇవి తమ తమ అభిరుచి, అభిలాషల మేర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినా, వాటిలో ప్రతిష్ఠాత్మకస్థాయి కలిగినవి బహు స్వల్పం కావడంతో ప్రభుత్వపరంగా వచ్చే రాష్ట్ర అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రతిష్ఠాత్మకమై కూచున్నాయి. ‘షేక్స్పియర్కు ఏ అవార్డు వచ్చిందని నేటికీ చదువుతున్నారు’, ‘వేమనకు ఎవరు అవార్డిచ్చా రని ప్రతి నాలుక మీద పలుకుతున్నాడు’ అని ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా యోగ్యులైన సాహితీ కారులకు యోగ్యమైన అవార్డు వచ్చి తీరాలి. లేకుంటే అయోగ్యులు ఆ అవార్డులు పొందుతూ అవార్డుకు అయోగ్యతను తెచ్చి పెడతారు. అసలు సాహితీకారులు తమ వల్ల అవార్డుకు గౌరవం రావాలని కోరుకోవాలేగాని అవార్డు వల్ల తమకు గౌరవం రావాలనుకుంటున్నారంటేనే వీరెంత నిరుపేదలో అర్థం చేసుకోవచ్చు. ఇందుకై ఏళ్ల తరబడి పి.ఆర్ చేయుట, పెద్దలను మచ్చిక చేసుకొనుట, పథకాలు రచించుట, దొంగ పద్ధతిలో షార్ట్‌లిస్ట్‌లో చేరుట, కుల సమీకరణలు, ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇన్ని పతన సోపానాల మీద నడిచి అవార్డు తెచ్చుకుని అల్మారాలో పెట్టుకుని పొద్దున్నే అద్దంలో ముఖం ఎలా చూసుకుంటారో వీరు! నలుగురూ తిరిగే చోట తమ పుస్తకం పెట్టి, దాని మీద డబ్బు పెడితే ఆ డబ్బు కోసమైనా ఎవరూ పుస్తకాన్ని తీసుకెళ్లని నాసిరకం రచయితలు, కవులు కూడా ఫలానా అవార్డు కోసం పైరవీ చేసేవారే! వీరికి ఊ కొట్టే దిక్కుమాలిన జ్యూరీలు! ‘అవార్డు వస్తే ఏమవుతుంది’ అనంటే ‘నోరు మూతబడుతుంది’ అనేది ఒక జవాబు. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వపరమైన అవార్డులు తీసుకున్నాక ప్రభుత్వానికి ములాజా అవుతారు. ఈ కారణం చేత కూడా ప్రభుత్వాలు అవార్డులను సృష్టిస్తాయి, ఇచ్చి ప్రోత్సహిస్తాయి. తమిళ రచయిత జయమోహన్ తనకొచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఈ కారణం చేతనే తిరస్కరించాడు. అయితే సరైన రచయితలు తమకు అవార్డుల వల్ల వచ్చిన అదనపు గుర్తింపును జనం కోసం ఉపయోగించడం మంచి స్ట్రాటజీనే! ప్రస్తుతం తెలుగునాట అవార్డుల దుమారం రేగి ఉంది. అవార్డు ఇస్తాం అనంటే గౌరవప్రదమైన సాహితీకారులు పరిగెత్తి పోరిపోయే స్థితి ఉంది. నాణ్యమైన రచనల పట్ల తెలుగు పాఠకలోకం ఉదాసీనత మాని, వాటిని అక్కున జేర్చుకుంటూ, ఆ రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ వెళ్లడమే దీనికి విరుగుడు. పాఠకుడి అవార్డులు, బహుమతులే ఇప్పుడు తెలుగు సాహిత్యానికి శ్రీ సరస్వతీ రక్ష. -
శ్రావణ మేఘాలు
శ్రావణమాసం కొద్దిరోజుల్లోనే రానుంది. ఇది ప్రకృతి మేఘమల్హరాలాపనతో పరవశించే మాసం. శ్రావణమాసానికి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకొంటారు. వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకొనే మహిళలు పట్టుచీరలతోను, నగలతోను కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందుకే శ్రావణమాసాన్ని ‘నగల మాసం, శనగల మాసం’ అంటూ చమత్కరించారు ముళ్లపూడి వెంకటరమణ. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే, శ్రావణమాసంలో కనిపించే కారుమబ్బులు, అవి కురిపించే కుండపోత వర్షాలు ప్రకృతి గమనంలోని సహజ పరిణామాలు. మేఘసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు’ అంటూ కారుమబ్బుల అందాలను కళ్లముందు నిలిపారు కృష్ణశాస్త్రి. మేఘాల గురించి ‘గాథా సప్తశతి’లో ఒక అరుదైన, అపురూపమైన వర్ణన ఉంది. ‘అవిరల పడంత నవజల ధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ/ అపహుత్తో ఉఖేతుం రస ఇవ మేహో మహింవు అహ’. అంటే, వర్షధారల దారాలతో భూమిని బంధించి పైకి లాగేయడానికి మేఘం విఫలయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మేఘం ఎంతో కష్టపడుతోంది. అందుకు నిదర్శనం– అది చేస్తున్న ఉరుముల హూంకారాలే! ఇంతటి కవి చమత్కారం మరే భాషా సాహిత్యంలోనూ కనిపించదు. మబ్బులు కమ్ముకున్నాక, అవి ఉరుములు ఉరమడం, మెరుపులు మెరవడం, చినుకులు కురవడం సహజమే! అలాగని ప్రతి మబ్బూ వాన కురుస్తుందనే భరోసా ఏమీ లేదు. మబ్బుల్లో నాలుగు రకాలు ఉంటాయని, అలాగే మనుషుల్లోనూ నాలుగు రకాలు ఉంటారని బుద్ధుడు తన శిష్యులకు ఎరుకపరచాడట! ఉరుములు ఉరిమినా చినుకు కురవకుండానే వెళ్లిపోయేవి ఒకరకం, ఉరుములు మెరుపులు లేకపోయినా చినుకులు కురిసిపోయేవి మరోరకం, ఉరుములు మెరుపుల సందడితో వాన హోరెత్తించేవి ఒకరకం, ఉరుముల శబ్దం చేయకుండా, చినుకైనా కురవకుండా తేలిపోయేవి ఇంకోరకం. మేఘాల స్వభావం లాగానే మనుషుల స్వభావాలూ ఉంటాయి. ఊరకే నీతులు చెబుతూ ఆచరించని వాళ్లు ఒక రకం, శాస్త్రాలు చదువుకున్నా వాటి సారాన్ని గ్రహించని వాళ్లు ఇంకో రకం. శాస్త్రాలు చదవకున్నా, ధర్మసారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు ఒకరకం, శాస్త్రాలు చదివి, వాటి సారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు మరోరకం. సాహిత్యంలోను, కళల్లోను మబ్బులు రకరకాల భావనలకు సంకేతాలుగా చలామణీలో ఉన్నాయి. దిగులుకు, దుఃఖభారానికి, అంతుచిక్కని రహస్యానికి, అనిశ్చితికి, ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా మబ్బులను పోల్చుతారు. అంతేకాదు, మబ్బులు క్షాళనకు కూడా సంకేతాలు. మబ్బులు కురిపించే వానలో నేల మీద ఉన్న చెత్తాచెదారం కొట్టుకుపోయినట్లే, దుఃఖ వర్షం తర్వాత గుండెలో గూడు కట్టుకున్న దిగులు కొట్టుకుపోయి మనసు తేటపడుతుందని కొందరి భావన. ‘భారమైన హృదయాలు దట్టమైన మబ్బుల్లాంటివి. వాటి నుంచి కాస్త నీటిని బయటకు పోనిస్తేనే మంచిది. అప్పుడే ఊరట చెందుతాయి’ అంటాడు అమెరికన్ రచయిత క్రిస్టఫర్ మోర్లే. మేఘతతులు ఎరుకకు, పరివర్తనకు, కలలకు కూడా సంకేతాలు. అయితే, ఎక్కువగా మబ్బులను దిగులుకు, ప్రతికూలతలకు సంకేతంగానే భావిస్తారు. సాహిత్యంలోనూ ఇలాంటి వర్ణనలే కొంత ఎక్కువగా కనిపిస్తాయి. ‘భారమైన మేఘాలు నక్షత్రాలను ఆర్పేస్తున్నాయి’ అని తన ‘నైట్ ఫ్లైట్’ నవలలో వర్ణించాడు ఆంటోయిన్ డి సెయింట్ ఎక్సు్యపెరీ. పైలట్‌గా పనిచేసినప్పుడు నక్షత్రాలను మేఘాలు కమ్మేసిన దృశ్యాలను క్లోజప్‌లో చూసిన అనుభవం ఉన్నవాడాయన. దట్టంగా కమ్ముకున్న మబ్బులు పగలు సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి, నక్షత్రాలను కనపించనివ్వవు. అలాగని ఆకాశంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు అదృశ్యమైపోవు. తాత్కాలికంగా అలా అనిపిస్తాయంతే! మబ్బులు మటుమాయం కాగానే, మళ్లీ తమ సహజకాంతులతో కనిపిస్తాయి. గుండెలోని గుబులు, మనసులోని దిగులు కూడా అంతే! దిగులు మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన మనసులోని ఆశలు పూర్తిగా అడుగంటిపోవు. అందుకే, ‘మబ్బులకు ఆవల సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాడు’ అంటాడు అమెరికన్ రచయిత పాల్ ఎఫ్. డేవిస్. ఉరిమే ప్రతి మబ్బూ కురవదని లోకోక్తి. వ్యర్థ ప్రసంగాలతో హోరెత్తించే వారికి ఇది చక్కగా వర్తిస్తుంది. ‘వాగ్దానం మబ్బు మాత్రమే, అది నెరవేరినప్పుడే వాన కురిసినట్లు’ అని ఇంగ్లిష్ సామెత. వాగ్దానకర్ణులైన రాజకీయ నాయకులకు ఇది అక్షరాలా సరిపోతుంది. ‘ఎంతటి రాగి గొలుసులతోనైనా మబ్బులను బంధించలేము’ అనే సామెత కూడా ఉంది. నింగిలోని మబ్బులు స్వైరవిహారం జరిపే స్వేచ్ఛాసంచారులు. వాటి మానాన అవి ముందుకు సాగుతూనే పోతాయి. ప్రపంచంలో వాటిని బంధించే శక్తి ఏదీ లేదు. ఎక్కడైనా, ఎవరైనా స్వాభావికమైన స్వేచ్ఛను బంధించబూనితే, దాని పర్యవసానం మేఘవిస్ఫోటం కూడా కావచ్చు! ఇటీవల శ్రావణ భార్గవి అనే గాయని అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుని పదాన్ని పాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అనవసర దుమారానికి దారితీసింది. కొందరి అభ్యంతరాల ధాటికి ఆమె వెనక్కు తగ్గి, ఆ వీడియోను తొలగించింది. ఈ దుమారం సద్దుమణిగినా ఇదంత మంచి సంకేతం కాదు. ప్రజాస్వామ్య ప్రభలను మూకస్వామ్య దౌర్జన్యపర్జన్యాలు కబళించడం వాంఛనీయం కాదు. -
గోదావరి సీమపై ముళ్ళపూడి సంతకం
ముళ్లపూడి వెంకటరమణ.. ఈ పేరు తెలియని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే బుడుగు గుర్తొస్తాడు.. ఆ వెంటనే ఆయన కలం నుంచి జనించిన పాత్రలు ఇంకొన్ని కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల నైజాలు గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు కదలాడని పాఠకులు ఉండరనేది నిర్వివాదాంశం. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి) : ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్ కీపర్. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజింగ్ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం’ అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ. మద్రాసు వెళ్లాక, మధ్యలో రెండేళ్లు రాజమహేంద్రవరం, ఇన్నీసుపేటలోని వీరేశలింగం ఆస్తిక పాఠశాలలో సెకెండ్ ఫారం, థర్డు ఫారం (ఆధునిక పరిభాషలో 7, 8 తరగతులు) చదివినా, తుది శ్వాస వదిలేవరకు ముళ్లపూడి కావేరి నీళ్లనే సేవించారు. అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నగారే లావు).. అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, ‘తీతా’లు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే! గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడు పోసుకున్నాయి. సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకోవడానికి వెడుతూ ఆ రచన పూర్తి చేసేవారు. పాత్రికేయుడిగా ఉద్యోగపర్వం ప్రారంభం ఎస్సెస్సెల్సీ వరకు చదివిన రమణ నాటి అగ్రశ్రేణి పత్రిక ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగరంగ ప్రవేశం చేశారు. ఆయనలో రచయిత అదే సమయంలో కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచన.. అన్నీ ఈ దశలోనే జరిగాయి. సినీరంగానికి మలుపు.. ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్ మూగమనసులు.. మూడూ సూపర్ హిట్ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది. సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు. సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్‌లో రమణ కన్ను మూశారు. పుట్టిన గడ్డతో రమణ చివరివరకు ఎందరో ప్రముఖులతో అనుబంధాలు పంచుకున్నారు. మచ్చుకు కొందరి అంతరంగాలు పరికిద్దామా.. ముళ్లపూడి వెంకట రమణ చదువుకున్న పాఠశాలలో, ఆయన 88వ జయంత్యుత్సవం శుక్రవారం ఉదయం 10 గంటలకు కళాగౌతమి, తెలుగు సారస్వత పరిషత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈనాటికీ బాపు, రమణల కుటుంబాలతో అనుబంధాలు ‘హాస్యమందు అరుణ– అందె వేసిన కరుణ–బుడుగు వెంకట రమణ–ఓ కూనలమ్మా! అని ఆరుద్ర రమణని గురించి తన కవితలో పేర్కొన్నారు. బాపు, రమణలతో నాకు పరిచయం కలగడం, వారి కుటుంబాలతో నేటికీ సంబంధ బాంధవ్యాలు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. ఓ సారి ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు గీసి పంపితే, ఆయన జవాబు రాస్తూ, బాపు సంతకం కూడా ఆయనే చేసి, ఆథరైజ్డు ఫోర్జరీ అని రాశారు! అన్నట్టు ఋణానందలహరిలో ఆయన కథానాయకుడి పేరు (అప్పారావు), నా పేరు ఒక్కటే కావడం ఆదో విచిత్రం! – ఎంవీ అప్పారావు (సురేఖ) కార్టూనిస్టు నన్ను ‘కందుల హాయీ’ అనే వారు. బాపు అనారోగ్యానికి వైద్య నిమిత్తం ముళ్లపూడి రాజమహేంద్రవరం వచ్చారు. ఆయనకు సుమారు రెండు దశాబ్దాలుగా షుగరు వ్యాధి ఉండేది. సహవైద్యులు నా పేరు సూచించారు. మా ఇద్దరి మధ్య కేవలం డాక్టరు, పేషంట్ల సంబంధంగా ఉండేది కాదు. నాకు ఆయన పుస్తకాలు పంపేవారు. ఫోనులో తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఓ సారి నా మీద ఇలా కవిత రాసి పంపారు.. ‘మందొద్దంటూ చాల, ప–సందులు మింగించి, నన్ను సరిజేసి, తిరిగీ మందును పసందును చేసిన కందుల ‘శ్రీహాయిగార్కి’ వందన శతముల్’ – రమణ (మే 2006) ఎప్పుడైనా విమానాశ్రయానికి ఆయన్ను తీసుకురావడానికి వెడితే, ఆయన ఓ మూల కుర్చీలో కూర్చుని ఉండేవారు. బాపులాగా నాకు కూడా ‘జనగండం’ ఉందని చమత్కరించేవారు. – డాక్టర్ కందుల సాయి, డయాబెటిక్ కేర్, రాజమహేంద్రవరం -
శ్వాస.. ధ్యాస.. యాస.. గోదారే..
ఇదే ముళ్లపూడి వెంకటరమణ జీవిత రహస్యం సాహిత్యం, సినిమాలకు కేంద్రబిందువిదే ‘‘మా ఊరు ధవళేశ్వరం. గోదావరి ఒడ్డున రాంపాదాలరేవు. ఆ వీధిలో మొట్టమొదటి మేడ మా ఇల్లు. ఆనకట్ట పంతులుగారి మేడ మా ఇల్లు. పెద్దఅరుగులు, స్తంభాలు, మెట్లు, గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు చావిట్లో జై కుసుమకుమారి భజనలు, నట్టింట్లో దెయ్యాలను సీసాలలో బిగించే ముగ్గు పూజలు, బైరాగులూ- పెరటివసారాలో చుట్టాలు, వాళ్ల చుట్టాలకు పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ.. రాజమండ్రి నుంచి గుమ్మిడిదల దుర్గాబాయమ్మగారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్లకీ ‘మై తో హూం తూ తో హై’ అంటూ చెప్పే హిందీ పాఠాలు, పూనకాలు, శాంతులు, తర్పణాలూ.. ఒకసారి మానాన్న గారు ఆస్పత్రికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్లిపోయారు. ఇక రారు అని చెప్పారు. మా అమ్మమ్మ పడవెక్కి భద్రాచలం వెళ్లిపోయింది.’’ ‘‘ నేను మెడ్రాసులో ఫస్టు ఫారం పాసయ్యాక.. రాజమండ్రి వీరేశలింగం స్కూల్లో సెకండు, ధర్డుఫారాలు చదివాను. అప్పుడు స్కూలుకి నెలజీతం మూడు రూపాయలు. అది కట్టడానికి కొన్నాళ్లు శ్రీముడుంబై నరసింహాచార్యులు అనే జమీందారు సాయంచేశారు. కొన్నాళ్ల తరువాత ఆయన ఊరెళ్లిపోయారు. అప్పుడు ఆ మూడు రూపాయల కోసం, నన్ను ధవళేశ్వరం రమ్మన్నారు. మా నాన్నగారి నేస్తం అన్నంభట్ల సుబ్బయ్యగారు. ఆయన ఆనకట్టాఫీసులో పెద్ద గుమస్తా. ఒకటోతారీఖున-అంటే జీతాలు ఇచ్చే రోజున ఆయన ఒకప్యూన్ని తోడిచ్చి ఆఫీసులో అందరు ఉద్యోగుల దగ్గరకు పంపేవారు.‘ఇలా ఫలానా క్యాషు కీపరు పంతులు గారబ్బాయి రాజమండ్రిలో సెకండు ఫారం చదువుతున్నాడు. మూడు రూపాయల జీతం కట్టాలి-మీకు తోచింది ఇవ్వండి’ అని చెప్పేవారు. మూడు రూపాయలు పూర్తి కాగానే రాజమండ్రికి నడిచివెళ్లే వాడిని, అప్పుడప్పుడు జట్కాల వెంట పరిగెత్తేవాడిని, కంకరరాళ్లు. అప్పటికింకా తారురోడ్డు పొయ్యలేదు. ఇంటికెళ్లి నేను కూడా-గదిలో మంచం మీద బోర్లా పడుకుని ఏడిచేవాడిని. మా అమ్మమ్మ కాళ్లకి మంచి నూనె రాసి మెల్లగా తోమేది. నిద్రపోయి ఎప్పుడో లేస్తే, మజ్జిగన్నం పెట్టేది.’’ ఇవే కాదు ఇలా ఎన్నో విషయాలు, విశేషాలను అనుభవాలను సినీరచయిత, నిర్మాత, బాపు ఆత్మీయ స్నేహితుడు ముళ్లపూడి వెంకటరమణ ఆయన స్వీయ చరిత్ర ‘కోతికొమ్మచ్చి’లో పదిలపరిచారు. గోదావరితో తనకున్న అనుబంధాన్ని.. గోదావరిపై ఉన్న మక్కువను తెలియపరిచారు. అందుకే ఆయన కలం నుంచి జాలువారిన ‘రెండు జెళ్ల సీతలు, బుడుగులు, సీగాన పెసూనాంబలు, అప్పారావులు, లావుపాటి పక్కింటి పిన్నిగారి ‘ముగుళ్లూ’.. ఇలా అందరిదీ గోదావరి మాండలికమే. ఇక ఆయన సినిమాల్లోని ‘ఆమ్యామ్యా’ రామలింగయ్యలు, ‘తీ.తా’లు(తీసేసిన తాసీల్దార్లు), కనెక్షన్ కన్నప్పలు, గోదావరి చుట్టూ ఆడుకున్నవారే. సినీ రచయితగా, నిర్మాతగా ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన ముళ్లపూడి ‘గోదావరి మా ఫిలిం స్టూడియో’ అంటూ తరచూ బాపుతో అనేవారంటే.. గోదావరి అంటే ఆయనకు ఎంత భక్తో, ప్రేమో, ఇష్టమో చెప్పొచ్చు. - సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్, నేడు హాస్య బ్రహ్మ ముళ్లపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా... గోదావరి అంటే ప్రాణం, భక్తి, ప్రేమ రమణగారు సొంత సినిమా తీస్తున్నప్పుడు రాసుకోవడానికి సాధారణంగా రాజమండ్రి లాంచీ మాట్లాడుకుని భద్రాచలం వరకు వెళ్లేవారు. ఆయనకు గోదావరి అంటే ప్రాణం, భక్తి, ప్రేమ కూడా. భద్రాచలంలో దైవదర్శనం చేసుకుని వచ్చేవారు. ఒక్కరూ ఎప్పుడూ వెళ్లరు. బాపుగారు, శ్రీరమణగారు, ఎమ్వీఎల్, సీతారాముడు, కె.వి. రావు ఎంతమందివీలైతే అంత మంది వెళ్లేవారు. వారం రోజులు లాంచి ప్రయాణానికి కావలసిన వంట సామాన్లు, కూరలు వగైరాలు, మందీమార్బలంతో వెళ్లేవారు. - ముళ్లపూడి శ్రీదేవి,(అర్ధాంగి) -
నాన్న, మావలను చూస్తున్నట్టే ఉంది
కొత్తపేట: రాజమండ్రిలో ప్రతిష్టించనున్న విఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు, సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకటరమణల జంట విగ్రహం నమూనాను చూసి బాపు కుమారుడు వెంకటరమణ ముగ్ధుడయ్యారు. ‘నాన్న, మావ(రమణ) విగ్రహాలు చూస్తుంటే వారిని సజీవంగా చూస్తున్నట్టే ఉంది’ అన్నారు. వెంకట రమణ, ఆయన భార్య భారతి, సోదరి చెల్లపల్లి భానుమతి, ముళ్ళపూడి వెంకటరమణ తమ్ముడు ప్రసాద్ కోడలు ఉదయ శుక్రవారం కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలను సందర్శించారు. అక్కడ రూపు దిద్దుకుంటున్న బాపు, రమణల జంట విగ్రహం నమూనాను చూసి పులకించిపోయారు. శిల్పి రాజ్‌కుమార్‌ను అభినందించారు. నాన్నా, మావలది విడదీయరాని బంధమన్నారు. వారితో పాటు బాపు సన్నిహితుడు, కోనసీమ చిత్రకళాపరిషత్ అధ్యక్షుడు కురసాల సీతారామస్వామి, కొత్తపేట కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు తదితరులున్నారు.